Home News నవ్యకాంతుల సిరి సంక్రాంతి

నవ్యకాంతుల సిరి సంక్రాంతి

0
SHARE

-డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఏటా పుష్యమాస బహుళ పక్షంలో వచ్చే ఈ పండుగ సమాజంలోని అన్ని వర్గాలకు ఆనందదాయకమైనది. ఇది అందరికీ పండుగే అయినా కర్షకులకు అతి ముఖ్యమైనది. రైతులకు సిరులు కురిపించి వారి కళ్లలో ఆనందకాంతులు నింపే పండుగ. సకల జీవరాశుల మేలు కోరే అన్నదాతలు పశుపక్ష్యాదుల పట్ల ఉదారతను కనబరుస్తారు. చేలలో వరిని కోసినప్పుడు కొన్ని కంకులను పక్షులకు ఆహారంగా ఇళ్ల చూరులకు వేలాడదీస్తారు. తనకు దక్కిన దానిలో కొంతయినా తిరిగి ప్రకృతికి చెందాలను కోవడం ‘బతుకు`బతికించు’ అనే దానికి నిదర్శనం. సంక్రాంతి నాలుగు రోజుల పండుగ భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే పేర్లతో ఘనంగా జరుపుకుంటారు. ఈసారి ముక్కోటి ఏకాదశి భోగి ముందు రోజు రావడం విశేషం.

సంక్రాంతి ఆనందానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక. ‘సం’ అంటే మిక్కిలి, ‘క్రాంతి’ అంటే ప్రగతి పూర్వక మార్పు. ‘సంక్రమణం’ అంటే ‘చక్కగా క్రమించడం’ అంటే ‘నడవడం’ అని భావం. సూర్యుడు ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించ డమే సంక్రాంతి. అలా నెలకొకసారి వచ్చే దానిని ‘మాస సంక్రాంతి’గా వ్యవహరిస్తారు. సర్వసాక్షి, సమస్త ప్రాణులకు జీవప్రదాత సూర్యభగవానుడు పుష్యమాసంలో మరకరాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఆనాడు సూర్యారాధనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. దక్షిణాయనానికి వీడ్కోలు పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతుంది. దక్షిణాయణం పితృదేవతలకు, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమని, కనుక ఉత్తరాయణాన్ని పుణ్యకాలమని చెబుతారు. దక్షిణాయనంలో మరణించిన వారికి ఉత్తమగతి ఉండదని, భీష్ముడు కురుక్షేత్రంలో దక్షిణాయనంలోనే అంపశయ్యపై ఒరిగినా ‘ఇచ్ఛా మరణం’ వరంతో ఉత్త రాయణం వరకు ప్రాణం నిలుపుకున్నారని పురాణ గాథ. అంపశయ్యపై ఉన్నప్పుడే పాండుసుతాదులకు విష్ణు సహస్ర నామాలను బోధించారు.

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంతో ఉష్ణోగ్రతలలోనూ మార్పులు వస్తాయి. సూర్యకిరణాల్లో తీక్షణ హెచ్చుతుంది.

భోగి

పంటలు ఇచ్చినందుకు కృతజ్ఞతతోనూ, త్వరగా తొలకరిని అనుగ్రహించాలని, రానున్న వేసవి తీవ్రతను తగ్గించాలన్న ప్రార్థనతో భోగినాడు ఇంద్రుడికి పొంగలిని నివేదిస్తారు. దానిని ‘ఇంద్ర పొంగలి’ అంటారు. భోగినాడు చిన్నారులకు భోగి (రేగు) పండ్లు పోస్తారు. దీనివల్ల బాలారిష్టాలు తొలగి సుఖ శాంతులు కలుగుతాయని విశ్వాసం. నర నారాయణులు బదరికావనంలో తపస్సు చేసినప్పుడు బదరీ (రేగు) పండ్లతో ఆకలి తీర్చుకున్నారట. వారి ఆశీస్సులు కావాలన్నట్లు భోగినాడు చిన్నారులపై రేగుపళ్లు, బంతిపూలరేకులు, చిల్లర పైసలు కలిపి తలంబ్రాలుగా పోస్తారు.

భోగి నాడు వేకువజామునే లేచి భోగిమంటలు వెలిగించి పాత వస్తువులు, సామాగ్రిని అందులో వేస్తారు. ఆవి భోగిమంటలకు ఆహుతి కావడంతో తమ దారిద్య్రం కూడా తీరుతుందని, దక్షిణాయన కష్టాలకు వీడ్కోలు చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికినట్లుగా భావిస్తారు. మనసులో తపస్సు అనే అగ్నిని జ్వలింపచేసుకొని అరిషడ్వర్గాలను దహింపచేయడం ద్వారా కోరికలకు అతీతుడై భగవంతుడిని చేరవచ్చని సూచించేవే భోగి మంటలని పెద్దలు చెబుతారు.

ఉభయ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పండుకను జరుపుకుంటారు. మహారాష్ట్ర, గోవాలలో బంధువులు, స్నేహితులకు విందు ఇస్తారు. వివాహితలు ఇరుగు పొరుగు మహిళలను ఆహ్వానించి వంటింటి సామాగ్రి, వస్త్రాలను దానం చేస్తారు. ఒడిశా, పంజాబ్‌ తదితర రాష్ట్రాలలో భోగి మంటలు వేస్తారు. పంజాబ్‌లో లోహ్రి పేరుతో భోగి పండుగను జరుపుకొని, చెరకు, బెల్లం, బియ్యం వంటివి అందులో వేస్తారు.

సంక్రాంతి సందర్భంగా మహిళలు చేపట్టే నోముల్లో బొమ్మల వ్రతం ముఖ్యమైనది. భోగికి ముందు రోజు బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు కొనసాగిస్తారు. దీనివల్ల గ్రహ బాధలు తొలగుతాయని విశ్వాసం. కొలువు పూర్తయిన తర్వాత మరుసటి సంవత్సరం కోసం వాటిని భద్రపరుస్తారు. అయితే తర్వాతి పండుగ నాటికి ఆ బొమ్మల సమూహంలో కొత్తది కనీసం ఒకటైనా చేరాలన్నది నియమం. ఒకప్పుడు ప్రత్యేకంగా బొమ్మలు తయారు చేసేవారు. బొమ్మల తయారీ అనేకులకు జీవనో పాధిగా ఉండేది. ఏటికొప్పాక, కొండపల్లి, నిర్మల్‌ వంటి ప్రాంతాలలో ప్రత్యేక బొమ్మలతో పాటు వెదురు, మట్టితో తయారుచేసే వృత్తికళాకారులు ఉండేవారు.

గోదా కల్యాణం

విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి భగవంతుడినే భర్తగా భావించి ఆయననే పరిణయమాడాలని దీక్ష బూనారు. ఆ క్రమంలోనే ధనుర్మాసంలో వేకువనే మేల్కొని స్నేహితురాళ్లతో కలిసి విష్ణు పూజ చేస్తూ, ఆ అనుభవాలను రోజుకు ఒక పాట (పాశురం)గా రాసి శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరంగ నాథుడికి అంకితమిచ్చారు. అదే ‘తిరుప్పావై’. ‘తిరు’ అంటే ‘శ్రీ’, ‘పావై’ అంటే పాట(లు)లేక వ్రతమని అర్థం. తిరుప్పావై అని తమిళపదానికి శ్రీ వ్రతం లేదా సిరినోము అర్థం. అమె భక్తికి, దీక్షకు మెచ్చిన రంగనాథుడు వివాహమాడతాడు. ఆ వెంటనే ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో లీనమైపోయారు. 108 దివ్య క్షేత్రాలలో అగ్రగామిగా పరిగణించే శ్రీరంగంతో పాటు ఇతర వైష్ణవ క్షేత్రాలలో ఏటా భోగినాడు గోదా రంగనాథుల కల్యాణం జరుగుతుంది.

భారతీయ భక్తి సాహిత్యంలో ఆళ్వార్‌ దివ్య ప్రబంధాలు అత్యంత ప్రముఖ స్థానాన్ని అలంకరించేవి కాగా, వాటిలో గోదాదేవి విరచితమైన ముప్పయ్‌ పాశురాల ‘తిరుప్పావై’ శిఖర సమానంగా వెలు గొందుతోంది. ‘తిరు’ అనే దానికి శ్రీ, లక్ష్మి, సంపద, శ్రేష్ఠం, ఐశ్వర్యం, మోక్షం అనే అర్థాలు ఉన్నాయి. సమాజానికి హితం కలిగించేదే సాహిత్యమని ఆలంకారికులు అన్నట్లు, ఆమె రాసి, పాడిన పాశురాలలో సమాజశ్రేయస్సు కనిపిస్తుంది. రంగనాథుని పరిణయమాడాలన్న అభిమతంతో పాటు సాహిత్యం ద్వారా సమాజ హితాన్ని కోరిన సౌజన్యమూర్తిగా గోదాదేవి సాక్షాత్కరిస్తారు. కేవలం వ్యక్తిగత ప్రయోజ నాల కోసం కాకుండా సమష్టి లబ్ధి చేకూరాలన్న తపన ఇందులో వ్యక్తమవుతుంది. ‘ఏడాదికి మూడు పంటలు పండాలి. గోవులు సమృద్ధిగా పాలు ఇవ్వాలి. సరిపడినంత వర్షం కురవాలి. ఏ సందర్భం లోనూ ‘లేదు’ అనే మాట వినిపించకూడదు’ అని ఒక పాశురంలో ఆకాంక్షిస్తారు.

సంక్రాంతి

సూర్యుడు నెలకు ఒక రాశి వంతున ఏడాదిలో పన్నెండు రాశులలో ప్రవేశిస్తాడు. ఈ ప్రక్రియను సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అయితే పుష్య మాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సంక్రాంతినే పర్వదినంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగను తప్ప ఇతర పండుగలన్నిటిని తిథుల (చాంద్రమానం) ప్రకారం జరుపుకుంటారు. దీనిని మాత్రమే ‘సంక్రాంతి’ అని వ్యవహరిస్తారు. ఆ రోజే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు భూమధ్య రేఖకు దక్షిణ దిక్కులో ఉన్న సూర్యుడు ఉత్తర దిక్కుకు మారతాడు. కనుకనే దీనిని ఉత్తరాయణం అంటారు. మకర సంక్రాంతితో ఆరంభమయ్యే ఉత్తరాయణంలో వాతావరణంలో మార్పులు వస్తాయి. పగటి వేళలు పెరుగుతాయి. అప్పటి వరకు సుదీర్ఘంగా ఉండే రాత్రి వేళలు సంక్రాంతి తర్వాత తగ్గుతాయి. ఆకాశం ఆహ్లాదమవుతుంది.

సంక్రాంతిని పెద్దల పండుగ, పంటల పండుగ, పశువుల పండుగ అంటారు. ఆ రోజున పితృ దేవతలను స్మరిస్తూ దానధర్మాలు చేస్తారు. మకరరాశికి శని అధిపతి కనుక శని ప్రీతి కోసం తిలదానం ఆచారంగా వస్తోంది. తన పూర్వికులను పునీతులను చేసేందుకు భగీరథుడు గంగానదిని మకర సంక్రాంతి రోజున భువికి రప్పించాడని ప్రతీతి. వామనుడికి బలి చక్రవర్తి మూడడుగుల నేలను దానమివ్వగా, హరి రెండడుగులతో బ్రహ్మాండమంతా వ్యాపించి మూడవ అడుగుగా పాదాన్ని బలి శిరస్సున మోపి పాతాళానికి పంపినది ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలోనే. సృష్టి ఆరంభంలో శ్రీమన్నారాయణుడు మకరరాశిలోని శ్రవణ నక్షత్రంలోనే బ్రహ్మకు అనంత పద్మనాభస్వామిగా సాక్షాత్కరించాడట. సంక్రాంతి నాడు పంచసూక్త సహితంగా శివుడికి ఘృతాభిషేకం (నేతితో) చేయడం వల్ల మాఘపుణ్యఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు.

సంక్రాంతి అనగానే పల్లెలో మొదట స్ఫురించేది కోడిపందేలు. వీటిపై నిషేధం ఉన్నా అనధికారికంగా జరుగుతూనే ఉంటాయి. పండుగకు కొన్ని నెలల ముందే పందెం రాయుళ్లు కోడి పుంజుల పెంపకం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. వాటి రంగులను బట్టి డేగ, నెమలి, కాకి లాంటి పేర్లతో పిలుస్తారు.

కనుమ

గ్రామీణులకు… ముఖ్యంగా రైతులకు కనుమ చాలా ప్రీతిపాత్రమైన పండుగ. ‘కనుము’ అంటే పశువు అని అర్థం. మానవ మనుగడకు సహకరించే పశుపక్ష్యాదులకు కృతజ్ఞతలు చెప్పుకోవడమే కనుమ పండుగ పరమార్థం. గోసంరక్షణ, పశుపోషణ సమాజం కర్తవ్యమని ఈ పండుగ చాటి చెబుతోంది. వ్యవసాయానికి చేదోడువాదోడుగా నిలిచే పశువులకు కృతజ్ఞతాపూర్వకంగా కనుమ నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ రోజున ఎద్దులను శుభ్రంగా కడిగి గజ్జెలు, గంటలు, కుచ్చులు మెడకు, నడుముకు పట్టెడలతో అలంకరించి పొలం పనులు మొదలు పెడతారు. పంటలను చీడపీడల నుంచి కాపాడాలని కోరుతూ రైతులు ఆరుబయట సూర్యునికెదురుగా కొత్త కుండలో పాయసం వండి నివేదిస్తారు. అనంతరం ప్రసాదంగా స్వీకరించి, పొంగలిలో పసుపు, కుంకుమ కలిపి పొలాల్లో చల్లుతారు. దీనిని ‘పొలి చల్లడం’ అంటారు. కనుమను పల్లెటూళ్లలో ‘సంక్రాంతి పార్న’ అంటారు ‘పారణ’కు (వ్రతం) రూపాంతరం ‘పార్న’. పూజాదికాల తరువాత తీర్థప్రసాదాల తీసుకోవడం అని దీని అర్థం. తెలుగువారు దీనిని ‘పులగం’ అని, తమిళులు ‘మాట్టు పొంగల్‌’ అని అంటారు. కొత్త బియ్యం, కొత్త పెసరపప్పుతో పులగం వండుతారు. లేగంటి ఆవు పాలు, కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నం తయారు చేస్తారు. బాలకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలిపై నిలిపి నందగోకులాన్ని, పశువులను కాపాడిరది కనుమ నాడేనని చెబుతారు. ఏరువాక పున్నమి (జ్యేష్ఠ పూర్ణిమ) తరువాత రైతులు జరుపుకునే పెద్ద పండుగ ఇది. వర్షరుతువు ప్రారంభం కాగానే పొలం పనులు మొదలుపెడతారు.

ముక్కనుమ

కొత్తగా పెళ్లయిన యువతులు ముక్కనుమ నాడు సావిత్రీ గౌరీవ్రతం చేసి తొమ్మిది రోజుల బొమ్మల నోము ప్రారంభిస్తారు. ఇలా తొమ్మిదేళ్లు చేస్తారు. దీనివల్ల భర్త పట్ల అనురాగం పెరుగుతుందన్నది పెద్దల మాట. సంతానం కోరే మహిళలు నట్టింట్లో ఊయల ఏర్పాటు చేసి తొమ్మిది మంది ముత్తయిదువలు తెచ్చిన బొమ్మలను అందులో ఉంచి ఊరేగిస్తారు.

జాగృతి సౌజ‌న్యంతో…