Home Telugu Articles వనవాసుల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్

వనవాసుల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్

0
SHARE

-సామల కిర‌ణ్‌

దుర్లభం భారతం వర్షే అని శాస్త్ర వచనం. భారత దేశంలో జన్మించటమే మహా దుర్లభం అని అర్ధం. ఇక్కడ మనిషి పుట్టుకకు కారణం వెతుక్కునే అవకాశం ఉంది. అలాంటి కారణ జన్ములు అనేకులు మన భారతగడ్డ పై జన్మించారు. అలాంటి వారిలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఒకరు. సేవాలాల్ బంజారాల ఆరాధ్య దైవంగా నిలిచాడు. ఆయన లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చాడు. 10 కోట్ల లంబాడా ప్రజలు ఎక్కడైనా ఒకే రకంగా నేడు మాట్లాడుకోగలుగుతున్నారు. స్థిర నివాసం లేకున్నా తమ కట్టుబాట్లు , ఆచారవ్యవహారాలు, విలక్షణమైన దుస్తులు, ఆభరణాలతో బంజారాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. “సాతీ భవానీ (సప్త మాతృకల)’’ పూజా విధానాలు ఆచరించే బంజారాల జాతికి ఆయనే దార్శనికుడు. రాజుల కాలం నుం చి బ్రిటిష్‌ కాలం వరకు బంజారాలు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగించేవారు. ఆ క్రమంలో బ్రిటిష్‌, ముస్లిం పాలకుల మత ప్రచారంతో బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురయ్యింది. అలాంటి పరిస్థితులలో బంజారాలను మంచిమార్గంలో నడిపించడానికి సేవాలాల్‌ అవతరించారు.ఆయన బోధనల ద్వారా బంజారా జాతినడచుకుంది.

1739 ఫిబ్రవరి 15న అనంతపూర్‌ జిల్లా రాంజీనాయక్‌ తండాలో భీమా నాయక్, ధర్మిణి భాయి దంపతులకు జన్మించాడు. చిన్నతనం నుంచే ఆయనలో సేవాగుణం ఉండేది. ఆవులు కాయడానికి వెళ్తేటప్పుడు తల్లి కట్టియిచ్చిన సద్దిని తాను తినకుండా ఆకలితో ఉన్నవాళ్లకు పెట్టేసే వాడు. తాను బంకమట్టితో రొట్టెలు చేసుకొని తినేవాడు. ఈ వింత ప్రవర్తన తల్లితండ్రులకు, తండాలోని జనాలకు ఆశ్చర్యం కలిగించేది. జాతర్ల సమయంలో జంతుబలిని ఒప్పుకునేవాడు కాదు. ‘ఒకవేళ అమ్మవారికి బలి ఇష్టమైతే నేనే బలై పోతాను’ అని సేవాలాల్‌ అమ్మవారి కాళ్ల దగ్గర తన తలను ఉంచుతాడు.‘నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇవ్వమ’ని ప్రార్థిస్తాడు. అమ్మవారు కరుణిస్తుంది. ‘నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు. అతని నాయకత్వంలో ప్రయాణించండి’ అని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి జగదాంబ మాతనే తన గురువుగా స్వీకరించాడు. అన్ని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు. సేవాలాల్‌ మహరాజ్‌ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ‘పెరిఫర్‌’ ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. అహింస మహా పాపమని, మద్యం , ధూమపానం శాపమని హితవు పలికాడు. ఆ రోజుల్లోనే బంజారాల పరువు ప్రతిష్టల గురించి ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేశాడు. ఒకప్పుడు హైదరాబాదులో మశూచి వ్యాధి ప్రబలింది. అయితే, సంత్ సేవాలాల్ మహారాజ్ ఉన్న బంజారా హిల్స్ ప్రాంతానికి మాత్రం ఆ వ్యాధి సోకలేదు. ఆయన మహిమను గుర్తించిన రాజు… సేవాలాల్‌ ఆశీస్సులతో ఆ వ్యాధిని నిర్మూలించాడని చరిత్ర తెలుపుతోంది.

గిరిజనుల గొప్పతనం

బంజారాలు రాజపుత్రుల్లాంటి వారని చరిత్ర కారుడు క‌ల్న‌ల్‌ టాడ్ పేర్కొన్నారంటే… వారెంత దృఢకాయులో అర్థం అవుతుంది. లంబాడీలు, బంజారాలు, సుగాలీలు, గ్వార్ భాయ్ అని పిల‌వ‌బ‌డుతున్న ఈ గిరిజ‌నులు ప్ర‌పంచవ్యాప్తంగా గోర్ బంజారాలుగా పేరుపొందారు. మధ్య యుగంలో మ‌హ‌మ్మ‌ద్‌ ఘోరీకి వ్య‌తిరేకంగా పృథ్వీరాజ్ చౌహాన్ ప‌క్షాన పోరాడిన వీరోచిత చ‌రిత్ర బంజారాల సొంతం. ద‌క్క‌న్‌ పీఠ‌భూమిలో లంబాడీలు కాక‌తీయుల కంటే ముందే ఉన్నార‌ని, సంచార జాతివారైనా వీరు రజాకార్ల‌తో పోరాడార‌ని, నవాబులు వారి ధైర్య‌సాహసాల‌కు మెచ్చి భూముల‌ను ఇనాములుగా ఇచ్చారని చ‌రిత్ర చెబుతోంది. బంజారాలు ఎవ‌రికీ హాని త‌ల‌పెట్టేవారు కాద‌ని, స‌హాయ గుణం విరివిగా క‌ల‌వార‌ని, ధైర్య‌సాహ‌సాల‌కు ప్ర‌తీకలనీ చ‌రిత్ర ద్వారా తెలుస్తుంది. త‌ర‌త‌రాలుగా జాతి వివ‌క్ష‌కు గుర‌వుతూ ఆర్థిక, సామాజిక‌, రాజ‌కీయ అభివృద్ధిలో వెనుక‌బ‌డి ఉన్న లంబాడాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది

ఆచరణ శీలి-ఆదర్శం
సామాన్యునిగా పుట్టి అసామాన్యునిగా ఎలా ఎదగాలో ఆచరించి చూపిన మహానుభావుడు సంత్ శ్రీ సేవాలాల్. మనిషి మనీషిగా ఎలా ఎదగాలో నేర్పినవాడు. ఆదర్శవంతమైన ఆయన జీవితాన్ని అందరూ ఆచరించాలి. మహారాష్ట్రలోని పౌరాగఢ్ లో తుది శ్వాస విడిచారు. ఆయన జయంతి, వర్ధంతులను ఏటా అక్కడ ఘనంగా నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. బంజారాల మనోభావాలను అందరం కాపాడాలి. వనవాసులయినా, గిరివాసులయినా ఈ భారతవాసులే అనే స్పృహ తో మెలగాలి. అప్పుడే సమరసతా యుక్త, శోషణ ముక్త సమాజం నిర్మాణం అవుతుంది.

(ఫిబ్రవరి 15 సంత్ సేవాలాల్ జయంతి సందర్బంగా)

This article was first Published in 2021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here