Home News భైంసా బాధితుల‌కు భ‌రోసా… సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో నూత‌న ఇండ్ల నిర్మాణం

భైంసా బాధితుల‌కు భ‌రోసా… సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో నూత‌న ఇండ్ల నిర్మాణం

0
SHARE

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కోర్బాగల్లిలో 2020 జ‌న‌వ‌రిలో కొందరు దుండగులు చేసిన దాడిలో స‌ర్వం కొల్పొయిన హిందువుల కుటుంబాల‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ సేవాభార‌తి అండ‌గా నిలించింది. ఇండ్లు కాలిపోయి నిర్వాసితులైన 10 కుటుంబాల‌కు సేవాభార‌తి, కేశ‌వ సేవాస‌మితి ఆధ్వ‌ర్యంలో కోటి రూపాయ‌ల‌తో 10 నూత‌న ఇండ్ల‌ను నిర్మించింది. బుధ‌వారం(01.09.201) అఖిల భార‌త సేవాప్ర‌ముఖ్ ప‌రాగ్ జీ అభ్యంక‌ర్ చేతుల మీదుగా స‌మూహిక గృహప్ర‌వేశ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ప‌రాగ్ జీ అభ్యంక‌ర్ మాట్లాడుతూ హిందూ స‌మాజం సంఘ‌టిత కావాల్సిన అవ‌శ్య‌క‌త ఉంద‌ని అన్నారు. హిందూ స‌మాజంలో ఆత్మ విశ్వాసం స‌మ‌ర్ఫ‌ణా సేవా భావ‌ములు నిర్మాణం కావాల‌న్నారు. దేశంలో సేవాభార‌తి, ఆర్‌.ఎస్‌.ఎస్ ద్వారా జ‌రుగుతున్న సేవా కార్య‌క్ర‌మాల వివ‌రాలను ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ భైంసాలో హిందూ స‌మాజం మీద జ‌రుగుతున్న దాడుల‌ను ఖండించారు. హిందూ స‌మాజానికి అండ‌గా ఉంటాన‌ని పిల‌పునిచ్చారు. ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘ‌చాల‌క్ మాన‌నీయ బూర్ల ద‌క్షిణామూర్తి గారు మాట్లాడుతూ సేవాభార‌తి ద్వారా ఇండ్లు క‌ట్టించి ఇవ్వ‌డం చాలా సంతోష‌దాయ‌క‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర సంఘ‌చాల‌క్ కృష్ణ‌దాస్‌, సేవాభార‌తి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమూర్తి, హిందూవాహిని ప్రాంత అధ్య‌క్షులు హ‌రిశ్చంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

2020 జ‌న‌వ‌రి భైంసాలో హిందువులపై జ‌రిగిన దాడుల్లో 12 ఇండ్లు పాక్షికంగా దహనం కాగా ఒక 10 ఇండ్లు పూర్తిగా కాలిపోయాయి. వాహనాలు కూడా ద‌గ్ధ‌మ‌య్యాయి. ఆ బస్తీలోని ప్రజల పరిస్థితి భయంకరంగా, అందోళనక‌రంగా మారింది. ఈ స్థితిని చూసి నగరంలోని సేవా భారతి కార్యకర్తలు స్పందించి అనేక మంది దాతల సహకారంతో ఆ 22 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించి వారికి మ‌నోధైర్యాన్ని క‌ల్పించారు.

ఆ తరువాత సేవా భారతి కార్యకర్తలు ఇండ్లు కొల్పొయిన బాధితులకు ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు వారి సొంత స్థలంలోనే గృహాలు నిర్మించాల‌ని ఆలోచించారు. ఈ మేర‌కు సేవాభారతి తెలంగాణ ప్రాంతం, కేశవ సేవా సమితి భాగ్యనగర్ వారి స‌హ‌కారంతో 10 గృహాల‌ నిర్మాణాన్ని చేప‌ట్టారు.

మనమంతా హిందువులం… భారత మాత సంతానం మనమంతా ఒకే కుటుంబం అనే భావన నిర్మాణం కొరకు ఆపదల్లో, కష్టాల్లో ఉన్న తోటి సోదరులను ఆదుకోవాల‌నే భావనను నిర్మాణం చేయాలనే ఉద్ధేశ్యంతో ఈ గృహ నిర్మాణాలను చేపట్టడం జరిగింది. దీని కొరకు సమాజంలోని అనేక మంది దాతలు అనేక రకాలుగా సహకరించారు.

నూతనంగా నిర్మించిన ఈ 10గృహాలతో 50మందికి పునరావాసం లభించింది. వీరంతా నిరుపేదలే కావడం గమనార్హం. ఇందులో ఒకరు మాంసం అమ్ముకునే కటిక వృత్తిలో, ఇంకొకరు కిరాణా గుమాస్తాగా, మరొకరు భర్తను కోల్పోయిన వితంతువు కాగా ఇంకా ఇద్దరు వ్యవసాయం చేసుకునే చిన్న రైతులు. కేశవ సేవాస‌మితి సహకారంతో మొదలు పెట్టిన 8నెలల్లోనే పూర్తి చేసి అందించడం అదికూడా తాము కోల్పోయిన కోర్భా గల్లీలోనె తిరిగి నూతన గృహాన్ని సేవాభారాతి అందించడం మాకు మనోధైర్యం ఇచ్చిందని శారద అనే లబ్దిదారు త‌న ఆనందాన్ని పంచుకుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here