Home News వ‌ర‌ద బాధితుల‌కు సేవాభార‌తి నిత్యావ‌స‌రాల పంపిణీ

వ‌ర‌ద బాధితుల‌కు సేవాభార‌తి నిత్యావ‌స‌రాల పంపిణీ

0
SHARE

గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తం గా తయారైంది. ముఖ్యంగా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆహారం, మంచినీరు, మందులు ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.

సేవాభారతి సచ్ఛంద సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పలు సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈనెలలో వచ్చిన వరదల వలన దెబ్బతిన్న ప్రాంతాలలోని ప్రజలను ఆదుకోవడానికి సుమారు 300 మంది వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల భద్రాచలం, బూర్గంపాడు, మలింగూరు ప్రాంతాలు, ములుగు జిల్లా తొక్వయి, ఏటూరు నాగారం, వెంకటాపురం, వాజేడు మండలాలు, పెద్దపల్లి జిల్లా మంధని, గోదావరిఖని మండలాలు, మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, మంచిర్యాల మండలాలు భూపాల్ పల్లి జిల్లా మహదేవపూర్ మండలాల పరిధిలోని గ్రామాలు వరద వలన కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి. సేవాభారతి యుద్ద ప్రాతిపదికన ఈ గ్రామాలలోని ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. హైద్రాబాదు కేంద్రంగా ఈ గ్రామాలకు నిత్యావసర సరకులు, మందులు, బట్టలు, వంట పాత్రలు పిల్లలకు పాలపొడి మొదలగు కిట్స్ గత వారం రోజులుగా సరఫరా చేయబడతున్నాయి. ఒక కుటుంబానికి సుమారుగా 15 రోజులు సరిపడా బియ్యం, చింతపండు, పప్పులు, నూనె, సబ్బులు, కారం పొడి, పసుపు పాడి, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు తదితర 16 రకాల నిత్యావసర వస్తువుల కిట్లను దశల వారిగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాతల సహాయంతో 3000 పైగా కిట్ల సరఫరా జరిగింది, మొత్తంగా 15,000 కిట్ల సరఫరా లక్ష్యంగా సేవాభారతి పెట్టుకుంది. క్షేత్ర స్థాయిలో అవసరమైన చాలా ఆహారం మరియు మందులు అందజేయడం జరుగుతున్నది.

ఈ నిత్యావసర కిట్లను సమకూర్చడం కోసం 60 మంది వాలంటీర్లు 24 గంటలూ పనిచేస్తూ దశల వారిగా ఆయా గ్రామాలకు పంపించడం జరుగుతున్నది. గ్రామాల్లో సేవాభారతి వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ ఆయా కుటుంబాలకు కావలసిన నిత్యావసరాలు మరియు ఇతర ఇబ్బందులను తెలుసుకోవడం జరుగుతుంది. అకస్మాత్తు వరదల వలన జరిగిన ఈ అపార నష్టం యొక్క ప్రభావం ఇంకా 6 నెలలు కొన సాగుతుందని ఒక అంచనా. వ్యవసాయం, పశుసంపద, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

సేవాభారతి తాత్కాలికమైన ఉపశమనమే కాకుండా, వివిధ రకాలుగా నష్టపోయిన ప్రజలకు పునరావాస వసతుల గురించి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. ఇట్టి ఆపద సమయంలో కార్పొరేట్‌ కంపనీలు, దాతలు ముందుకు వచ్చి ఇతోధికంగా సహాయం చేయవలసిందిగా సేవాభారతి నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం 85005 85056 నంబరు గానీ 9618036965 గానీ సంప్రదించగలరు.