Home Telugu Articles సిసలైన జాతీయవాది అంబేడ్కర్‌

సిసలైన జాతీయవాది అంబేడ్కర్‌

0
SHARE
భారత రత్న బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ దార్శనికుడు. దేశం ఎదుర్కొంటున్న రాజకీయ సామాజిక సాంస్కృతిక సమస్యలకు ఒక నిర్దిష్ట పరిష్కార మార్గాలు చూపే స్పష్టమైన ఆలోచన కలిగిన వాడు. అంబేడ్కర్‌ జీవితానికి రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి సామాజిక న్యాయం, రెండు జాతీయ భావం. అంబేడ్కర్‌ జీవితాన్ని ప్రభావితం చేసిన గౌతమ బుద్దుడు, కబీర్‌, మహత్మఫూలేలు సమకాలీన సామాజిక సాంస్కృతిక దురాచారాలను తొలగించి దేశంలో ఒక సామాజిక ఐక్యతను సాధించేందుకు కృషి చేసినవారు. సనాతన ధర్మంలో ఏ విషయాలు చెప్పబడ్డాయో వాటికి విపరీత వ్యాఖ్యనాలు చేస్తూ సమాజంలో గందరగోళం నిర్మాణం చేసేందుకు ప్రయత్నించిన వారిని ఎదిరించినవారు బుద్ధుడు, కబీర్‌, మహత్మఫూలే. సామాజిక సమస్యల పరిష్కారానికి కాలనుగుణమైన మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న అంబేడ్కర్‌కు ఆ ముగ్గురు ప్రేరణ.
భారతీయ గ్రంథాలైన వేదాలలో ఉపనిషత్తులలో ఎక్కడా మనకు సామాజిక వివక్షత కనపడదు. బహుశ ఈ వివక్షత 12–-13 వందల సంవత్సరాల కాలంలో చోటు చేసుకుని ఉండవచ్చు అనేది వారి అభిప్రాయం. ముస్లింల దండయాత్ర ప్రారంభ దశలో వివక్షతకు బీజం పడిందని అన్పిస్తున్నది. రాజా దాహీ రాజ్యంపై ఇస్లాం మూకల అక్రమణ కారణంగా ఏర్పడిన కల్లోల పరిస్థితులలో సమాజంలో మతం మార్పిడులతో అనేక సమస్యలు చోటుచేసుకున్నాయి. కాబట్టి మన జాతీయ గ్రంథాలలో లేని ఈ దురాచారాల నుంచి బయట పడాలి. ఏ పునాదుల మీద ఈ సమాజం వేల సంవత్సారాల నుంచి నిలబడి ఉందో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉన్నదని గుర్తించి, తదనుగుణంగా జీవించిన వారు అంబేడ్కర్‌. ఒక జాతీయ నాయకుడిగా దేశానికి సంబంధించిన అనేక సమస్యలపై వారు చెప్పిన విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అంబేడ్కర్‌ జాతీయ దృష్టి కోణం మనకు అర్థమవుతుంది. అంబేడ్కర్‌కు కమ్యూనిజం గురించి స్పష్టమైన అభిప్రాయం ఉన్నది. 1937 సెప్టెంబర్‌ తొలి రోజుల్లో మైసూర్‌లో వెనుకబడిన తరగతుల వారి సభ జరిగింది. ఆ కార్యక్రమంలో అంబేడ్కర్‌ మాట్లాడుతూ ‘నేను కమ్యూనిస్టులతో చేతులు కలిపి సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కొందరు అంటూ ఉంటారు. నేను కమ్యూనిస్టులతో చేతులు కలిపి పని చేయటం అనేది అసంభవమైన విషయం. కమ్యూనిస్టులు అట్టడుగు వర్గాల అభ్యున్నతి గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ వారు అట్టడుగు వర్గాల కోసం చేసేది ఏమీ ఉండదు. తమ అంతిమ లక్ష్యం అయిన రాజ్యాధికారాన్ని సాధించుకునేందుకు అట్టడుగు వర్గాల వారిని ఉపయోగించుకుంటారు.
అట్టడుగు వర్గాలకు వాళ్లు శత్రువులు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు. మరో సందర్భంలో ‘దళితులకు కమ్యూనిజానికి మధ్య నేను ఒక ఇనుప గోడలా ఉంటూ దళితుల్లో కమ్యూనిజాన్ని వ్యాప్తి చెందనివ్వను’ అని విస్పష్టంగా ప్రకటించారు. దేశంలో కమ్యూనిజం వ్యాప్తి కాకుండా కృషి చేయాలని సూచిస్తూ ఉండేవారు. కాశ్మీర్‌ సమస్యకు ఒక కారణం 370 ఆర్టికల్‌. అంబేడ్కర్‌ ఆర్టికల్‌ 370 విషయంలో షేక్‌ అబ్దుల్లాతో చర్చించారు. ‘ఇండియా కాశ్మీర్‌ను కాపాడేందుకు, అభివృద్ధి చేసేందుకు మాత్రమే పని చేయాలి అని మీరు కోరుకుంటున్నట్లు కనబడుతోంది. కాశ్మీర్‌ ప్రజలు తాము కాశ్మీరులమని మాట్లాడుతూ భారతీయ పౌరులుగా అంగీకరించకపోవటం అతి పెద్ద సమస్య. భారతదేశంలోని ఇతర ప్రాంతాల పౌరులకు కాశ్మీరులో ఎటువంటి హక్కులు ఉండకూడదు అని కోరుకోవటం ఏమి సూచిస్తుంది?’ అని సూటిగా షేక్‌ అబ్దుల్లాను అడిగారు. ‘నేను భారత జాతీయ దృష్టి కోణంతో ఆలోచిస్తాను. నీ వాదనకు హేతువు లేదు. దానిని నేను అంగీకరించను, దేశానికి ద్రోహం చేయలేను’ అని స్పష్టంగా తిరస్కరించారు.
అంబేడ్కర్‌ ‘థాట్స్‌ అన్‌ పాకిస్థాన్‌’ అనే పుస్తకమే రాశారు. ముస్లింలను దగ్గర తీసుకోవాలని కాంగ్రెస్‌ వాళ్లు ఎంతో ప్రయత్నం చేస్తుండేవారు. సైమన్‌ కమిషన్‌ వచ్చినప్పుడు ఇక్కడ ముస్లింలు ముంబాయి నుంచి సింధ్‌ ప్రాంతాన్ని వేరు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ దానికి అంగీకరించింది. అంబేడ్కర్‌ ఆ డిమాండ్లను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ చివరకు సింధ్‌ప్రాంతం ముంబాయి నుంచి విభజింపపడింది. ఇస్లాం మతాన్ని గౌరవిస్తూనే ఇస్లామీకరణను అంబేడ్కర్‌ వ్యతిరేకించారు. విభజన అనంతరం పాకిస్థాన్‌లో ఉండిపోయిన షెడ్యూల్‌ తెగల హిందువులను వేగ వంతంగా ఇస్లామీకరించడంపై అంబేడ్కర్‌ తీవ్రంగా అభ్యంతరం తెలియచేశారు. 19 శతాబ్దపు చరిత్రకారులు అందులో ముఖ్యంగా ఇండాలజిస్టులు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని సమర్థించారు. మాక్స్‌ముల్లర్‌ లాంటి వాళ్లు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని సమర్థిస్తూ భారతదేశ చరిత్రను తిరిగి రాయటానికి ప్రయత్నం చేశారు. ఆర్య ద్రావిడ సిద్ధాంతం దేశంలో రాజకీయంగా సామాజికంగా అనేక సమస్యలు సృష్టిస్తూ వస్తున్నది. మతపరమైన కులపరమైన రాజకీయాలకు తెర లేపింది. ‘ఆర్యుల దండయాత్ర అనేది పాశ్చాత్య మేధావుల సృష్టి. అది ఎటువంటి తర్కానికి నిలబడలేదు. అపోహలు అబద్ధాలపై నిర్మాణం చేసిన సిద్ధాంతం, అది మన ఊహకు కూడా అందని సిద్ధాంతం’ అని ఆర్యద్రావిడ సిద్ధాంతం గురించి అంబేడ్కర్‌ వివరించారు. ‘బ్రాహ్మణులకు వ్యతిరేకంగా కొందరు ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించుకున్నారు’ అని అంబేడ్కర్‌ వ్యాఖ్యానించారు. గడిచిన మూడు నాలుగు దశాబ్దాలుగా రాజ్యాధికారం కోసం జరుగుతున్న సంఘర్షణలో దళితులే పావులు అవుతున్నారనేది చాలా స్పష్టం.
ఈ మధ్యకాలంలో అంబేడ్కర్‌ పేరుతో విశ్వవిద్యాలయాలలో ఏర్పడిన విద్యార్థి సంఘాలు అంబేడ్కర్‌ గురించి మాట్లాడుతూ వారి ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించడం కనబడుతుంది. ఈ మధ్య సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి దళితులు, కమ్యూనిస్టులు కలవాలని పిలుపునిచ్చారు. అట్లాగే ముస్లింల వెబ్‌సైట్‌ ‘టూ సర్కిల్‌.నెట్‌’లో దళితులు ముస్లింలు కలిస్తే రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చని రాశారు. ముస్లింలు రాజ్యాధికారం కోసం దళితులను దగ్గర తీసే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ మిషనరీలు దళితులను మతం మార్చి వారిని నిలుపుకునేందుకు రాజ్యాంగబద్ధంగా దళితులకు ఇస్తున్న రిజర్వేషన్లు వాళ్లకు కూడా వర్తింప చేయించాలని దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నాయి. ఏ శక్తులను అంబేడ్కర్‌ దళితులకు దూరంగా ఉంచాలని ప్రయత్నించారో ఆ శక్తులు ఇప్పుడు బహుసంఖ్యాకులైన దళితులను దగ్గరకు తీసే ప్రయత్నం చేస్తున్నాయి.
రాంపల్లి మల్లికార్జున్‌ రావు
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here