Home Telugu Articles చరిత్రకారుడు, పండితుడు, పాత్రికేయులు, ఉద్యమకారుడు – శ్రీ సురవరం ప్రతాపరెడ్డి

చరిత్రకారుడు, పండితుడు, పాత్రికేయులు, ఉద్యమకారుడు – శ్రీ సురవరం ప్రతాపరెడ్డి

0
SHARE

-ప్రదక్షిణ 

అత్యుత్తమ తెలుగు పండితులు, రచయిత, చరిత్రకారులు, బహుముఖ ప్రజ్ఞావంతులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు     (1896-1953). నేటి తెలంగాణ ప్రాంతంలో, మహబూబనగర్ ఇటికలపాడు గ్రామంలో 28th మే 1896 తేదిన ఆయన జన్మించారు. వెల్లాల శంకరశాస్త్రి పండితుల వద్ద ఆయన సంస్కృత వ్యాకరణం, సాహిత్యం నేర్చుకున్నారు. హైదరాబాద్ నిజాం కళాశాలలో FAచదువుకుని, మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో `బియే’ మరియు `న్యాయశాస్త్రం’లో పట్టభద్రులైయారు. కొంతకాలం మద్రాసులో వకీలుగా పనిచేసారు. మద్రాసులో ఉన్న సమయంలో బ్రిటిష్ పలకులకి వ్యతిరేకంగా జరుగుతున్న జాతీయోద్యమంతో అత్యంత స్ఫూర్తి చెంది, హైదరాబాద్ నైజాం రాజ్యంలో కూడా ఆ విధమైన మార్పుతేవాలనే పట్టుదలతో హైదరాబాద్ చేరుకున్నారు.        

శ్రీ ప్రతాపరెడ్డిగారు తమ బహుముఖ ప్రతిభా ప్రజ్ఞ్యలతో, వివిధరంగాలలో తమదైన అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసారు. నాటి దౌర్జన్యకర నిజాం రాజ్యంలో, సాంఘిక చరిత్ర, రాజకీయ ఉద్యమాలు, పత్రికా నిర్వహణ, సాహిత్యం ఇత్యాది అనేక రంగాలలో ఆయన  చారిత్రాత్మకమైన పాత్ర పోషించారు. ఆయన ప్రతిష్టాత్మకమైన గ్రంథం `ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ తెలుగు ప్రజల చరిత్ర తెలిపే మహద్గ్రంధం. ఇది మొదట 1949లో ప్రచురితమై, అనేక ముద్రణలు పొంది, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందింది. ఈ గ్రంథం తెలుగువారి వేయి సంవత్సరాల సాంఘిక, కళా సాంస్కృతిక చరిత్ర వివరిస్తుంది. ఆ గ్రంధంలోని కొన్ని ఆసక్తికర విషయాలు, నన్నయ (1000CE) కాలంలో, మగవారు కూడా కాలికి మట్టెలు ధరించేవారని, తెలుగు `ఓనామాలు’ శైవ సంప్రాదయమైన `ఓం నమశ్శివాయ’నుంచి ఉత్పన్నమైనదని ఆయన విశ్లేషించారు.         

పత్రికా నిర్వహణ- గోల్కొండ పత్రిక 

అప్పటి హైదరాబాద్ నైజాము రాజ్యంలో, తెలుగుభాష పట్ల పూర్తి వివక్ష కొనసాగేది, తెలుగుభాష పూర్తిగా అణచివేయబడింది; తెలుగు ప్రజలు బలవంతంగా వారి మాతృభాషకు దూరం చేయబడ్డారు. అధికారిక రాజభాష ఉర్దూ; తెలుగుకు ఎటువంటి గౌరవం ఉండేదికాదు. నిజాం రాజ్యంలో విద్యకు ప్రాధాన్యం ఉండేది కాదు, అతికొద్ది పాఠశాలలు మాత్రమే ఉండేవి, తెలుగు ప్రజలకు వారి మాతృభాషలో చదువుకునే అవకాశం అసలు లేదు. నిజాం రాజ్యం కోత్వాల్ (పోలీస్ కమిషనర్)రాజబహదూర్ శ్రీవెంకటరామరెడ్డిగారు, ఆయన 1924లో స్థాపించిన ‘రెడ్డి హాస్టల్’లో, శ్రీ ప్రతాపరెడ్డిగారిని కార్యదర్శిగా నియమించారు. ఆయన అక్కడ పెద్ద గ్రంథాలయం స్థాపించి, విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచి, అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత ఆ ఉద్యోగం మానేసి, తెలంగాణా ప్రజలకోసం `గోల్కొండ’ తెలుగు పత్రిక ప్రారంభించారు.             

శ్రీ ప్రతాపరెడ్డిగారు 1926లో గోల్కొండ పత్రిక స్థాపించి దానికి చిరకాలం సంపాదకత్వం నిర్వహించారు. అప్పటి నిజాము తెలంగాణాలో, తెలుగు సాంస్కృతిక- సాహిత్య వారసత్వానికి ‘గోల్కొండ పత్రిక’ అతి పెద్ద మైలురాయి. ఈ పత్రిక వారానికి రెండుసార్లు వెలువడేది. ఆ కాలంలో `మీజాన్, జమీన్, రయ్యత్’ మొదలైన ఉర్దూ పత్రికలు ఉండేవి, తెలుగులో కేవలం రెండు మాత్రమే ఉండేవి, అవి -వరంగల్ నుంచి `తెలుగు’, నల్గొండ నుంచి `నీలగిరి’.     

`గోల్కొండ పత్రిక’ సంపాదకీయంలో ఆయన పత్రిక లక్ష్యాలను వివరించారు, అ. తెలంగాణాలో తెలుగు ప్రయోజనాలకోసం పనిచేయడం. ఆ. కులాలు, తెగలు, వర్గాలకి అతీతంగా, తెలంగాణా ప్రాంత అభివృద్ధికి పాటుపడడం. అయన తమ సంపాదకీయాలలో నిజాం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారు; దానికి నిజాం ఆగ్రహించి, నిజాం ప్రభుత్వ అనుమతితో మాత్రమే సంపాదకీయాలు ప్రచురించాలని నియమాలు జారీచేసాడు. దానిని అధిగమించేందుకు, శ్రీ రెడ్డిగారు అంతర్జాతీయ మేధావుల సూక్తులు మొదలైనవి సంకలనంచేసి ప్రచురించారు, దానివల్ల నిజాం మరింత సమస్యలపాలయాడు. శ్రీప్రతాపరెడ్డిగారు రచించిన వ్యాసాలు `సుజాత, శోభ, భారతి’ పత్రికలలో ప్రచురితమయేవి. ఆయన 1951లో `ప్రజావాణి’ పత్రిక కూడా ప్రారంభించారు.     

 పండితుడు-రచయిత-నాటకకర్త 

శ్రీప్రతాపరెడ్డిగారు 354తెలంగాణా తెలుగు కవుల రచనలు, కవితలను `గోల్కొండ కవుల సంచిక’ ద్వారా, తెలంగాణా ప్రాంత కవుల సాహిత్యం, కళారూపాలు ప్రచురించి, తెలుగు సాహిత్యానికి ఎనలేని కీర్తి గడించిపెట్టారు.  

శ్రీప్రతాపరెడ్డిగారు దాదాపు నలభై పుస్తకాలు రచించారు; వాటిలో కొన్ని- నిజాం రాష్ట్ర పాలనం, హైందవ ధర్మవీరులు, హిందువుల పండుగలు, భక్త తుకారాం, మొగలాయి కథలు, సంఘోధ్ధరణ, ఉచ్ఛల విషాదము, గ్రంథాలయం, యువజన విజ్ఞ్యానం మొదలైనవి.   

శ్రీప్రతాపరెడ్డిగారికి సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఫార్సీ, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయమైన పాండిత్యం ఉన్నాయి. తెలంగాణా తెలుగు అంటే ప్రత్యేక అభిమానం. “బ్రిటిషు ఆంధ్రులు బ్రౌన్వాoధ్రం మాట్లాడితే, మేము తారక్యాoధ్రం మాట్లాడతాము” అని అనేవారు, అనగా బ్రిటిషు ఆంధ్రులు తెలుగు-ఆంగ్లం మాట్లాడితే, తెలంగాణావారు తెలుగు-ఉర్దూ మాట్లాడతారు అని.    

 ఉద్యమకర్త     

1920-1948కాలంలో, తెలంగాణాలో తెలుగు సామాజిక-సాంస్కృతిక జీవన పునరుద్ధరణ జరిపించే విధంగా వివిధ ఉద్యమాల్లో శ్రీప్రతాపరెడ్డిగారు క్రియాశీలకంగా పాలుపంచుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు, ఆనాటి నిజాం-భూస్వామ్య వ్యవస్థలో మెజారిటి హిందూ ప్రజలను, అందులోనూ తెలుగు ప్రజలను అణచివేసిన దౌర్జన్యకర పాలననుంచి ప్రజలకు విముక్తి ప్రసాదించే అనేక ఉద్యమాల్లో ఆయన నాయకత్వం వహించారు. 

తెలంగాణా ప్రాంతంలో గ్రంథాలయ ఉద్యామానికి అయన నేతృత్వం వహించి, పుస్తకాలను నాలుగు మూలలకి, వాడవాడలకి పంపించే ఏర్పాటు చేసేవారు. 1942లో `ఆంధ్ర గ్రంథాలయ ఉద్యామానికి’ ఆయన అధ్యక్షులుగా పనిచేసారు.  1943లో ఖమ్మంలో `గ్రంథాలయ మహాసభ’కి అద్యక్షత వహించారు. ప్రతిష్టాత్మకమైన `ఆంధ్ర సారస్వత పరిషద్’కి ఆయన 1944లో అధ్యక్షులుగా పనిచేసారు.          

ప్రఖ్యాత సంస్థ `ఆంధ్ర మహాసభ’కు అయన ప్రథమ అధ్యక్షుడు; 1930లో మెదక్ జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశంలో, అన్ని కార్యకలాపాలు తెలుగులో మాత్రమే జరపాలని తీర్మానం చేసారు. తెలుగువారు ఏ ప్రాంతంలో ఉన్నా, కలిసిమెలిసి ఐక్యతతో ఉండాలని అయన పదేపదే చెప్తూ, `విశాలాంధ్ర’ ఉద్యమానికి సంపూర్ణంగా నాయకత్వం వహించి మార్గదర్శకత్వం చేసారు. 1920s-1948కాలంలో తెలంగాణాలో సాంస్కృతిక, తెలుగు భాషాపరమైన అభివృద్ధి, రాజకీయ ఉద్యమాల అపురూపమైన సంకలనం – శ్రీ ప్రతాపరెడ్డిగారి `తెలంగాణా ఆంధ్రోద్యమం’, ముఖ్యంగా 1930నుంచి ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో, `ఆంధ్రోద్యమం’కోసం జరిగిన ప్రయత్నాలు, ఉద్యమాలు ఇందులో పొందుపరచబడ్డాయి.   

శ్రీ ప్రతాపరెడ్డిగారికి ప్రత్యక్ష రాజకీయాలలో ఆసక్తి లేకపోయినా, అభిమానుల ప్రోద్బలంతో, 1952లో జరిగిన ప్రథమ ఎన్నికలలో వనపర్తి నుంచి పోటీచేసి గెలిచి, అప్పటి హైదరాబాద్ శాసనసభకి ఎన్నికైనారు. అయితే వర్గ రాజకీయాలకు ఆయన దూరం కాబట్టి, శ్రీ బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఆయన మంత్రి కాలేకపోయారు.  

ఆ కాలంలో జరుగుతున్న ప్రత్యేక `ఆంధ్ర రాష్ట్ర’ సాధన ఉద్యమానికి అయన తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే దురదృష్టవశాత్తూ శ్రీ ప్రతాపరెడ్డిగారు 25 ఆగస్టు 1953తేదిన మరణించడంతో, `విశాలాంధ్ర అవతరణను ఆయన చూడలేకపోయారు. అయన మరణంతో తెలుగు ప్రజలు ఒక గొప్ప సాహిత్యవేత్తను, తెలుగు భాషా ఉద్యమకర్తను శాశ్వతంగా కోల్పోయారు.  

మే 28 సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here