Home Telugu Articles స్వేచ్ఛావాణిజ్యం పేరిట సంకెళ్లా? ప్రాంతీయ ఒప్పందాలపై పారాహుషార్‌

స్వేచ్ఛావాణిజ్యం పేరిట సంకెళ్లా? ప్రాంతీయ ఒప్పందాలపై పారాహుషార్‌

0
SHARE

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) చర్చల్లో వ్యవసాయ, వాణిజ్య అంశాలపై దశాబ్దకాలంగా ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో- దేశాల మధ్య, ప్రాంతీయ వేదికల ఆధారంగా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు మొగ్గ తొడుగుతున్నాయి. ఈ దిశగా హైదరాబాద్‌లో ఈ నెల 24 నుంచి ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం’ (ఆర్‌సీఈపీ) పై 19వ దఫా చర్చలు జరగనున్నాయి. డబ్ల్యూటీఓ విధానాలకు అనుగుణంగా సబ్సిడీలను తొలగిస్తుండటంవల్ల దేశంలోని రైతులు బక్కచిక్కిపోతున్నారు. ఆహార భద్రత ప్రమాదంలో పడుతోంది. ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఇటువంటి వాణిజ్య, వ్యవసాయ ఒప్పందాలు మనకు ఆమోదయోగ్యమే. కానీ సాంకేతికత దన్నుతో పలు దేశాలు వస్తువులను చౌకగా ఉత్పత్తి చేసి ప్రపంచ విపణులపై గుమ్మరిస్తున్నాయి. దీనివల్ల భారత్‌ వంటి దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో జరిగే చర్చల్లో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా రక్షణాత్మక విధానాలతో మన పంటలు, పారిశ్రామిక ఉత్పత్తులు దెబ్బతినకుండా దేశీయ ప్రయోజనాలను పాలకులు కాపాడగలగాలి!

గుణపాఠాలు

ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడి స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చాక విదేశీ ఉత్పత్తులకు ప్రతి దేశమూ తలుపులు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంత పరిమితి మేరకు విధిగా ఉత్పత్తులను అనుమతించాల్సిందేనన్న సంపన్న దేశాల పిడివాదనలపై మన పోరాటం వృథా అవుతూ వచ్చింది. డబ్ల్యూటీఓ మంత్రిత్వస్థాయి చర్చల్లో ఇవేమీ కొలిక్కి రాలేదు సరికదా, సరికొత్త ఆంక్షల చట్రంలో చిక్కుకుపోతూ వచ్చాం. పాక్షిక ప్రయోజనాలనే అందుకోగలిగాం. విదేశీ ఉత్పత్తులను అనుమతించాలి సరే, అలానే పేద దేశాల ఉత్పత్తులనూ సంపన్న దేశాలూ స్వాగతించాలి కదా! ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడుతోంది. నాసిరకంగా ఉంటున్నందువల్ల పేద దేశాల ఉత్పత్తులను అడ్డుకోవాల్సి వస్తోందన్నది సంపన్న దేశాల వాదన. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన దేశాలు, అవి లేని దేశాలకు వాటిని అందించాక మాత్రమే ఆహార నాణ్యత గురించి అభ్యంతరాలను లేవనెత్తాలి తప్ప, ఇప్పుడు కాదని భారత్‌ పేద దేశాల తరపున బల్లగుద్ది వాదిస్తోంది. దీనివల్ల చర్చల్లో తరచూ ప్రతిష్టంభన నెలకొంటుండటంతో పలు దేశాలు ప్రాంతీయ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అందులో భాగంగా ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం’ (ఆర్‌సీఈపీ)పై హైదరాబాద్‌లో 16 దేశాల మంత్రులు 19వ దఫా భేటీ కానున్నారు. ఈ నెల 24-28 మధ్య జరిగే ఈ సదస్సుకు చైనా, సింగపూర్‌, జపాన్‌, దక్షిణ కొరియా, మలేసియా, థాయ్‌లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, వియత్నాం, ఇండొనేసియా తదితర దేశాల మంత్రులు పాల్గొనబోతున్నారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంపై వీరు చర్చలు జరపనున్నారు. ఆర్‌సీఈపీపై 2012లో మొదలైన చర్చలకు ఇవి కొనసాగింపు. ఈ చర్చల్లో పాల్గొంటున్న దేశాల నుంచి ఇప్పటికే వచ్చిపడుతున్న ఉత్పత్తుల కారణంగా మనదేశంలో పప్పుధాన్యాలు, ఆట వస్తువులు, పాలు, మాంస ఉత్పత్తులు, నూనెగింజలు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్‌, యంత్ర పరికరాల ఉత్పత్తిపై పెను ప్రభావం పడుతోంది. చైనా ఆట వస్తువుల సరఫరాతో దేశీయ బొమ్మల పరిశ్రమ కుదేలైపోయింది. భారత్‌లో మొబైల్‌ ఫోన్ల విక్రయాల్లో చైనాదే హవా. ఇండొనేసియా, మలేసియా, మియన్మార్‌ల నుంచి చౌకగా వచ్చిపడే పామాయిల్‌, నూనెగింజలు, మినుము, కంది, పెసర తదితరాల దెబ్బకు దేశీయంగా పంటను కొనేవారు లేక రైతులు డీలా పడుతున్నారు. వాటి ఉత్పత్తి పైనే ఆధారపడ్డ రైతులు, శ్రామికులు, చిన్న పరిశ్రమలవారు ఉపాధి కోల్పోతున్నారు. భారత్‌లో అపార ఉత్పత్తి అవకాశాలున్నప్పటికీ- దేశీయంగా పప్పుధాన్యాలు, నూనెగింజల విపణిని ఇదెంతగా ప్రభావితం చేస్తుందో పాలకులకు తెలియనిది కాదు. ఏటా బడ్జెట్లో ఈ పంటల సాగుకు భారీ ప్రోత్సాహకాలు అందిస్తున్నామంటున్న ప్రభుత్వాలు, ఇప్పుడీ ఒప్పందాల విషయంలో రైతులు, శ్రామికుల ప్రయోజనాలను ఎంతవరకు పరిరక్షిస్తాయన్నదానిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

భారత విత్తన రంగంలో ఉన్న గిరాకీపై అనేక దేశాలు కన్నేశాయి. పేటెంట్ల కోసం తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నాయి. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కింద పలు దేశాల పెట్టుబడులకు భారత్‌ తలుపులు బార్లా తెరవాల్సి వస్తోంది. అంతేకాదు, వాటికి రక్షణలూ కల్పించాలి. అందుకోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టాల్సి వస్తే పరిస్థితి ఏమిటన్నది పాలకులు ఆలోచించాలి. అమెరికా వంటి దేశాల తరహాలోనే భారత్‌ వ్యవహరించాల్సి ఉంటుంది. సంపన్న దేశాలు తమ రైతులకు భారీ రాయితీలిచ్చి తమ వ్యవసాయాన్ని బలోపేతం చేసుకున్నాకే విదేశీ విపణులపై దృష్టి సారించాయి. భారత్‌ కూడా ముందు దేశీయంగా రైతుభద్రతపై దృష్టి సారించాలి. డబ్ల్యూటీఓలో సంపన్న దేశాలు ప్రవచించిన విచక్షణాయుత ఒప్పందాలు మనకెలా ప్రతిబంధకం అవుతున్నాయో భారత్‌కు స్వానుభవమే. వేలకోట్ల రూపాయల విపణి విలువగల భారత విత్తన రంగంపై ఇప్పటికే అనేక బహుళజాతి సంస్థలు పెత్తనం చలాయిస్తున్నాయి. వీటిని అడ్డుకోవడానికి భారత్‌ వద్ద ఎలాంటి యంత్రాంగం లేదు. రాష్ట్రాలవారీ కమిటీలు వేసి చేతులు దులుపుకొంటున్నారు. రైతులకు వాటిల్లుతున్న నష్టాలకు పరిహారాన్ని కంపెనీల నుంచి ముక్కుపిండి వసూలు చేయలేకపోతున్నారు. దేశీయ కంపెనీలనే కట్టడి చేయలేనప్పుడు విదేశీ కంపెనీల విషయంలో కటువుగా వ్యవహరించగలరా? అందుకోసం విత్తన చట్టానికి కొన్ని సవరణలు తెచ్చేందుకు 2004లోనే ప్రయత్నాలు జరిగాయి. ఆ విత్తన బిల్లు నేటికీ ఒక కొలిక్కిరాలేదు. దేశీయ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి రక్షించే పలు అంశాలను బిల్లులో విస్మరించారన్న విమర్శలున్నాయి. ఇక స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్‌ సమర్థంగా వ్యవహరిస్తుందని ఎలా విశ్వసించగలం? నాణ్యతతో కూడిన పోటీ ఉండాల్సిందే. కానీ, మోన్‌శాంటో అనుభవాలు నేర్పుతున్న పాఠాలను మనం చెవికెక్కించుకోని పక్షంలో దేశీయ విత్తన రంగాన్ని బహుళజాతి సంస్థలకు ధారాదత్తం చేయాల్సి రావచ్చు. ఇది ప్రమాదకర పరిస్థితి. అందువల్ల ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు దేశంలో వినియోగదారులకు పూర్తిస్థాయిలో రక్షణలు కల్పించాల్సిన అవసరముంది. అలాగే పలురకాల ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షల సడలింపు లేదా పూర్తిగా ఎత్తివేయడం, సుంకాలు తొలగించాలన్న డిమాండ్లు ఈ ఆర్‌సీఈపీ సదస్సు సందర్భంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పరిమాణాత్మక ఆంక్షల తొలగింపు కారణంగా దేశంలోకి తూర్పు దేశాల నుంచి పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తులు భారీగా వచ్చిపడుతున్నాయి. ఇప్పుడీ డిమాండ్లను అంగీకరించే పరిస్థితే వస్తే, మన రైతులు మరిన్ని ఇక్కట్లపాలు కావచ్చు. కోట్లాది శ్రామికుల జీవనోపాధీ దెబ్బతింటుంది. కుటీర, చిన్న పరిశ్రమలు కుదేలవుతాయి. పారిశ్రామిక ఉత్పత్తులపై ఇప్పుడున్న 10 శాతం దిగుమతి సుంకాన్ని ఏ మాత్రం తగ్గించినా చైనా లాంటి దేశాల వస్తువులతో మనదేశం నిండిపోయే ప్రమాదం పొంచి ఉంది. అప్పుడు ఎలక్ట్రానిక్స్‌, దుస్తులు, ఫర్నిచర్‌ ప్రభృత రంగాల్లోని దేశీయ చిన్న పరిశ్రమలు మరింతగా సంక్షోభంలో కూరుకుపోతాయి. దేశీయంగా నెలకో ధర పలుకుతున్న సబ్బుల ధరల్నే నియంత్రించలేన్నప్పుడు ఈ కంపెనీల ధరలనెలా నియంత్రిచగలమన్నది ఆలోచించాలి. విత్తనాలు, ప్రజారోగ్యానికి పనికొచ్చే మందుల ధరలు పెరుగుతూ ఉంటే దేశంలో సామాన్యుడి జీవితం తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఆర్‌సీఈపీ చర్చల్లో ముందు నుంచీ ఔషధాలు, వైద్యసేవలపై అంతర్జాతీయ నియమాలకు పట్టుబడుతున్న పలు దేశాలు, మందుల తయారీలో పేటెంట్లను అనుమతించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. మనం తలొగ్గితే ప్రపంచంలో సగం జనాభా కలిగిన ఈ దేశాల పేదప్రజలు పెరిగిన మందుల ధరలతో సతమతమవుతారు. డబ్ల్యూటీఓ నిబంధనలను తోసిరాజని జెనరిక్‌ మందుల విషయంలో దేశీయ ప్రజలకు రక్షణ కల్పించుకున్న రీతిలో భారత్‌ ఈ విషయంలోనూ ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా వ్యవహరించాల్సి ఉంది. అలాగే పౌష్టికాహారంతో ముడివడిఉన్న పాలు, ఇతర ఆహారోత్పత్తుల ధరలు సైతం ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్‌ పైస్థాయిలో ఉన్నప్పటికీ-సుంకాల తొలగింపు, విదేశీ ఉత్పత్తుల చొరబాటుతో ఇబ్బందులు పడాల్సివస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐరోపా, అమెరికా కారణంగా గతంలో ఆఫ్రికా దేశాల పాల ఉత్పత్తి ఎలా దెబ్బతిన్నదో ఉదాహరణలు ఇక్కడ గుర్తుకుతెచ్చుకోవాలి.

దేశ ప్రయోజనాలే ప్రధానం

డబ్ల్యూటీఓ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌- ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల పరిధిలోని దేశాలతో చేసుకునే ప్రాంతీయ ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రాంతీయంగా లేని అభ్యంతరాలు తమ విషయంలో ఎందుకంటూ భవిష్యత్తులో డబ్ల్యూటీఓ స్థాయిలో పలు దేశాలు ప్రశ్నించవచ్చు. విత్తనాల పేటెంట్లు, ఎగుమతి-దిగుమతి ప్రమాణాలు, దిగుమతి ఆంక్షల ఎత్తివేత, సుంకాల తొలగింపు వంటి అంశాల్లో భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని పలు దేశాలు యోచిస్తున్నట్లు సమాచారం. డబ్ల్యూటీఓ నిబంధనల కారణంగా ప్రతి దేశం విధిగా విదేశీ దిగుమతులకు అనుమతించాల్సి వస్తోంది. ఇప్పుడూ అదే తరహాలో ఆ దేశాల ఎగుమతులకు మనదేశం తలొగ్గాల్సి వస్తే పరిస్థితి ఏమిటి? ఇదే స్థాయిలో భారత్‌ ఎగుమతులనూ ఆయా దేశాలు స్వాగతించాలి. కానీ, గతానుభవాలను చూస్తే అలా జరగదని అనిపిస్తోంది. చివరకు మనకే నష్టం వాటిల్లుతుందన్న భయాలు లేకపోలేదు.

అప్రమత్తతే శ్రీరామరక్ష

అత్యధిక జనాభాతో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిన భారత మార్కెట్‌పై సహజంగానే ఆర్థికంగా శక్తిమంతమైన దేశాల కన్ను పడింది. ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవి అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాయి. మనమూ సొంత ప్రయోజనాల సాధన కోసం పలు ప్రాంతీయ వేదికల ద్వారా ప్రయత్నిస్తున్నాం. పేద దేశాలకు బాసటగా నిలుస్తున్నాం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో మన ప్రయోజనాలను పణంగా పెట్టరాదన్న స్పృహ ఏలికలకు అవసరం. ప్రస్తుతం భారత్‌లో నేరుగా విత్తనాలపై పేటెంట్లు తీసుకునే సౌలభ్యం లేదు. విత్తన రంగంలో పేటెంట్ల దిశగా ఆర్‌సీఈపీ చర్చలు నడుస్తుండటం ఆందోళనకరం. అలాగే డెయిరీ రంగంలో అధికోత్పత్తులు సాధిస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సుంకాలు తగ్గించుకొంటే- ఆ దేశ ఉత్పత్తులు మనదేశంలోకి వెల్లువెత్తి, డెయిరీ రంగాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీనిపై జాతీయ పాల అభివృద్ధి బోర్డు ఇప్పటికే తన ఆందోళన వ్యక్తం చేసింది. మనకు వనరులున్నాయి. అయినా రైతులు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించడం లేదు. ఇక విదేశాల నుంచి చౌకగా వస్తున్నాయని తలుపులు బార్లా తెరిస్తే- దేశీయంగా ఆ ఉత్పత్తులపై ఆధారపడినవారి జీవనోపాధి దెబ్బతింటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. బహుళపక్ష వాణిజ్యంలో ఎవరి స్వలాభాలు వారు చూసుకోవడం రివాజు. తమ తమ ప్రయోజనాల కోసం తీసుకువచ్చే ఒత్తిళ్లకు లొంగకుండా పాలకులు దేశీయ ప్రయోజనాలను గుర్తెరిగి వ్యవహరించాలి!

– అమిర్నేని హరికృష్ణ

(ఈనాడు సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here