Home Telugu Articles క్రైస్తవ మతమార్పిడి కుట్రలను వమ్ము చేసిన స్వామి సహజానంద

క్రైస్తవ మతమార్పిడి కుట్రలను వమ్ము చేసిన స్వామి సహజానంద

0
SHARE
1903లో తమిళనాడులో జరిగిన ఘటన ఇది!
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద బాలుడు మునుస్వామి.. చదువుకోవాలన్న తపనతో డిండీవనం క్రైస్తవ మిషనరీ పాఠశాలలో సీటు సంపాదించాడు. తరగతి గదిలోని ఇతర విద్యార్థుల్లో కెల్లా అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. సీటు అయితే సంపాదించాడు కానీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత సరిపోయేది కాదు.
ఆ నిరుపేద నిమ్నవర్గ విద్యార్థి పేదరికాన్ని ఆసరాగా చేసుకుంది ఆ క్రైస్తవ పాఠశాల యాజమాన్యం. మునుస్వామి ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది.. ఒకటి క్రైస్తవంలోకి మారడం.. రెండు, మేము అందిస్తున్న విద్య, భోజనానికి ఫీజు (ఆరోజుల్లో అరవై రూపాయలు) చెల్లించడం.. ఈ రెండూ చేయలేకపోతే పాఠశాల విడిచి వెళ్ళవచ్చు అని తేల్చిచెప్పింది.
ఆ బాలుడు ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే పాఠశాల నుండి బయటకు వచ్చేశాడు. అతని ఆధునిక విద్య అంతటితో ముగిసిపోయింది. ఇటిక బట్టీల్లో కార్మికుడిగా చేరాడు. కానీ క్రైస్తవాన్ని మాత్రం స్వీకరించదలేదు.
ఈ విషయం అతని గ్రామానికి పర్యటనగా వచ్చిన శ్రీ నీలమేఘ స్వామి దృష్టికి చేరింది. మునుస్వామి జీవితానికిది కీలక మలుపుగా మారింది.
స్వామి నీలమేఘ సూచన మేరకు కరపత్ర శివప్రకాశ స్వామి సన్నిధికి చేరి వారి ఆధ్యాత్మిక శిక్షణలో తమిళ సాహిత్యంతో పాటు ఎన్నో శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అభ్యసించాడు. గురువు సన్నిధిలో సన్యాసాశ్రమ దీక్ష పొందిన ఆ బాలుడు అనంతర కాలంలో స్వామి సహజానందగా ప్రసిద్ధిచెందారు.
తమిళనాడులో ద్రావిడ కజగం పార్టీలు, పెరియార్ వంటి ఉన్మాదులు తమ విషపూరిత “ఆర్య-ద్రావిడ” సిద్ధాంతాలతో నిమ్న వర్గాల ప్రజలలో హిందూ ధర్మం పట్ల తీవ్రమైన వ్యతిరేక భావం కలుగచేస్తున్న ఆ రోజుల్లోనే.. అనేక మార్గాల్లో హిందూ ధర్మాన్ని అణగారిన ప్రజల మధ్య ప్రచారం చేసి వారిని హిందూత్వానికి దగ్గర చేశారు స్వామి శ్రీ సహజానంద. నిమ్న వర్గాల నుండి కూడా గురువులు, ఆధ్యాత్మిక పురుషులు ఉద్భవిస్తారని ఆయన ప్రపంచానికి చూపించారు. వారి జీవితం నుండి అనేక ముఖ్య విషయాలు మనం గ్రహించాల్సి ఉంది.
నిమ్నవర్గాల ప్రజలు హిందువులు కారు అనే దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. వారిని ‘ఆది ద్రావిడులు’ అని కాకుండా ఆది హిందువులుగా పిలవాలని ప్రతిపాదించేవారు. అంతేకాకుండా ప్రముఖ ఆలయాల కమిటీల్లో నిమ్నవర్గాలకు చెందిన హిందువులను కూడా సభ్యులుగా చేర్చాలని డిమాండ్ చేసేవారు.
1934లో నిమ్నవర్గాల వారికోసం నటరాజ ఆలయప్రవేశానికై తీవ్రమైన ఉద్యమం ప్రారంభించారు స్వామి సహజానంద. దీంతో అటు ద్రావిడ సిద్ధాంత ప్రచారకులు, పెరియార్ మద్దతుదార్లు స్వామి సహజానందను అనేక ఇబ్బందులకు గురిచేసారు. ఎట్టకేలకు 1947 జూన్ 2 తన ఉద్యమ ఫలితంగా వందలాది నిమ్నవర్గాల ప్రజలతో కలిసి నటరాజ ఆలయప్రవేశం కావించారు.
రాజకీయాల్లోకి రావాలిన అనివార్య పరిస్థితులను గుర్తించిన స్వామీ సహజానంద 1936 నుండి 1959 వరకు దాదాపు రెండు దశాబ్దాల కాలం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి చిదంబరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహించారు.
తన జీవిత కాలంలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా భారతీయ సాంప్రదాయ విద్యను నిమ్నవర్గాల ప్రజలకు అందించారు. ముఖ్యంగా బాలికలకు విద్య యొక్క ప్రాముఖ్యత వివరించే కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. వీటితో పాటు పాటు షెడ్యూల్డ్ కులాల ప్రజల రాజకీయ, సాంస్కృతిక హక్కుల పరిరక్షణ జీవితాంతం పాటు పడ్డారు శ్రీ సహజానంద.
క్రైస్తవ మిషనరీలు నిమ్నవర్గాల ప్రజలను మతం మార్చడానికి పన్నే మాయోపాయాలన్నీ అవగాహన కలిగిన స్వామీ సహజానంద, ఆ కుట్రపూర్తిగా విధానాలు అరికట్టేందుకు తగిన సూచనలు తరచూ చేస్తుండేవారు.
ఎస్సీ వాడల్లో నెలకొల్పిన పాఠశాలల్లో క్రైస్తవ ఉపాధ్యాయులను కాకుండా హిందూ ఉపాధ్యాయులనే నియమించాలని, మిషనరీలు నిర్వహించే బాలల ఆశ్రమాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై ఆంక్షలు విధించాలని కోరేవారు.
ఈవీ రామస్వామి నాయకర్, జస్టిస్ పార్టీల తీవ్రవాద ఆలోచనలను, విధానాలను స్వామి సహజానంద తీవ్రంగా వ్యతిరేకించేవారు. వారు దేశవిచ్చిన్ననికే పనిచేస్తున్నారు తప్పు నిమ్నవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కాదు అని ఖరాఖండిగా చెప్పేవారు.
కులాల పట్ల ద్వేషాన్ని నూరిపోసి దాన్నే ఉద్యమంగా ప్రచారం చేసే పద్దతులను తీవ్రంగా వ్యతిరేకించే సహజానంద, సేవా, ఆధ్యాత్మిక మార్గంలో చేపట్టిన నిమ్నవర్గాల అభ్యున్నతి ఉద్యమం ఈనాటికీ తమిళనాట సత్ఫాలితాన్నిస్తోంది. ఆ కార్యకలాపాలు అందిపుచ్చుకుని, వాటిని కొనసాగించేందుకు ప్రముఖ సామజిక కార్యకర్త శ్రీ వెంకటేసన్ నేతృత్వంలోని కొత్తతరం ముందుకు వచ్చింది.
నేడు స్వామి శ్రీ సహజానంద జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిద్దాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here