Home Rashtriya Swayamsevak Sangh స్వయంసేవక్.. భారతరత్న.. శ్రీ నానాజీ దేశముఖ్ 

స్వయంసేవక్.. భారతరత్న.. శ్రీ నానాజీ దేశముఖ్ 

0
SHARE
Social activist Nanaji Deshmukh. Express archive photo

అక్టోబ‌ర్ 11 – నానాజీ దేశ్‌ముఖ్ గారి జ‌యంతి…

సరస్వతి శిశుమందిరాల వ్యవస్థాపకులు, గ్రామీణాభివృద్ధి సాధకులు స్వర్గీయ శ్రీ నానాజీ దేశముఖ్ ని భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా నానాజీ బంధువు, పండిట్ దీనదయాళ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ శ్రీ వీరేంద్రజీత్ సింగ్ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ గా జీవితం ప్రారంభించిన నానాజీ సంఘ స్పూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నానాజీ జీవితం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

11 అక్టోబర్ 1916 తేదీన మహారాష్ట్రలోని పర్భనీ జిల్లా కడోలి పట్టణంలో నానాజీ దేశముఖ్ జన్మించారు. వారి పూర్తిపేరు చండికాదాస్ అమృతరావ్ దేశముఖ్. చిన్నతనం నుండి చదువు మీద అమితమైన ఆసక్తి కనబరిచేవారు. చదువు కోసం పేదరికాన్ని సైతం ఎదిరించారు. ట్యూషన్ లో చేరడం కోసం కావాల్సిన డబ్బు సంపాదించేందుకు కూరగాయలు అమ్మేవారు.

నానాజీ చిన్నతనంలోనే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జాతీయవాద భావాలకు ఆకర్షితులైనారు. ఆ భావాలు నానాజీని సామాజిక, సేవా కార్యకలాపాల వైపుకు నడిపించాయి. అప్పటికే వారి కుటుంబానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం సర్ సంఘచాలక్ డాక్టర్ హెడ్గేవార్ తో పరిచయం కలిగివుంది. డాక్టర్జీ తరచూ ఇంటికి వస్తుండటం కారణంగా నానాజిలో దాగివున్న దేశభక్తి, సేవా తత్పరత వంటి లక్షణాలను గమనించి, ఆరెస్సెస్ శాఖకు తీసుకువెళ్తుండేవారు.

1940లో డాక్టర్ హెడ్గేవార్ మరణానంతరం వారి నుండి స్ఫూర్తి పొందిన అనేక మంది యువకులు ఆరెస్సెస్ పూర్తిస్థాయి కార్యకర్తలుగా మారారు. వారిలో నానాజీ కూడా ఒకరు. సంఘం నానాజీకి ప్రచారక్ బాధ్యతలు అప్పజెప్పి సంఘ విస్తరణ కోసం ఉత్తరప్రదేశ్ పంపింది. నానాజీ ఆగ్రాలో మొట్టమొదటిసారిగా దీనదయాళ్ ఉపాధ్యాయను కలిశారు. అనంతరం కాలంలో వారు సంఘ కార్య విస్తరణ కోసం గోరఖ్ పూర్ వెళ్లారు.  ఆరెస్సెస్ భావజాలాన్ని విస్తరింపజేసే క్రమంలో నానాజీ అక్కడ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. సంస్థకు సరియైన నిధులు లేనందున ఆ సమయంలో ప్రచారక్ లు ఎన్నో కష్టనష్టాలను ఎదురుకోవాల్సి వచ్చేది. రోజూవారి ఖర్చులకు కూడా ఇబ్బంది ఎదురవుతున్న కారణంగా నానాజీ గోరఖ్ పూర్ ధర్మశాలలో బస ఏర్పాటు చేసుకునేవారు. ఐతే సాధారణంగా ధర్మశాలలో వరుసగా 3 రోజులకు మించి ఉండటం వీలుకానందున అనేక ధర్మశాలలు మారుతూ ఉండేవారు. ఆఖరికి నానాజీ ఇబ్బంది గమనించిన బాబా రాఘవదాస్ ఆయనకు వంట చేసే షరతు మీద తమ ఆశ్రమంలో బసకు అనుమతిచ్చారు.

కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే  నానాజీ గోరఖ్ పూర్ చుట్టుప్రక్కల 250 సంఘ శాఖలను ఏర్పాటు చేశారు. చిన్నతనం నుండి నానాజీ విద్య అవసరాన్ని గుర్తించిన వ్యక్తి. ఇదే ఆలోచన కారణంగా వారు దేశంలోని మొట్టమొదటి సరస్వతి శిశుమందిరాన్ని 1950లో గోరఖ్ పూర్ లో ఏర్పాటు చేశారు.

సంఘ సిద్ధాంతాల ద్వారా ప్రేరేపితమైన కొందరు 1947లో “రాష్ట్ర ధర్మ”, “పాంచజన్య” వార్తాపత్రికలతో పాటు “స్వదేశ్” అనే మరొక వార్తాపత్రికను కూడా స్థాపించారు. ఆ సమయంలో అటల్ బిహారీ వాజపేయి వాటికి సంపాదకులుగా వ్యవహరించేవారు. మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు నానాజీకి అప్పగించబడ్డాయి. ఆ సమయంలోని సంస్థ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పత్రికలను నడపడం ఎంతో కష్టమైన వ్యవహారం అయినప్పటికీ నానాజీ ఈ బాధ్యతను సవాలుగా స్వీకరించారు. వారి మార్గదర్శకంలో ఆ పత్రికలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.

మహాత్మా గాంధీ హత్యానంతరం ఆరెస్సెస్ మీద నిషేధం విధించారు. ఇది పత్రికల ప్రచురణ మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. ఈ పరిస్థితుల్లో నానాజీ ఆలోచనల ఫలితంగా పత్రికల ప్రచురణ మరియు వ్యాప్తి అత్యంత పగడ్బందీగా సాగేది. నిషేధం ఎత్తివేసిన తరువాత ఒక రాజకీయ పార్టీ అవసరం అన్న ఆలోచనతో ‘భారతీయ జన సంఘ్’ ఏర్పడింది. జన సంఘ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా అప్పటి సర్ సంఘచాలకే శ్రీ గురుజీ నానాజీని ఆహ్వానించారు. అప్పటికే నానాజీ ఆరెస్సెస్ ప్రచారక్ గా ఎంతోకాలం ఉత్తరప్రదేశ్లో పనిచేసిన కారణంగా ఆ రాష్ట్రంలో భారతీయ జన సంఘ్ కార్యకలాపాలను జనంలోకి తీసుకెళ్లడానికి నానాజీ ఎంతో శ్రమించాల్సిన అవసరం లేకపోయింది. దీని ఫలితంగా 1957 నాటికి జన సంఘ్ ఉత్తరప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో కూడా జన సంఘ్ శాఖలు ఏర్పడ్డాయి.

నానాటికీ భారతీయ జన సంఘ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రబల రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతూ వస్తోంది. 1967 నాటికి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న యునైటెడ్ లెజిస్లేచర్ పార్టీతో పొత్తుపెట్టుకుంది. ఆ పార్టీ అధ్యక్షులు చౌదరీ చరణ్ సింగ్ మరియు రామ్ మనోహర్ లోహియా వంటివారితో ఉన్న సత్సంబంధాల కారణంగా నానాజీకి ఈ విషయంలో కలిసివచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా వివిధ రాజకీయ ప్రముఖులను ఒకే వేదిక మీదకి తీసుకురావడం ద్వారా ఉత్తరప్రదేశ్ లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో నానాజీ విశేషమైన కృషి చేశారు.

అప్పటికే రాజకీయ ఉద్దండుడిగా పేరుపడ్డ కాంగ్రెస్ నాయకుడు చంద్రభాను గుప్తా సైతం నానాజీ రాజకీయ చతురత కారణంగా మూడుసార్లు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

దీనదయాళ్ ఉపాధ్యాయ మార్గదర్శనం, అటల్ బిహారీ వాజపేయి వాక్చాతుర్యంతో పాటు నానాజీ కార్యదక్షతల ఫలితంగా భారతీయ జన సంఘ్ ఉత్తరప్రదేశ్ లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. నానాజీ కేవలం తన పార్టీ సభ్యులతోనే కాక చంద్రభాను గుప్తా వంటి ప్రతిపక్ష సభ్యులతోకూడా సత్సంబంధాలు కలిగి ఉండేవారు. రామ్ మనోహర్ లోహియాతో ఉన్న పరిచయం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసింది. నానాజీ ఒకసారి రాష్ట్ర భారతీయ జన సంఘ్ కార్యకర్తల సమావేశానికి రామ్ మనోహర్ లోహియాను ఆహ్వానించారు. అక్కడ రామ్ మనోహర్ లోహియా మొదటిసారి డీన్ దయాళ్ ఉపాధ్యాయను కలిశారు. ఈ కలయిక కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సోషలిస్టు పార్టీలను జన సంఘ్ కి దగ్గర చేసింది.

వినోభా భావే ప్రారంభించిన భూదాన ఉద్యమంలో నానాజీ చురుగ్గా పాల్గొన్నారు. అదే విధంగా జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చిన సంపూర్ణ ఉద్యమానికి కూడా తన పూర్తి మద్దతునిచ్చారు. జనతా పార్టీ ఆవిర్భావంలో నానాజీ ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి జనతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. నానాజీ బలరాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఇచ్చిన మంత్రిత్వ అవకాశాన్ని నానాజీ సున్నితంగా తిరస్కరించారు. తనకు రాజకీయాలు ఒక లక్ష్యం మాత్రమే తప్ప పదవులపై ఆశ లేదు అని అన్నారు.

రాజకీయాల నుండి తప్పుకున్నాక నానాజీ తన పూర్తి సమయాన్ని థానెలో 1969లో స్థాపించిన పండిట్ దీన్దయాల్ పరిశోధనా సంస్థకు కేటాయించారు. చిత్రకూట్ ప్రాంతంలో చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం పేరిట దేశంలోనే మొట్టమొదటి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, దానికి ఉపకులపతిగా సేవలందించారు. చిత్రకూట్ గ్రామంలో జరిగిన గ్రామీణాభివృద్ధి ఎంతో స్ఫూర్తివంతమైనవిగా భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ అబ్దుల్ ఎంతగానో కొనియాడారు.

27 ఫిబ్రవరి 2010 న తన 94వ ఏట నానాజీ దేశముఖ్ తుదిశ్వాస విడిచారు.

Source: Arise Bharat

This article was first Published in 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here