Home News ‘ఉగ్ర’సాయం ఆపాలి..! తొలిసారి ఉగ్రవాదాన్ని డిక్లరేషన్‌లో చేర్చిన బ్రిక్స్‌

‘ఉగ్ర’సాయం ఆపాలి..! తొలిసారి ఉగ్రవాదాన్ని డిక్లరేషన్‌లో చేర్చిన బ్రిక్స్‌

0
SHARE
  •  జైషే, లష్కరే సహా ఉగ్ర సంస్థల ప్రస్తావన
  •  పరోక్షంగా పాక్‌కు హెచ్చరిక.. భారత్‌కు భారీ దౌత్య విజయం
  •  ‘అజర్‌ నిషేధం’పై సమాధానం దాటవేసిన చైనా
  •  జీఎస్టీతో భారత్‌లో వ్యాపారానుకూలత: మోదీ

పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై కొనసాగిస్తున్న పోరులో భారత్‌కు మరో భారీ దౌత్య విజయం దక్కింది. చైనాలోని జియామెన్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సు డిక్లరేషన్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ సహా ఉగ్రసంస్థలపై బ్రిక్స్‌ సభ్యదేశాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. పాక్‌ పేరెత్తకుండానే.. శాంతికి విఘాతం కల్పిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాద సంస్థలపై సమైక్యంగా పోరాడాలని నిర్ణయించాయి.

ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల అధ్యక్షులు జిన్‌పింగ్, వ్లాదిమిర్‌ పుతిన్, మైకెల్‌ టెమర్, జాకబ్‌ జుమాలు ఈ సదస్సులో పాల్గొన్నారు. బ్రిక్స్‌ సదస్సులో ఉగ్రవాదంపై చర్చ జరగటం ఇదే తొలిసారి కావటం విశేషం. బ్రిక్స్‌ సమావేశాల ముగింపు సందర్భంగా 43 పేజీల జియామెన్‌ డిక్లరేషన్‌ను సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. భద్రతామండలిలో సంస్కరణలపైనా సదస్సులో చర్చించారు. అటు, భారత చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ ద్వారా పారదర్శకంగా వ్యాపారం చేసుకునేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని బ్రిక్స్‌ బిజెనెస్‌ కౌన్సిల్‌ భేటీలో మోదీ పేర్కొన్నారు.

ఉగ్రవాదంపై ఆందోళన

బ్రిక్స్‌ సదస్సులో ఉగ్రవాదం అంశాన్ని మోదీ లెవనెత్తారు. దీనికి ఇతర నేతల నుంచి మద్దతు లభించింది. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో వారు కూడా మోదీ ప్రతిపాదనను సమర్థించారు. ఆసియా ప్రాంతంలో హింసకు పాల్పడుతున్న తాలిబాన్, ఐసిస్, అల్‌కాయిదాతోపాటుగా హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ఈస్ట్‌ తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ (ఈటీఐఎమ్‌), ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఉజ్బెకిస్తాన్, తెహ్రికే తాలిబాన్, హిజ్బుత్‌ తహ్రీర్‌ వంటి సంస్థలు శాంతికి విఘాతం కల్పించటంపై బ్రిక్స్‌ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.

తూర్పు తుర్కిస్తాన్‌ ఏర్పాటుచేయాలంటూ చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రావిన్సులో ఈటీఐఎమ్‌ చేస్తున్న విధ్వంసంపై  ప్రత్యేకంగా చర్చించింది. ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. ఉగ్రవాదులకు మద్దతు తెలిపే వారినే పూర్తిగా బాధ్యులు చేయాలని పునరుద్ఘాటిస్తున్నాం’ అని డిక్లరేషన్‌ పేర్కొంది. దేశాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించటం, ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవాలని కూడా బ్రిక్స్‌ సదస్సు నిర్ణయించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా.. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండానే ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగా ముందుకెళ్లనున్నట్లు పేర్కొన్నాయి.

తొలిసారి ‘ఉగ్ర’ చర్చ

‘ఉగ్రవాదుల నిమాయకం, ఉగ్ర కదలికలు, విదేశీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటం, డ్రగ్స్‌ అక్రమ రవాణాతోపాటుగా ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయాన్ని అడ్డుకోవటం, ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేయటం, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్టవేయటం ద్వారా ఉగ్రవాదంపై పోరాటం చేయాలి’ అని డిక్లరేషన్‌ స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై భద్రతామండలి తీర్మానాలు, ఎఫ్‌ఏటీఎఫ్‌ అంతర్జాతీయ ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని అభిప్రాయపడింది.

గతేడాది ఉడీ ఘటన జరిగిన కొద్ది రోజులకే గోవా బ్రిక్స్‌ సదస్సులో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని డిక్లరేషన్‌లో చేర్చేందుకు చైనా అడ్డుపడిన సంగతి తెలిసిందే. కాగా, లష్కరే, జైషే సంస్థలపై తీవ్ర పదజాలంతో డిక్లరేషన్‌లో మండిపడ్డ నేపథ్యంలో జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌పై నిషేధంపై చైనా సమాధానాన్ని దాటవేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం నిర్ణయానికి ఎప్పటిలాగానే కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. కాగా, తొలిసారిగా బ్రిక్స్‌లో ఉగ్రవాదంపై చర్చ జరిగిందని.. భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం విషయంలో చైనా ధోరణిలో స్వల్ప మార్పు కనిపించిందని పేర్కొంది.

సౌరశక్తి వినియోగాన్ని పెంచే ఎజెండాతో అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఏ)ని మరింత బలోపేతం చేసే విషయంలో బ్రిక్స్‌ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకోసం వినియోగించుకునేలా బ్రిక్స్‌ దేశాలు కలసి పనిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. సాంప్రదాయ వైద్యాన్ని ఇచ్చిపుచ్చుకోవటంలో దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాలని కూడా సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎబోలా, హెచ్‌ఐవీ, క్షయ, మలేరియాతోపాటుగా ఇతర వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యల్లో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించింది. ఉత్తరకొరియా అణుపరీక్షలపైనా బ్రిక్స్‌ కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

భారత్‌ ఓపెన్‌ ఎకానమీ: మోదీ

ప్రపంచంలోని ఓపెన్‌ ఎకానమీల్లో ఒకటిగా భారత్‌ వేగంగా పరిణామం చెందుతోందని ప్రధాని మోదీ తెలిపారు. బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా బిజినెస్‌ కౌన్సిల్‌తో సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. భారత చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ ద్వారా దేశమంతా ఒకే మార్కెట్‌గా మారిందని వెల్లడించారు. చెల్లింపులు, లావాదేవీలను డిజిటల్‌ రూపంలోకి మార్చేలా ప్రోత్సహిస్తున్న కార్యక్రమాల ద్వారా స్టార్టప్‌లు స్థానికంగా తయారీని ప్రారంభించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. ‘నేటి ప్రపంచంలో అతివేగంగా ఓపెన్‌ ఎకానమీగా భారత్‌ పరిణామం చెందుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తొలిసారిగా 40 శాతానికి చేరాయి. 2016–17లో రూ.3.86 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి’ అని మోదీ పేర్కొన్నారు.

ప్రపంచ బ్యాంకు వ్యాపారానుకూల సూచీలో భారత్‌ స్థానం గణనీయంగా మెరుగుపడిందన్నారు. ‘డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా వంటి కార్యక్రమాలు జ్ఞానం ఆధారిత, నైపుణ్యం, సాంకేతికతతో కూడిన సమాజంగా భారత్‌ మారేందుకు దోహదపడుతున్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. వాణిజ్యాన్ని పెంచుకోవటం, పెట్టుబడుల్లో సహకారం వంటి బ్రిక్స్‌ దేశాల ఉమ్మడి లక్ష్యాలను చేరుకోవటంలో బ్రిక్స్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ తోడ్పడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. పేదరిక నిర్మూలనతోపాటుగా వైద్యం, పారిశుద్ధ్యం నైపుణ్యం, ఆహార భద్రత, లింగ సమానత, విద్యుత్, విద్య రంగాలపై భారత్‌ మిషన్‌ మోడ్‌లో పనిచేస్తోందని ప్రధాని వెల్లడించారు.

నేడు మోదీ–జిన్‌పింగ్‌ భేటీ

భారత్‌–చైనా దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్తతకు కారణమైన డోక్లాం ఘటన తర్వాత ఇరుదేశాల అధినేతలు తొలిసారిగా సమావేశం కానున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మోదీ, జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. వీరి సమావేశంలో డోక్లాం సమస్యపై చర్చ జరగనుందని భావిస్తున్నారు.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి విశ్వాసం పెరిగే దిశగా ఇద్దరు నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. అయితే ఏయే అంశాలపై వీరిద్దరు మాట్లాడుకుంటారనే విషయాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. జూన్‌ 16న సిక్కిం సరిహద్దులో డోక్లాం వద్ద చైనా నిర్మించతలపెట్టిన రోడ్డు నిర్మాణ పనులను భారత్‌అడ్డుకోవటంతో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. కాగా, జిన్‌పింగ్‌తో సమావేశం అనంతరం.. ప్రధాని మోదీ మయన్మార్‌కు పయనమవుతారు.

(సాక్షి సౌజన్యం తో)