Home News అసత్య ప్రచారం వెనుక అసలు నిజాలు

అసత్య ప్రచారం వెనుక అసలు నిజాలు

0
SHARE

– స్వామినాథన్ గురుమూర్తి

“సనాతన ధర్మం, తమిళ అస్తిత్వం గురించి అనేక వక్రీకరణలు చేస్తున్నారు. ఈ విషయం తోల్కప్పియమ్, తిరుక్కురళ్, శిలాపాతికరం వంటి గొప్ప గ్రంధాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఈ వక్రీకరణలు జరిగాయని డీఎంకే తో సహా అందరికీ తెలుసు

సనాతన ధర్మాన్ని గురించి సాగుతున్న చర్చలో బయటకు రాకుండా దాచాలనుకునే విషయం ఏమిటంటే ప్రాచీన తమిళ ప్రజానీకం కూడా ఇదే ధర్మం ఆధారంగా జీవనం సాగించారు అనేది. ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని ఎలా మరుగుపరచారు?

సనాతన ధర్మ వ్యతిరేక ధోరణి మూలాలు గత శతాబ్ద కాలంగా సాగుతున్న బ్రాహ్మణ వ్యతిరేక రాజకీయాల్లో ఉన్నాయి. తమిళ ప్రజలకు, సనాతన ధర్మానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని కప్పిపుచ్చడానికి, మరచిపోయేట్లు చేయడానికి పద్దతి ప్రకారం ప్రచార సాగింది. బ్రిటిష్ వాళ్ళు తమ విభజించి పాలించు విధానంలో భాగంగా ప్రోత్సహించిన జస్టిస్ పార్టీతో ఈరకం రాజకీయాలు ప్రారంభమయ్యాయి.

బ్రాహ్మణ వ్యతిరేకతే ప్రధాన అంశంగా 1916లో ప్రారంభమయిన జస్టిస్ పార్టీ 1920లో బాగా బలం పుంజుకుంది. కానీ ఆ తరువాత 1930నాటికి కాంగ్రెస్ ప్రాబల్యం పెరిగిపోవడంతో క్రమంగా కనుమరుగయ్యింది. కానీ ఆ పార్టీ బ్రాహ్మణేతర కులాల్లో నాటిన విభజన, విద్వేష బీజాలు మాత్రం ఆ తరువాత కూడా ఈ బ్రాహ్మణ వ్యతిరేక సామాజిక- రాజకీయాలకు దారితీస్తూనే ఉన్నాయి.

ఈ విభజన, విద్వేష ధోరణిలో అంతిమ దశ ఇ వి రామస్వామి నాయకర్ (EVR) 1946లో స్థాపించిన ద్రవిడ కజగం. అది బ్రాహ్మణ వ్యతిరేకతకు దేశ వ్యతిరేకతను, జాతి వ్యతిరేకతను కూడా జోడించింది. సామాజిక, రాజకీయ ద్రవిడార్ కజగం 1949లో డీఎంకే రూపంలో పూర్తిస్థాయి రాజకీయ అవతారం ఎత్తింది. అయితే ఓటు రాజకీయాల వల్ల దేశ వ్యతిరేక, జాతీవ్యతిరేక ధోరణి క్రమంగా తగ్గినా బ్రాహ్మణ వ్యతిరేకధోరణి మాత్రం ఆ పార్టీని వదలలేదు. ఆ ధోరణే తరచుగా హిందూవ్యతిరేకత, సనాతనధర్మ వ్యతిరేకతగా బయటపడుతూ ఉంటుంది.

కానీ తమిళ సంస్కృతి, సనాతన ధర్మానికి మధ్య అవినాభావ సంబంధాన్ని మాత్రం డీఎంకే దాచిపెట్టడానికి తంటాలు పడుతూనే ఉంటుంది. అయితే ఈ ఇబ్బందికరమైన నిజాన్ని మొట్టమొదట గుర్తించినది, ధైర్యంగా బయటపెట్టినది మరెవరోకాదు డీఎంకే స్థాపకుడు సాక్షాత్తు రామస్వామి నాయకరే.

తమిళనాడు `పెరియార్ మన్’ (EVR భూమి) అని డీఎంకే ప్రచారం చేస్తూ ఉంటుంది. కానీ EVR తమిళ భాషను, సాహిత్యాన్ని ఖండించాడు, తమిళ ప్రజలను అనాగరికులని అసహ్యించుకున్నాడు. తమిళ రచయితలు పనికిమాలినవారని తిట్టిపోశాడు. తమిళ వ్యాకరణం, సామాజిక, సాంస్కృతిక జీవనానికి మూలమైన తోల్కప్పియమ్ ప్రాచీన తమిళ సాహిత్యాన్ని నిరాకరించాడు. అది `ఆర్యన్ స్తుపే’ (బ్రాహ్మణుల కల్పన) అని కొట్టిపారేశాడు.

ఇలా నిరసించడానికి కారణం ఏమిటి? మొదటి కారణం, తోల్కప్పియమ్ రచయిత తోల్కాప్పియార్ ఈ గ్రంధాన్ని నాలుగు వేదాలు చదివిన పండితుడి నుండి గ్రహించాడని ఆ పుస్తకపు పీఠికలోనే ఉంటుంది. రెండవ కారణం, తోల్కాప్పియార్ గ్రంధం తమిళ సమాజాన్ని అరసర్ (క్షత్రియులు), ఆనందనార్ (బ్రాహ్మణులు), వైశ్యార్(వైశ్యులు), వేళలార్(శూద్రులు) అనే నాలుగు వర్ణాల వ్యవస్థగా పేర్కొంటుంది. ఈ వ్యవస్థ `జన్యుపరమైనది’(పుట్టుకతో ఏర్పడేది) అని చెప్పడంతో EVR ఈ గ్రంధంతోపాటు తోల్కాప్పియార్ ను కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు.

తిరుక్కురళ్ వ్రాసిన తిరువళ్ళువ ను కూడా EVR తీవ్రంగా నిరసించాడు. DMK పార్టీ అయితే తిరువళ్ళువ ను తీవ్రంగా దూషిస్తుంది. ఎందుకంటే వేదాధ్యపనం (వేదాన్ని నేర్పడం) బ్రాహ్మణుల కుల ధర్మం అని తిరువళ్ళువ పేర్కొనడం వీరికి నచ్చలేదు.

ఇంతటితో అయిపోలేదు. స్టాలిన్ తండ్రి కరుణానిధి తమిళ సాహిత్యానికి ఒక జైన ముని వ్రాసిన శిలాపాతికరం అనే కావ్యమే తలమానికమని చెపుతూ ఉండేవారు. ఆ కావ్యం ముగింపులో కథానాయకి కన్నగి తన భర్తకు పాండ్య రాజు మరణదండన విధించడాన్ని నిరసిస్తూ తన ఒక రొమ్మును చీల్చి అగ్ని పుట్టిస్తుంది. కానీ EVR కు మాత్రం ఈ కావ్యం కూడా ఏమాత్రం నచ్చలేదు. రొమ్ముల నుండి అగ్నిపుట్టించడానికి కన్నగి తన గుండెల్లో ఫాస్ఫరస్ ను దాచుకుందా అంటూ హేళన చేశాడు. ఇలా శిలాపాతికరం కావ్యాన్ని కూడా వ్యతిరేకించడానికి కారణం ఏమిటంటే ఆ కావ్యంలో కన్నగి బ్రాహ్మణులు, పిల్లలు, స్త్రీలు, ఆవులను వదిలి మిగిలిన అందరిని దహించి వేయమని అగ్నిని కోరుతుంది.

కానీ కరుణానిధి మాత్రం కన్నగి కథను బాగా ప్రచారం చేశాడు. అంతేకాదు ఆ కథ ఆధారంగా సినిమా కూడా తీశాడు. వర్ణాశ్రమాలు సనాతన ధర్మంలో ఉంటే అవి తమిళ సంస్కృతిలో కూడా ఉన్నట్లే. మనువు వర్ణాశ్రమాలను సమర్ధిస్తే తోల్కప్పియార్ కూడా అంగీకరించినట్లే. వేదాలు సనాతనధర్మానికి మూలమైతే తిరుక్కురళ్ ఆ వేదాలను అంగీకరించి, ఆమోదించినట్లే. సనాతన ధర్మం బ్రాహ్మణులకు గౌరవాన్ని, విలువను ఆపాదిస్తే తోల్కప్పియమ్, తిరుక్కురళ్, శిలాపాతికరం కూడా సమ్మతించినట్లే. అందుకనే వీటన్నింటినీ EVR తీవ్రంగా వ్యతిరేకించాడు.

తోల్కొప్పమ్, తిరుక్కురళ్, శిలాపాతికరం వంటివన్నీ తమిళ సంస్కృతికి మూలం సనాతనధర్మమని చెప్పాయి. అయినా సనాతనధర్మం కొత్తగా బయటనుండి వచ్చిందని నమ్మించాలని DMK ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రముఖ సనాతనధర్మ గురువులు ఆది శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్యులు ద్రావిడ భూమిలోనే జన్మించారు. ముఖ్యంగా మొదటి ఇద్దరు కేరళతోపాటు ఉన్న తమిళ భూమిలో జన్మించారు.

ఆది శంకరులు బోధించిన అద్వైత సిద్ధాంతం మనుషులేకాదు, సర్వ చరాచర జగత్తు ఒక్కటేనని పేర్కొంది. ఒక సందర్భంలో ఒక అంత్యజుడు ఎదురుపడినప్పుడు పక్కకు తప్పుకోమని ఆది శంకరులు చెప్పినప్పుడు అతను పరమశివుడై దర్శనమిచ్చాడు. అంతేకాదు అద్వైత సిద్ధాంతాన్ని గుర్తుచేశాడు. అప్పుడు ఆ వ్యక్తి పాదాలకు నమస్కరించిన శంకరాచార్యులు బ్రాహ్మణులు, అంత్యజులు ఒకటేనని చెప్పే మనీషా పంచకమనే స్తోత్రాన్ని పఠించారు. డి‌ఎం‌కే లోని `నిరక్షరాస్యులకు’ ఈ విషయం తెలుసా?

ఇక విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు తనకు గురువుగారు బోధించిన మంత్రాన్ని అన్ని కులాలవారికి చెప్పారు. కుల విభజనను ఆయన పూర్తిగా తిరస్కరించారు. జీవిత చరమాంకంలో రామానుజుల జీవితచరిత్రను వ్రాసిన కరుణానిధి ఆయన కుల విభజనను పట్టించుకోలేదని ప్రశంసించాడు. అంతేకాదు తమ సొంత టీవి చానల్ KTV లో ప్రసారం చేయడం కోసం రామానుజుల గురించిన చలన చిత్రాన్ని రూపొందించాడు. మరి ఈ విషయం డి‌ఎం‌కే నాయకులైన తండ్రికొడుకులకు తెలియదా?

తమిళ సంస్కృతి, సనాతన ధర్మాల మధ్య సంబంధం వేలాది సంవత్సరాల పురాతనమైనది. ఆది శంకరుల కంటే ముందువారని చెప్పే ప్రముఖ తమిళ సిద్ధ పురుషుడు తిరుమూలార్ రూపరహితమైన బ్రహ్మమే బయటకు కనిపించే ప్రతి రూపంలోనూ ఉందనే అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. రూపరహితమైన బ్రహ్మమును తెలుసుకునేందుకు విగ్రహారాధన మొదటి దశ అని ఆదిశంకరులు చెప్పారని 19వ శతాబ్దానికి చెందిన వల్లలార్ గుర్తుచేశారు. విచిత్రమేమంటే అద్వైత సిద్ధాంతాన్ని కాదనే డి‌ఎం‌కే తిరుమూలార్, వల్లలార్ లను మాత్రం అంగీకరిస్తుంది!

ఈ చర్చ ఇలా కొనసాగితే తమిళ సంస్కృతిని సొంతం చేసుకుని, సనాతనధర్మాన్ని కాదనడానికి ప్రయత్నిస్తున్న DMK కు మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే సనాతనధర్మంలో భాగమైన పూజలు, హోమాలు DMK నాయకుల కుటుంబంలో ఎంతగా చొచ్చుకుపోయాయంటే రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి తరుచూ శత్రు సంహార యజ్ఞాలు చేస్తూనే ఉంటారు.

చివరగా ఒక మాట: “హిందూ మతాన్నే సనాతన ధర్మం అంటారు. వైదిక మతం, వేద మతం, సనాతనధర్మం అంటే శాశ్వత, సనాతన విలువలు. వర్ణాశ్రమ ధర్మం పని విభజనపై ఆధారపడినది. అయితే ఆ విభజనలో ఎక్కువతక్కువలు, నీచ అధమాలు లేవు.’’ – ఇదీ 2022లో DMK ప్రభుత్వం భారతీయ సంస్కృతి గురించి ముద్రించిన 12వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్న విషయం! సనాతనధర్మాన్ని దూషిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడికి, ఇతర మంత్రులకు ఈ స్కూలు పుస్తకం ఉచితంగా ఇస్తే బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here