Home News నాగపూర్‌లో RSS తృతీయ వ‌ర్ష‌ శిక్షా వ‌ర్గ‌ ఆరంభం

నాగపూర్‌లో RSS తృతీయ వ‌ర్ష‌ శిక్షా వ‌ర్గ‌ ఆరంభం

0
SHARE

25 రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శిక్షా వర్గ తృతీయ వర్ష‌ మే 9న నాగపూర్‌లో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి భవన్ ప్రాంగణంలో ప్రారంభమైంది.

ఈ సంద‌ర్భంగా దేశ‌ నలుమూలల నుంచి వ‌చ్చిన స్వ‌యంసేవ‌కుల‌ను ఉద్దేశించి వ‌ర్గ పాల‌క్ అధికారి శ్రీ మంగేష్ భండేజీ ప్రసంగించారు. స్వయంసేవక్ జీవితంలో సంఘ్ శిక్షా వర్గ ప్రాముఖ్యతను వివ‌రించారు. “మొదటి సంఘ శిక్షా వర్గ 1927లో మోహితేవాడలో జరిగింది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది స్వయంసేవకులు మొదటి సంఘ శిక్షా వర్గలో 40 రోజుల పాటు శిక్ష‌ణ పొందారు. దేశానికి స్వరాజ్యం సిద్ధించిన తర్వాత RSS పై నిషేధం, ఎమర్జెన్సీ విధింపు, గత రెండు సంవత్సరాల కోవిడ్ ఆంక్షలు వంటి క్లిష్ట పరిస్థితుల‌ను మినహాయించిన పక్షంలో సంఘ శిక్షా వర్గ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జ‌రుగుతోంది.” అని ఆయ‌న తెలిపారు.

“దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్వ‌యంసేవ‌కులు నాగపూర్‌లోని రేషింబాగ్‌లో 25 రోజుల పాటు వ‌ర్గ‌లో శిక్షణ పొందనున్నారు. స్వయంసేవకులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి వేర్వేరు భాషలలో మాట్లాడుతున్నప్పటికీ, వారు ఒకరినొకరు సులభంగా అర్థం చేసుకుంటారు. వ‌ర్గ ముగింపులో అత్యంత భావోద్వేగానికి లోనవుతారు. స్వయంసేవకుల సమగ్ర అభివృద్ధికి సంఘ‌ శిక్షా వర్గ‌ ఎంతో తోడ్పడుతుంది. సంఘ శిక్షా వర్గలో బోధించే ప్రధానమైన అంశంగా నిబద్ధతతో కూడుకున్న మనస్సును అలవరుచుకునే విధానం ఉంటుంది.” అని శ్రీ మంగేష్ భండేజీ అన్నారు.

ఈ సంవత్సరం 96 మంది శిక్షకులతో పాటు దేశవ్యాప్తంగా 735 మంది స్వ‌యంసేవ‌కులు వ‌ర్గ‌లో పాల్గొంటున్నారు. సంఘ్ ఆవిర్భవించిన నాగపూర్‌లో స్వ‌యంసేవ‌కులు సాధన చేస్తారని మంగేష్‌జీ భండే తెలిపారు. పూర్వ సర్ కార్య‌వాహ శ్రీ భయ్యాజీ జోషి వారి ప్రసంగంతో స్వ‌యంసేవ‌కుల‌లో ఉత్స‌ాహాన్ని నింపారు. జూన్ రెండవ తేదీన ముగిసే వర్గలో భాగంగా మే 21న పథ‌సంచలన్ నిర్వహిస్తారు.