Home Rashtriya Swayamsevak Sangh ‘ఉదారవాదులు’ పాటిస్తున్న ఆధునిక అస్పృశ్యత

‘ఉదారవాదులు’ పాటిస్తున్న ఆధునిక అస్పృశ్యత

0
SHARE

డా. మన్మోహన్ వైద్య

ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతం, కార్యపద్దతిపై లేనిపోని అబద్ధాలు, అపోహలు ప్రచారం చేసి, దానిపట్ల సమాజంలో `అంటరానిది’ అనే నిరసన భావాన్ని సృష్టించాలని `ఉదారవాదులు’ ప్రయత్నించారు.

ఇటీవల భారత్ లో జర్మనీ రాయబారి వాల్టర్ జె. లిండ్నర్ నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అయితే ఇదేమి కొత్తకాదు. నాగపూర్, డిల్లీలోని సంఘ కార్యాలయాలను ఇంతకు ముందు కూడా అనేకమంది రాయబారులు, విదేశీ ప్రముఖులు సందర్శించారు, సందర్శిస్తూ ఉంటారు. సంఘ సిద్ధాంతం, కార్యపద్దతి గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇలా జరగడం ఇదేమి మొదటిసారికాదు. అయితే లిండ్నర్ తన పర్యటన వివరాలను పత్రికలకు తెలియజేశారు. సాధారణంగా ఇలా జరగదు. దానితో లిండ్నర్ సందర్శనపై దుమారం రేగింది.

మన దేశంలో కాంగ్రెస్ పాలన సాగుతున్నప్పుడు ప్రభుత్వ మద్దతు కలిగిన `వామపక్ష – ఉదారవాదుల’ సమూహం ఒకటి తయారయింది. ఈ విరోధాభాసాలంకార (పరస్పర విరుద్ధమైన) `వామపక్ష – ఉదారవాద’ పదాన్ని ఎవరు కనిపెట్టారో నాకు తెలియదు. ఎందుకంటే ఈ సమూహానికి చెందినవారు అత్యంత అసహనం, అసహిష్ణుతతో వ్యవహరిస్తుంటారు. తమతో విభేదించేవారిని అసలు సహించలేరు. ఈ శక్తులు ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతం, చరిత్ర గురించి అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఆ సంస్థ పట్ల వ్యతిరేకతను పెంచడానికి ప్రయత్నించాయి. సంస్థను అప్రతిష్టపాలు చేసి, అంటరానిదిగా చిత్రీకరించాలనుకున్నాయి. కానీ భవంతుని దయ, కార్యకర్తల కృషి మూలంగా ఆర్ ఎస్ ఎస్ నిరంతరం వృద్ధి చెందుతూ, సర్వత్ర వ్యాపించింది. మరోవైపు ఒకప్పుడు గట్టిపట్టు కలిగిన ఈ వామపక్ష –ఉదారవాద వర్గం క్రమంగా తన ప్రభావం, ప్రాభవం కోల్పోయింది. వారు అనుసరించిన పద్దతులు, వారు చేసిన ప్రచారం మూలంగా వారే విమర్శలకు గురవడమేకాక దూరంగా ఉంచవలసిన వారుగా ముద్ర పడిపోయారు.

భారత నిర్మాతలు ఈ భారతావని గురించిన తమ ఆలోచనను రాజ్యాంగంలో పేర్కొన్నారు. భిన్నత్వం, వైవిధ్యాన్ని మన్నించి, ఆదరించడం, కలసి విశాల దృక్పధంతో, సమరస్యపూర్వకంగా విషయాలను చర్చించడం భారతీయత అని వారు భావించారు. కానీ `వామపక్ష – ఉదారవాదులు’ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తారు. మాజీ రాష్ట్రపతి డా. ప్రణబ్ ముఖర్జీ ఒక ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఈ వర్గం ఆయన్ని విమర్శించింది. డా. ముఖర్జీకి రాజకీయ, సామాజిక రంగాల్లో పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం ఉంది. అది కూడా ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ఆయన్ని ఒక కార్యక్రమానికి ఆహ్వానించడంలో ఆర్ ఎస్ ఎస్ విశాల దృక్పధం కనిపిస్తే, ఆ ఆహ్వానాన్ని మన్నించిన డా. ముఖర్జీని విమర్శించడంలో ఈ వర్గపు సంకుచిత, అసహన ధోరణి బయటపడింది. అలాగే జైపూర్ సాహిత్య ఉత్సవానికి ఆర్ ఎస్ ఎస్ అధికారులను ఆహ్వానించడాన్ని వ్యతిరేకించడంలో ఈ ఉదారవాదుల అసహిష్ణుత మరోసారి బయటపడింది.

నాగపూర్ సంఘ కార్యాలయాన్ని జర్మనీ రాయబారి సందర్శించడాన్ని తప్పు పట్టిన ఒక పత్రికా వ్యాసాన్ని ఇటీవల నేను చూశాను. ఆర్ ఎస్ ఎస్ పై వ్యతిరేక ప్రచారం కోసం `ప్రగతివాద’, `ఉదారవాద’ ముసుగులో వచ్చిన అనేక వ్యాసాల్లో ఇది మరొకటి మాత్రమే.

ఆర్ ఎస్ ఎస్ హిట్లర్ ను అభిమానిస్తుంది, అనుసరిస్తుందనేది `ఉదారవాదులు’ చేసే అబద్దపు ప్రచారంలో ఒకటి. ఇంతకు మించిన సత్యదూరమైన విషయం మరొకటి ఉండదు. గత 40 ఏళ్లుగా నేను ఆర్ ఎస్ ఎస్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాను. ఇన్నేళ్ళ నా అనుభవంలో ఏ ఆర్ ఎస్ ఎస్ అధికారి హిట్లర్ ను మెచ్చుకోవడంకాని, నాజీ ఇజం గొప్పదని చెప్పడంకానీ నేను వినలేదు, చూడలేదు. అందుకు విరుద్ధంగా అనేకసార్లు ఇజ్రాయిల్ లో కనిపించే జాతీయవాదం, దేశం పట్ల నిష్ట, ఐకమత్యం గురించిన ప్రశంసా వాక్యాలు అనేకసార్లు విన్నాను. కాలేజీలో చదువుకునే రోజుల్లో లియాన్ యూరిస్ వ్రాసిన `ఎక్సోడస్’ అనే నవల చాలాసార్లు చదివాను, అనేకమందికి చదవమని చెప్పాను. ఇజ్రాయెల్ ను ఏర్పరచుకోవాలన్న 18 శతాబ్దాల తమ కలను యూదులు ఎలా సాకారం చేసుకున్నారో ఆ నవలలో అద్భుతంగా వర్ణించారు.

ఆర్ ఎస్ ఎస్ సంస్థాపకులు డా. కె.బి. హెడ్గేవార్ జీవిత చరిత్రను మొదటిసారి వ్రాసిన సీనియర్ ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ శ్రీ. ఎన్. హెచ్. పాల్కర్ మరో పుస్తకం కూడా వ్రాసారు. ఇజ్రాయెల్ సాధించిన విజయాలను వర్ణించే ఆ పుస్తకాన్ని ఆయన మరాఠీలో వ్రాసారు. ఆర్ ఎస్ ఎస్ లో నా తొలినాళ్ళలో నేను హిట్లర్ గురించి చదివిన పుస్తకం – `నాజీ రాక్షసుడు హిట్లర్ పతనం.’

ఉదారవాద వర్గం తరచుగా శ్రీ ఎం, ఎస్. గోల్వాల్కర్ వ్రాసిన `వుయ్ అండ్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్’ గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది. ఈ పుస్తకం మొట్టమొదటసారి 1938లో ప్రచురితమయ్యింది. అప్పటికి ఎం. ఎస్. గోల్వాల్కర్ కు ఆర్ ఎస్ ఎస్ లో ఎలాంటి బాధ్యత లేదు. అంటే అది ఆర్ ఎస్ ఎస్ ఆలోచననుగానీ, అభిప్రాయాన్నిగానీ ప్రతిబింబించదు. పైగా ఆ పుస్తకాన్ని వి.డి. సావర్కర్ అన్నగారైన బాబారావ్ సావర్కర్ వ్రాసారు. మరాఠీలో ఉన్న ఆ పుస్తకాన్ని ఎం. ఎస్. గోల్వాల్కర్ కేవలం అనువాదం చేశారు.

ఎకనామిక్ టైమ్స్ (సెప్టెంబర్, 8,2016)కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాథూరాం గాడ్సే, వీర సావర్కర్ ల సమీప బంధువైన సాత్యకి సావర్కర్ ఇలా చెప్పారు – “బాబూరావ్ సావర్కర్ `రాష్ట్ర మీమాంస’ అనే పుస్తకపు ఆంగ్ల అనువాదం విషయంలో నాథూరాం గాడ్సే, ఎం. ఎస్. గోల్వాల్కర్ ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. వారి మధ్య సంబంధాల్లో పొరపొచ్చాలు వచ్చాయి.’’

1972లో జర్నలిస్ట్ సైఫుద్దీన్ జిలానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎం. ఎస్. గోల్వాల్కర్ మైనారిటీలు, ముస్లింల గురించి ఆర్ ఎస్ ఎస్ దృష్టికోణాన్ని స్పష్టంగా వివరించారు. గోల్వాల్కర్ గురించి మాట్లాడే ఈ `ఉదారవాదులు’, `మేధావులు’ ఈ ఇంటర్వ్యూ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించరు. ఎందుకంటే అది తమ వాదాన్ని, ప్రచారాన్ని తప్పని ఋజువుచేస్తుంది కనుక. ఆ ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్య అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను –

డా. జిలానీ: `భారతీయకరణ’ గురించి చాలా చర్చ జరుగుతోంది. దీని గురించి అనేక శంకలు, సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని గురించి కాస్త వివరిస్తారా?

శ్రీ గురూజీ: `భారతీయకరణ’ అనేది జనసంఘ్ నినాదం. దానికి సంబంధించి గందరగోళం ఏది లేదు. `భారతీయకరణ’ అంటే అందరినీ హిందూత్వంలోకి మార్చడం కాదు.

“మనమంతా ఈ భూమి బిడ్డలమని గుర్తించాలి. అందుకని ఈ భూమి పట్ల విధేయత కలిగిఉండాలి. మనమంతా ఒకే సమాజానికి చెందినవారం. మన పూర్వజులు కూడా ఒకరే. మన ఆశలు, ఆకాంక్షలు ఒకటే. ఈ విషయాన్ని అర్ధం చేసుకోవడం, గుర్తించడమే `భారతీయకరణ’

భారతీయకరణలో ఎవరు తమ మతాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. ఇలా వదలాలని మనం ఎప్పుడు చెప్పలేదు, ఇకముందు చెప్పబోవడంలేదు. నిజానికి మానవాళి మొత్తానికి ఒకే మతవ్యవస్థ సరిపోదని మన నమ్మకం.”

ఇటీవల జరిగిన ఉపన్యాస కార్యక్రమాల్లో డా. మోహన్ జీ భాగవత్ ఇలా అన్నారు – “ఒక జాతిగా మనందరికీ హిందువులుగా గుర్తింపు ఉంది. కొందరు తమను తాము హిందువులుగా చెప్పుకోవడానికి గర్విస్తారు. మరికొందరు అలా చెప్పుకోవడానికి ఇష్టపడరు. రాజకీయ, ఇతర ప్రయోజనాల దృష్ట్యా కొందరు బహిరంగంగా అలా చెప్పడానికి ఇష్టపడకపోయినా, ఏకాంతంలో తాము హిందువులమని ఒప్పుకుంటారు. ఇక కొందరు తాము హిందువులమనే విషయాన్నే పూర్తిగా మరచిపోతారు. అయినా వీరంతా మనవాళ్లే. భారతీయులే. పరీక్షల్లో సులభమైన ప్రశ్నలకు ముందు సమాధానం వ్రాసి, ఆ తరువాత కఠినమైన ప్రశ్నలకు వెళ్ళినట్లుగా మన పని కూడా సులభమైన విషయాల నుంచి కఠిన విషయాలకు వెళుతుంది. తమను తాము హిందువులుగా (సంస్కృతికంగా) గుర్తించుకునేవారి దగ్గరకు వెళతాము. ఎవరిని శత్రువులుగా భావించం. ఇతరులు ఎవరైనా మమ్మల్ని శత్రువులుగా చూడవచ్చునుగాక. మేము మాత్రం అలా చూడం. వారు చేసే దాడులను ఎదుర్కొంటామేగాని వాళ్ళ నాశనాన్ని కోరుకోము. అంతేకాదు ఎప్పటికైనా వారు మాతో కలిసి పనిచేయాలని ఆశిస్తాము. ఇదే నిజమైన హిందూత్వం.’’

ఆయన ఇంకా ఇలా అన్నారు – “మనలో మనం కలహించుకోవడంవల్లనే విదేశస్థులు ఈ దేశాన్ని ఆక్రమించి, పాలించగలిగారని డా. అంబేద్కర్ రాజ్యాంగ సభలో చెప్పారు. ఆయన చెప్పిన విషయమేమిటో స్థూలంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. సరిగ్గా ఏం చెప్పారో మీరు చదివి తెలుసుకోవచ్చును. పార్లమెంట్ లో అధికార, విపక్షాలు ఉంటాయని, అయితే అది వ్యవస్థకు సంబంధించిన ఏర్పాటు మాత్రమేనని, చివరికి మనమంతా ఒకటేనని ఆయన చెప్పారు. మనలో ఈ సౌభ్రాతృత్వ భావన లేకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది మనం చెప్పలేము. సంఘ ఈ సౌభ్రాతృత్వ భావనను పెంపొందించడానికే కృషి చేస్తుంది. దానికి ఆధారం `భిన్నత్వంలో ఏకత్వం’ అనే మన ప్రత్యేక లక్షణం. ఈ సంప్రదాయ దృష్టినే ప్రపంచం `హిందూత్వం’గా పరిగణిస్తోంది. అందుకనే మనం `హిందూ రాష్ట్ర’ అని అంటే దానర్ధం మనకు ముస్లింలు అవసరం లేదనికాదు.’’

డా. హెడ్గేవార్ ప్రఖర దేశభక్తులని, తన జీవన కార్యాన్ని తానే తెలుసుకుని అందులో పూర్తిగా నిమగ్నమైన వ్యక్తి అని ఆయన జీవితచరిత్ర వ్రాసిన రచయిత అంటారు. ఆయన ఏ వ్యక్తిని `గురువు’గా స్వీకరించలేదు. సమాజంలోని అన్నిరకాల వ్యక్తులతో, తన సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవారితో కూడా, ఆయనకు సన్నిహిత స్నేహసంబంధాలు ఉండేవి. ఆయన కార్యకలాపాలన్నీ `ఆత్మ బోధ’, `ఆత్మ సాక్షాత్కారం’ పై ఆదారపడి సాగేవి. ఆయనకు లోకమాన్య తిలక్ అంటే చాలా గౌరవం ఉండేది. 1920లో తిలక్ స్వర్గస్తులైన తరువాత కాంగ్రెస్ కు నాయకత్వం వహించవలసిందిగా యోగి అరవిందులను ఒప్పించడానికి ఆయన డా. ముంజేతోపాటు పాండిచ్చేరి వెళ్లారు. 1921లో లోకనాయక్ ఆణే నేతృత్వంలోని బెరార్ ప్రాంత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్వాతంత్ర్య పోరాటంలో విప్లవకారులు నిర్వహిస్తున్న ఉద్యమాన్ని ఖండిస్తూ తీర్మానం ఆమోదించాలని ప్రయత్నం జరిగింది. కానీ ఈ విషయం తెలుసుకున్న డా. హెడ్గేవార్ అలా చేయకుండా వారిని వారించారు. డా. హెడ్గేవార్ విప్లవ వీరులతోనూ, అలాగే కాంగ్రెస్ లోని తిలక్ మద్దతుదారులు, గాంధీజీ అనుయాయులు, హిందూ మహాసభ నాయకులు, సామాజిక సంస్కరణవాదులు ..ఇలా అందరితో సమానదూరం పాటించేవారు.

ఆయనకు డా. ముంజే, వి. డి. సావర్కర్, మహాత్మా గాంధీలతో సాన్నిహిత్యం ఉండేది. సంఘ శాఖలను సందర్శించమని ఈ నేతలను ఆయన ఆహ్వానించేవారు. అయితే వారు వచ్చి ఇచ్చిన సలహాలను గౌరవిస్తూనే స్వయంసేవకులతో కలిసి సమిష్టి నిర్ణయం తీసుకునేవారుతప్ప ఈ నేతల ప్రభావానికి లోనయ్యేవారుకాదు.

1925లో సంఘ స్థాపన జరిగినప్పుడు డా. ముంజీ ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదు. కాబట్టి డా. ముంజే చెప్పిన విషయాలు కూడా సంఘపై ఎలాంటి ప్రభావం చూపలేదు. నిజానికి లండన్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు డా. ముంజే హాజరుకావడాన్ని డా. హెడ్గేవార్ వ్యతిరేకించారు.

పూణేలో జరిగిన ఒక సమావేశంలో డా. హెడ్గేవార్ ను ఒక వ్యక్తి `భారత్ హిందూ రాష్ట్రమని ఏ మూర్ఖుడు చెప్పాడు’ అంటూ ఘాటుగా ప్రశ్నించాడు. అందుకు డా. హెడ్గేవార్ ఏమాత్రం తొణకాకుండా, సంకోచించకుండా `నేను, డా. హెడ్గేవార్ చెపుతున్నాను, భారత్ హిందూ రాష్ట్రం’ అని సమాధానం చెప్పారు. ఆ సమాధానం చెప్పడానికి ఆయన ఏ గ్రంధాన్ని ఉటంకించలేదు, ఏ రచయిత మాటల్ని ఉదహరించలేదు. 1937లో డా. హెడ్గేవార్ విదర్భ ప్రాంతంలో వీర సావర్కర్ పర్యటన ఏర్పాటు చేశారు. నెలరోజులపాటు ఆయనతోనే ఉన్నారు. సంఘ చేస్తున్న పని చూసి సావర్కర్ ముగ్ధులయ్యారు. తాను కూడా ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్ కావాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే వారి ఆశీర్వచనాలు ఉంటే చాలు సంఘ కార్యం ఎంతో ముందుకు పోతుందని మాత్రం డా. హెడ్గేవార్ తెలియజేశారు.

ఒక శాస్త్ర విషయానికి అనేక వ్యాఖ్యానాలు ఉండవచ్చును. ఇది భారతీయ సంప్రదాయం. భగవద్గీతను అనేకమంది పండితులు, మేధావులు అనేక రకాలుగా వ్యాఖ్యానించారు. హిందూత్వం విషయంలో కూడా ఇదే జరిగింది. వేదాలను అనుసరించేవారు, గౌరవించేవారు ఎవరైనా వారు హిందువులు అని లోకమాన్య బాలగంగాధర తిలక్ నిర్వచించారు.

“ప్రామాణ్య బుద్ధిర్ వేదేషు ఉపశ్యానామ్ అనియమః’’
కానీ ఈ నిర్వచనం వల్ల భారతీయులైనా జైనులు, బౌద్ధులు హిందువులు కాకుండా పోయారు.

స్వాతంత్ర్య వీర సావర్కర్ మరింత విస్తృతమైన నిర్వచనం చెప్పారు. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్న భూభాగాన్ని పుణ్యభూమి, పితృభూమిగా మన్నించి, గౌరవించేవారంతా హిందువులు అని ఆయన చెప్పారు.

“ఆసింధుసింధు పర్యంతం యస్య భారత భూమిక
పితృభూః పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మృతః”

ఈ నిర్వచనం భారతీయ క్రైస్తవులు, ముస్లింలు, పార్శీలను పక్కన పెడుతోంది.

శ్రీ గురూజీ మరింత విస్తృతమైన నిర్వచనం ఇచ్చారు. భారత్ ఒకే పూర్వజులు, సమాన సంప్రదాయాలు కలిగిన మాతృభూమి అని వారు నిర్వచించారు. ఇది శతాబ్దాల పాటు భారత్ లో నివసిస్తున్నవారికి కూడా సరిపోతుంది. ఈ ప్రత్యేకమైన గుర్తింపే హిందూత్వం. భారతీయ దృష్టి ప్రకారం ప్రజలు ఒక `జాతి’ అవుతారుకానీ `రాజ్యం’ కారు. మన దేశంలో ఎన్ని రాజ్యాలు, ఎందరు రాజులు ఉన్నా మనమంతా ఒకటే ప్రజ.

పీటర్ అండర్సన్ తన `ఇండియన్ ఐడియాలజీ’ అనే పుస్తకంలో గాంధీజీ మాటలను ప్రస్తావించారు – “ప్రకృతి ఏర్పరచిన ఒకే భూఖండం భారత్. అందులో మేమంతా ఒకటే ప్రజ. తరతరాలుగా ఇదే జాతీయభావన ఇక్కడ విలసిల్లింది. ఇది ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.’’

ఆండర్సన్ ఇంకా ఇలా వ్రాస్తారు – “ఈ ఉపఖండంలో కనిపించే ఐక్యత, జాతీయ వారసత్వం, నైతిక, మేధోపరమైన గుణాలు భారతీయులకు ప్రత్యేకతను తెచ్చాయి. నిజానికి ఈ నాగరకత ఏర్పడినప్పుడే ఈ అద్భుత ఏకత్వభావన వీరిలో నిండిందనిపిస్తుంది.’’

హిందూత్వంగా పిలిచే ఈ ప్రత్యేకమైన ఏకత్వభావాన్నే అన్నీ సామాజిక రంగాల్లో దర్శించాలి. అదే హిందూ రాష్ట్ర సాక్షాత్కారం. దీనికి, నిరంకుశ రాజ్యానికి పోలిక లేదు. నిజానికి నిరంకుశ రాజ్యం హిందూత్వానికి, భారత్ కు విరుద్ధమైనది.

ఇప్పుడు `బంచ్ ఆఫ్ థాట్స్’ గురించి చూద్దాం. 1940 నుండి 1964 వరకు శ్రీ గురూజీ (ఏం.ఎస్. గోల్వాల్కర్) వివిధ సందర్భాల్లో, వివిధ సభల్లో, సమావేశాల్లో చెప్పిన విషయాల సంకలనం అది. అయితే అందులో 1964 తరువాత 1973 వరకు ఆయన చెప్పిన విషయాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలూ లేవు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రస్తుత సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ `బంచ్ ఆఫ్ థాట్స్’ గురించి ఇలా చెప్పారు – “ప్రత్యేక సందర్భాలలో, కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని చెప్పిన విషయాలు అవి. అవి శాశ్వత సత్యాలు కావు. గురూజీ శాశ్వత ఆలోచనలు, అభిప్రాయాలను `శ్రీ గురూజీ: విజన్ అండ్ మిషన్’ అనే సంకలనంలో చూడవచ్చును. కేవలం ప్రత్యేక సందర్భంలో చెప్పినవి కాకుండా ఎల్లప్పటికి వర్తించే విషయాలను ఇందులో పొందుపరచారు.’’

బంచ్ ఆఫ్ థాట్స్ (తెలుగులో `పాంచజన్యం’)లోని `అంతర్గత సవాళ్ళు – క్రైస్తవులు, ముస్లిములు, కమ్యూనిస్ట్ లు’ అనే అధ్యాయాన్ని గురించి తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో క్రైస్తవ మతమార్పిడులు, జిహాది ముస్లిం మతమౌఢ్యం, నక్సలిజం లేదా మావోయిజంలుగా వీటిని తీసుకోవాలి. ఈ మూడు కార్యకలాపాలు రాజ్యాంగవేత్తలు కోరుకున్న భారతానికి పూర్తి విరుద్ధం. క్రైస్తవులంతా మతమార్పిడి కార్యకలాపాలకు పాల్పడకపోవచ్చును. కొందరు మిషనరీలు, కొన్ని చర్చ్ లు వీటికి పాల్పడుతుండవచ్చును. వీటికి మతం పేరుతో కొందరు క్రైస్తవులు కూడా మద్దతు తెలుపుతుండవచ్చును. 1967లో అప్పటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఒడిశాల్లో మతమార్పిడి నిరోధక చట్టం అమలయ్యింది. బలవంతంగా, మోసపూరితంగా, ఆశచూపి మతమార్పిడి చేయరాదన్న నిబంధనను చర్చ్ లు, మిషనరీలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే ముస్లిములంతా కాకుండా కొందరు ముస్లింలు, కొన్ని ముస్లిం సంస్థలు ఇస్లాం పేరుతో జిహాది మతమౌఢ్యాన్ని ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు మతం పేరుతో కొందరు ముస్లింల మద్దతు కూడా కూడగట్టగలుగుతున్నాయి. ఇక మావోయిస్ట్ లు, నగర నక్సల్స్ సాగిస్తున్న కార్యకలాపాలు ప్రజానీకానికి తెలిసిపోయాయి. దేశ ప్రజానీకాన్ని కాపాడడం కోసం సైనికులు చేసే బలిదానాలను ఏ కమ్యూనిస్ట్ సంస్థ అయినా ప్రశంసించడం ఎప్పుడైనా చూసారా? ముఖ్యంగా మావోయిస్ట్ లను ఎదిరిస్తూ ప్రాణాలు కోల్పోయిన భద్రతా దళాలకు వీరు ఎప్పుడైనా శ్రద్ధాంజలి ఘటించగా చూసారా? కానీ మావోయిస్ట్ లను, నక్సల్స్ ను భద్రతా దళాలు పట్టుకుంటే మాత్రం నానాగొడవ చేస్తారు. ఈ మూడు జాతి వ్యతిరేక కార్యకలాపాల గురించి భారతీయులను హెచ్చరించడం చాలా ముఖ్యం, చాలా అవసరం.

ఆర్ ఎస్ ఎస్ నిషేధిత సంస్థ కాదు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు ఎలాంటి కారణం లేకుండా, చట్టవ్యతిరేకంగా నిషేధం విధించినప్పటికీ, ఆ తరువాత ఆ ప్రభుత్వాలే బేషరతుగా ఆ నిషేధాన్ని తొలగించాయి కూడా. అలాగే ఆర్ ఎస్ ఎస్ రహస్య సంస్థ కూడా కాదు. దానికి సంబంధించిన దైనందిన కార్యకలాపాలు(శాఖ) బహిరంగంగా, బాహాటంగా జరుగుతాయి. ఎవరైనా వాటిలో పాల్గొనవచ్చును. దేశమంతటా ఈ శాఖలు జరుగుతున్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది కూడా. ఈ సంస్థ తత్వం, కార్యశైలి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి, ఉత్సుకత ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

కొన్నేళ్లక్రితం చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం భారత్ కు వచ్చింది. వాళ్ళు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలను కలవాలనుకున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఢిల్లీలోనే ఉన్నాను. వివిధ విషయాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ సమావేశం గురించి ఎవరికి తెలియనివ్వవద్దని వాళ్ళు కోరారు. దానికి కారణం చైనాలో తమ అధికారులకు సమాధానం చెప్పుకోవలసి వస్తుందనే భయం కాదు. ఇక్కడ ఉన్న `వామపక్ష – ఉదారవాద’ మీడియా, మేధావులు ఎలా ప్రతిస్పందిస్తారోననే సందేహం.

సంఘ కార్యకలాపాలను చూసేందుకు, పరిశీలించేందుకు ఎవరైనా ఇక్కడికి రావచ్చును. అసలు ఆర్ ఎస్ ఎస్ ను గుడ్డిగా వ్యతిరేకించే ఈ సంకుచిత, వామపక్ష మీడియా, మేధావులు ఎప్పుడు సంస్థ కార్యకర్తలను కలుసుకునేందుకుగానీ, సంస్థ కార్యకలాపాల గురించి తెలుసుకునేందుకుగానీ ప్రయత్నించనేలేదు. ఇటీవల జర్మనీ రాయబారి ఆ పని చేశారు. ఆయన చూపిన చొరవ, విశాల దృక్పధం ఆహ్వానించదగినవి.

(రచయిత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  సహ సర్ కార్యవాహ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here