Home Telugu Articles ఉగ్రరూపం.. ఎవరి సూత్రం?

ఉగ్రరూపం.. ఎవరి సూత్రం?

0
SHARE

పరస్పరం సంబంధం లేనట్టు కనిపిస్తున్న బీభత్స ఘటనలు ‘అంతర్జాతీయ ఉగ్రవాదం’లో భాగమన్నది వర్తమాన వాస్తవం. ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ తండాలు సైనిక స్థావరంపై దాడిచేసి దాదాపు నూట నలబయి మంది సైనికులను హత్య చేయడం సరికొత్త దుర్ఘటన! ఈ దుర్ఘటన గురించి అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న తరుణంలోనే మరో పైశాచిక కాండ జరిగింది. మన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ప్రాంతంలో చైనా తొత్తులైన మావోయిస్టులు సోమవారం జరిపిన దాడులకు అనేకమంది కేంద్ర రిజర్వు పోలీసులు బలయిపోయారు! కశ్మీర్‌లో రాళ్లు రువ్వుతున్న జిహాదీలు విశ్రమించడం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలది ఇస్లామేతర మత విధ్వంస లక్ష్యం. మావోయిస్టులు ప్రజాస్వామ్య విధ్వంసక నియంతృత్వ వ్యవస్థ నిర్మాణం కోసం బీభత్స కృత్యాలను కొనసాగిస్తున్నారు. కానీ చైనా, పాకిస్తాన్‌లు ఉమ్మడిగా ఈ రెండు రకాల ఉగ్రవాదులను నడిపిస్తున్నాయి. ఆఫ్ఘానిస్తాన్‌లోని మఝార్ ఏ షరీఫ్ సమీపంలోని సైనిక స్థావరంపై తాలిబన్ జిహాదీ తండాలు శనివారం దాడి చేయడం ఇలా విస్తరిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద వ్యూహంలో భాగం. సిరియాలో ‘ఇస్లామీ మతరాజ్యం’ హంతకుల బీభత్స కలాపాలు ‘మందకొడి’గా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాలిబన్ మూకలు తమ పైశాచిక కాండను ఉద్ధృతం చేయడం అంతర్జాతీయ ఉగ్రవాద వ్యూహంలో భాగం. ఈ ఉగ్రవాద వ్యూహాన్ని పాకిస్తాన్ చైనా దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు జరుపుతుండడం పెద్దగా ప్రచారం కాని అంతర్జాతీయ ‘రహస్యం! ఈ వ్యూహానికి సౌదీ అరేబియా నుంచి ఇతర పశ్చిమ ఆసియా దేశాల నుంచి భారీఎత్తున నిధులు అందుతున్నాయి! వేరువేరు దేశాలలో జరిగిపోతున్న బీభత్స ఘటనల స్వరూప స్వభావాలు భిన్నంగా కన్పిస్తున్నప్పటికీ వివిధ ఉగ్రవాద ముఠాలు అనుసంధానమై ఉన్నాయి. ఈ అనుసంధానకర్త పాకిస్తాన్! ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం-ఐసిస్- ముఠావారు, తాలిబన్-అల్‌ఖాయిదా తండాలు తమతమ ప్రాబల్య మండలాలను ఏర్పాటు చేసుకున్నాయి! ఇరాక్‌కు తూర్పుగా ఆగ్నేయంగా ఉన్న ప్రాంతాలలో ‘తాలిబన్’ తండాలు మళ్లీ పెద్దఎత్తున పైశాచిక కాండకు పూనుకొనడం ఈ ‘ప్రాబల్య మండలాల’కు మరో నిదర్శనం. ఇరాక్ పడమటి, వాయువ్య సీమలలో ‘ఐసిస్’ జిహాదీలు చేరగలుగుతున్నారు. ‘బోకోహరామ్’ వంటి మానవపిశాచ ముఠాలు ఆఫ్రికాలో విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. ఇజ్రాయిల్ పొరుగు దేశాలలో హిజ్‌బొల్లా, ఫతా వంటి ముఠాలు బీభత్స వ్యూహాలను అమలు జరుపుతున్నాయి. మనదేశంలో లష్కర్ ఏ తయ్యబా, సిమి, జమాత్ ఉద్‌దావా, ఇండియన్ ముజాహిదీన్ వంటి ‘జిహాదీ’ సంస్థలు పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న తోడేళ్లు…

వివిధ ‘జిహాదీ’ ముఠాలను మాత్రమే కాదు మావోయిస్టులను, ఈశాన్య ప్రాంతంలోని విద్రోహ బృందాలను ‘అనుసంధానం’ చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ఐఎస్‌ఐ- ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ-!! గతంలో శ్రీలంకలోని ‘తమిళ ఈలం లిబరేషన్ టైగర్లను, మయన్మార్‌లోని ‘రోహింగియా’ తీవ్రవాదులను, నేపాల్‌లోని మావోయిస్టు సాయుధులను సైతం ‘ఐఎస్‌ఐ’ పరస్పరం సన్నిహితం చేయగలిగిందన్నది జరిగిన ప్రచారం. ఇప్పుడు ‘తమిళ టైగర్లు’ దాదాపు అంతరించారు. మయన్మార్ ‘రోహింగ్యాల’ బీభత్సకాండ ఫలితంగా సామాన్య రోహింగ్యాలకు మయన్మార్ ప్రజలకు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. తరిమివేతకు గురైన వేలాది ‘రోహింగ్యాలు’ మనదేశంలో తలదాచుకుంటున్నారు. కానీ ఈ రోహింగ్యాలలో సైతం ‘జిహాదీ’లను తయారు చేయడానికై పాకిస్తాన్ ‘ఐఎస్‌ఐ’ ప్రయత్నిస్తోందన్న అనుమానం అతార్కికం కాదు. ఈ పాకిస్తానీ వ్యూహాన్ని చైనా సమర్థించడం మనదేశాన్ని అంతర్గతంగాను, అంతర్జాతీయ సమాజంలోను బలహీనపరచడంలో భాగం. పాకిస్తాన్, చైనాల మధ్య కుదిరిన ఈ అనైతిక అంగీకారం కారణంగానే చైనాలోని ‘సింగ్‌యాంగ్’ ప్రాంతంలో ‘జిహాదీ’ ఉగ్రవాదం అడుగంటిపోయింది! ‘‘చైనాలో ‘జిహాదీ’లు హత్యాకాండ జరుపరాదు’’, ఇందుకు ప్రతిఫలం పాకిస్తాన్ జరుపుతున్న భారత వ్యతిరేక బీభత్సకాండకు చైనా మద్దతు.. ఐక్యరాజ్య సమితిలో సైతం చైనా బాహాటంగా పాకిస్తాన్ బీభత్సకారులను బలపరుస్తోంది. మరోవైపు యెమెన్ ప్రధాన కేంద్రంగా ‘తాలిబన్’ మూకలు దక్షిణంగా విస్తరించాయి. సోమాలియా దేశపు సముద్ర తీరంలో స్థావరాలను ఏర్పరచుకొని ఉన్న ఓడ దొంగలతో తాలిబన్ తండాలకు సన్నిహిత సంబంధాలు ఏర్పడడం కూడ ‘పాకిస్తాన్ చైనా’ల ఉమ్మడి వ్యూహంలో భాగం. పాకిస్తాన్ ‘ఐఎస్‌ఐ’ వారి శిక్షణలో తాలిబన్‌లు ఓడ దొంగలలో చేరారు. ఓడ దొంగలు తాలిబన్‌లలో చేరిపోయారు. ఫలితంగా మనదేశపు నైరుతి, పశ్చిమ సముద్ర తీరాలకు చేరువలో ఓడ దొంగల రూపంలోని తాలిబన్ల సంఖ్య పెరిగింది!

ఓడ దొంగలను అరికట్టే సాకుతో చైనా నౌకాదళాలు అరేబియన్ సముద్రంలో తిష్టవేశాయి. మన దేశాన్ని పడమటి వైపు నుంచి దిగ్బంధించడం చైనా, పాకిస్తాన్‌ల ఉమ్మడి లక్ష్యం. తోడేళ్ల వంటి తాలిబన్లను ఓడ దొంగలను ఒకవైపున ఉసిగొల్పడం, మరోవైపున కుందేళ్లవలె పారిపోవడం ఈ ఉమ్మడి వ్యూహం! ఇటీవల మన వాణిజ్య నౌకలను చుట్టుముట్టిన ఓడ దొంగలను తిప్పికొట్టడంలో సోమాలియా ప్రభుత్వ దళాలు మనకు సహకరించాయి. కానీ చైనా నౌకాదళం మాత్రం మన సముద్ర భద్రతా దళాలతో కలసి ఓడ దొంగలకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా లేదు. మన పడవలను, నౌకలను ఓడదొంగలతో పోరాడుతున్న తమ దళంలో చేరనివ్వలేదు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమరం జరుగకుండా చైనా అడ్డుపడుతోంది! ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు మళ్లీ తెగబడి హత్యాకాండ జరుపుతుండడానికి ఇదీ నేపథ్యం! రష్యా సైతం చైనాతో జట్టుకట్టడం మన దేశానికి వ్యతిరేకంగా సంభవించిన అంతర్జాతీయ పరిణామం. ఫలితంగా పాకిస్తాన్, రష్యా ప్రభుత్వాలు సైతం చరిత్రలో మొదటిసారిగా పరస్పరం సన్నిహితమవుతున్నాయి!! సిరియాలో ప్రభుత్వ దళాలకు వ్యతిరేకంగా అమెరికా ఐరోపా దేశాలు ఇటీవల దాడులను ఆరంభించాయి. సిరియా నియంతృత్వ ప్రభుత్వాన్ని తొలగించడానికి దశాబ్దికి పైగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ ద్వైపాక్షిక అంతర్యుద్ధం ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం’ జిహాదీ ముఠా ప్రవేశంతో త్రైపాక్షికంగా మారింది. ఇప్పుడు ఉద్యమకారుల పక్షాన అమెరికా, ఐరోపా దేశాలు.. నియంతృత్వ ప్రభుత్వం తరపున రష్యా, చైనాలు ‘సిరియా’లో ఆధిపత్య సంఘర్షణ సాగిస్తున్నాయి! అందువల్ల ‘ఇస్లాం మతరాజ్యం’-ఐసిస్- కొంత విశ్రాంతి తీసుకొంటోంది!! బీభత్సకాండకు కార్యక్షేత్రం మళ్లీ ఆఫ్ఘానిస్తాన్ కావడం సిరియా పరిణామాలలో ప్రతిక్రియ.

అమెరికా నాయకత్వంలోని ‘నాటో’ సైనికదళాలు వైదొలగిన తరువాత ఆఫ్ఘానిస్తాన్ మన దేశపు ‘ఉనికి’ని చైనా పాకిస్తాన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందువల్లనే మన దౌత్యకార్యాలయాల మీద, మనదేశం ఆఫ్ఘానిస్తాన్‌లో అమలు జరుపుతున్న ప్రగతి పథకాల మీద తాలిబన్‌లు దాడులు జరుపుతున్నారు. ఇదంతా దేనికి సంకేతం?? తాలిబన్ చర్యలను ఆఫ్ఘానీ ప్రభుత్వం ప్రతిఘటించలేకపోతోంది. సందుచూసుకొని ఆఫ్ఘానిస్తాన్‌లోకి భారీఎత్తున తమ దళాలను పంపడం చైనా వ్యూహం.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here