Home News విప్లవ రచయితలమంటూ విధ్వంసం వైపు నడిపిస్తున్న ‘విరసం’

విప్లవ రచయితలమంటూ విధ్వంసం వైపు నడిపిస్తున్న ‘విరసం’

0
SHARE

మార్క్సిజం – లెనినిజం, మావో ఆలోచనా విధానంతోబాటు దండకారణ్యంలోని గెరిల్లాదళాల బరువు మోస్తున్న విప్లవ రచయితల సంఘం (విరసం) 26వ మహాసభలు మహబూబ్‌నగర్‌లో ముగిశాయి. రవిగాంచని చోట కవి గాంచును.. అని చెప్పుకుంటాం. విప్లవకవులు రవి గాంచిన చోటును సైతం కాంచకపోవడం విడ్డూరం. మార్క్సిజం-లెనినిజం, మావో ఆలోచన విధానం తమ ప్రాపంచిక దృక్పథంగా ప్రకటించుకుని ఆ పరిధిలోనే విరసం పనిచేస్తోంది. ఈ ప్రాపంచిక విధానం ప్రపంచంలో ఎక్కడా పరిఢవిల్లుతున్న దాఖలాలు లేవు. ఎంతోకొంత ఆ ఆలోచనా విధానం కనిపించిన చోట కూడా అది ఆరిపోయింది, అంతమైంది. ఇది విరసం కవులు, తదితరులందరి ఎరుకలో ఉన్న అంశమే అయినా తమ పంథాకే కట్టుబడి ఉంటామని, ఆ దృక్పథానికే వెన్నుదన్నుగా నిలుస్తామని మహాసభలు నిర్వహించి లోకానికి చెప్పడమంటే రవిగాంచిన చోటును కూడా విప్లవకవి చూడకపోవడమే, చూడ్డానికి నిరాకరించడమే అవుతుంది కదా? మరి ఇది ఆహ్వానించదగ్గ అంశమా?

గత డిసెంబరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. తెలుగుభాష, సాహిత్యం, వివిధ ప్రక్రియలపై చర్చలు జరిగాయి. ఎన్నో పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ప్రజల్లో భాష, సాహిత్యం పట్ల కొంత చైతన్యం కనిపించింది. వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగువారు తమ భాష – సాహిత్యం పట్ల కించిత్‌గర్వం వ్యక్తం చేశారు. అలాంటి సభల్ని బహిష్కరిస్తున్నామని కొందరు విరసం నాయకులు ప్రకటించారు. తమ నిరసన, ప్రత్యామ్నాయ గొంతుకను వినిపించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు తమ వేదికపై తమదైన పద్ధతిలో ప్రత్యామ్నాయ సాహిత్య ప్రాశస్త్యాన్ని ప్రజలకు తెలిపేందుకు ప్రయత్నం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు బ్రాహ్మణవాదంతో జరిగాయని విరుచుకుపడ్డారు. వౌలికంగా తమ ప్రాపంచిక దృక్పథానికి కాలంచెల్లిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్ని సభలు-సమావేశాలు నిర్వహిస్తే ఏమిటి ప్రయోజనం?

చైతన్యవంతులైన కవులు, రచయితలు, కళాకారులు ప్రజల్ని ముందుకు నడిపేందుకు ప్రయత్నించడం వారి ప్రాథమిక కర్తవ్యం. మానవాభివృద్ధి, సంక్షేమం ఆగామి స్థితిగతులు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రజలకు వివరించాలి. ప్రజల్ని అటువైపుకదిలేలా పురికొల్పాలి. కాని విరసం కవులు, రచయితలు మాత్రం దండకారణ్యంవైపు మైదాన ప్రాంత ప్రజల్ని నడిపించేందుకు నడుంకట్టారు. ఇది ఏరకంగా ప్రోత్సహించదగ్గది? మావోయిస్టుల ఆనుబంధ సంస్థగా, వారి ఆలోచనలను ప్రచారం చేసే వేదికగా, వారి కార్యకలాపాలకు అక్షర రూపం ఇచ్చి చరిత్రలో నిలిచిపోయేలా పడరాని పాట్లు పడితే అది విశాల ప్రజానీకానికి ఏ విధంగా ఉపయుక్తంగా ఉంటుంది? ప్రపంచంలో ఎక్కడా ఉనికిలో లేని మార్క్సిజం-లెనినిజం, మావో ఆలోచనా విధానాన్ని బలంగా ప్రచారం చేస్తూ అది మినహా ప్రజలకు మరోమార్గం లేదని నిరంతర ప్రచారవాహినిగా పనిచేయడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటి?

ఏ సమాజం నుంచి వచ్చారో ఆ సమాజాన్ని అభివృద్ధి పరిచేందుకు కవులు-రచయితలు పాటుపడతారని ఎవరైనా ఆశిస్తారు. అందుకు భిన్నంగా మార్క్సిజం – లెనినిజం, మావో ఆలోచనా విధానం కోసం పాటుపడటం వల్ల, ప్రత్యామ్నాయం పేర కాలంచెల్లిన భావజాలానికి పట్టం గడతామని ఊరేగడంవల్ల ప్రజలకు నష్టం-కష్టం తప్ప ఏమాత్రం మేలు జరగడం లేదు. గత 47 సంవత్సరాల విరసం పోకడను పరిశీలిస్తే.. ఒక పార్టీకి అనుబంధ సంస్థగా, ప్రచార వేదికగా పనిచేసిందే తప్ప ప్రజలకేం ఒరిగింది లేదు.

తుపాకీపట్ల మమకారం, గెరిల్లాలపట్ల మనసు పారేసుకోవడం, మావోయిజం పట్ల ఆరాధనాభావం కలిగించే ప్రయత్నమే తప్ప కాలానుగుణమైన గుణాత్మకమైన ‘మార్పు’ ప్రజల్ని నడిపించింది లేదు. నాలుగు దశాబ్దాల క్రితపు జీవితం, ఇప్పటి జీవితం ఎలా ఉందో వారు అంచనాకట్టినట్లు లేదు. 1970 సంవత్సరం నాటికి తమ భావజాలం 2018 సంవత్సరంలోనూ అంతే సాంద్రతతో, ప్రభావశీలంగా పనిచేస్తుందని, పనిచేయాలని భావించి ఆ భావాలను విత్తడమంటే విరసం నాయకులు ఎలాంటి అంధకారంలో మగ్గుతున్నారో అర్థమవుతోంది.

నక్సల్‌బరి 50 వసంతాల సందర్భంగా జాతీయ సదస్సు నిర్వహించి నక్సల్‌బరి ప్రాసంగికత ఇంకా సజీవంగా ఉందని పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడమంటే కాలంతోపాటు కదులుతున్నామా? లేదా కాలస్వభావం, కాలమాన పరిస్థితులు తెలియనితనమా ఇది? విరసం నాయకులు తమనితాము ప్రశ్నించుకోవలసిన సమయమిది. కాళోజీ, శ్రీశ్రీలాంటి కవులను ఆదర్శంగా తీసుకునే విరసం వారి ‘జీవనాడి’ని మాత్రం కాదని మావోయిజానికి అంకితమైతే అదెలా వారిని గౌరవించినట్టవుతుంది?

తెలుగు ప్రజలు ముఖ్యం తప్ప పరాయి దేశాల సిద్ధాంతాలు కాదు. కానీ విరసం నాయకులకు ఆ సిద్ధాంతాలపైనే మోజు ఎక్కువ. శ్రీశ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా, శ్రీకాకుళం గిరిజన పోరాటం నేపథ్యంలో కలం-గళం ఎత్తిన కవులు-రచయితలు విరసంగా ఏర్పడి తెలుగు నేలను జేగీయమానం చేయాల్సిందిపోయి అడుగడుగునా రక్తం చిందేందుకు తోడ్పడితే ఎలా?

ఎంతసేపు ఆయుధం.. సాయుధం.. సంఘర్షణ ఇదే జీవితమంటే ఎలా? ఈ ఊబిలో కూరుకుపోయి ప్రపంచ నడకను చూడనీయకపోతే, ప్రత్యామ్నాయ మార్గం పేరిట నడక సాగిస్తే ఎక్కడ తేలాం?.. అన్న ప్రశ్న వేసుకోవాలికదా? ఇంకా అక్షరజ్ఞానం దగ్గరే మన ప్రజలుంటే అవతర సాంకేతిక పరిజ్ఞాన విశ్వరూపం వెలుగులు పంచుకుని బతుకును పండించుకుంటూ ఉంటే, మరింత ముందుకు దూసుకువెళ్లేందుకు సమాయత్తమవుతుంటే అంకెలు, అక్షరాలు రాని గోండులను, ఇతర తెగలను సాయుధం చేస్తున్నాం.. ప్రజల్ని సాయుధం చేసేవాడే నిజమైన కవి అని కాలంచెల్లిన పదాల అల్లికతో కదం తొక్కితే ఎలా?

మావోయిస్టుల రాజ్యాధికారం కోసం కవులు, రచయితలు తమ అంతరాత్మను అణచుకోవద్దు కదా? గోర్కీ, టాల్‌స్టాయ్, సోల్జినిత్సిన్‌గాని, స్పానిష్ అంతర్యుద్ధంలో నిలిచిన కళాకారులు, కవులుగాని ప్రధానంగా ప్రజల చైతన్యాన్ని కాంక్షించారు. ప్రజల సాధికారతను ఆశించారు. అటువైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ జీవామృతం ముఖ్యం తప్ప మావోయిస్టుల రాజ్యాధికారం కాదు. ఆ రాజ్యాధికారం దక్కే అవకాశాలు మృగ్యమని స్పష్టంగా కనిపిస్తున్నా, తెలుస్తున్నా వారికోసం ప్రజల్ని కదలించడం దగా చేయడమే! మోసం చేయడమే! తమ విశ్వాసాల కోసం, పంతంకోసం ప్రజల్ని బలిపీఠం ఎక్కించరాదుకదా? కానీ విరసం నాయకులు మాత్రం ఆ పనిలో నిమగ్నం కావడం శోచనీయం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న జీవన స్థితిగతులేమిటి? తాము ప్రబోధిస్తున్నదేమిటి? ప్రచురిస్తున్న సాహిత్యమేమిటి? అన్న వౌలిక ప్రశ్న వారు వేసుకుంటారన్న నమ్మకం లేకపోయినా వారు వేసుకోవాలని, గెరిల్లాల జీవితంగూర్చిగాక గల్లీల్లోని ప్రజల సాధికారత కోసం వారి కవనం సాగాలని ఆశిద్దాం! రచయితలారా మీరెటువైపు? అన్న ప్రశ్నతో 47 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న విరసం ఇప్పుడు తనను తాను విధ్వంసంవైపా? లేక జ్ఞాన-విజ్ఞానం వైపా?.. అని ప్రశ్నించుకుంటుందని భావిద్దాం!

-వుప్పల నరసింహం 9985781799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here