Home Telugu Articles విదేశీ పరతంత్రం నుంచి స్వదేశీ పరతంత్రంలో

విదేశీ పరతంత్రం నుంచి స్వదేశీ పరతంత్రంలో

0
SHARE

దేశాన్ని కోసి, ముస్లింల రాజ్యం ముస్లింలకు పంచి ఇచ్చిన తరువాత కూడా మిగిలేది హిందూ రాజ్యం కాదట! హిందూ మెజారిటీ దేశంలో కూడా ముస్లింలను, క్రైస్తవులను నెత్తిన ఎక్కించుకునే తిరగాలట! ఆ మైనారిటీలకు ఎక్కడా మనస్తాపం లేక అభద్రతా భావం కలగకుండా హిందువులు కళ్లలో వొత్తులు వేసుకుని కడు జాగ్రత్తగా మెలగాలట. మైనారిటీలను పువ్వుల్లో పెట్టి పూజించాలట. ప్రత్యేక హక్కులు, రాయితీలు మైనారిటీలకు సమకూర్చి, తాము చేతులు కట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని, అణగిమణిగి ఉండటమే మెజారిటీ ప్రజల ప్రారబ్దమట.

స్వాతంత్య్రోద్యమానికి తండ్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, తాత మహాత్మాగాంధీ.

ఝాన్సీరాణీ, సావర్కర్‌, అరవిందఘోష్‌, సుభాస్‌ చంద్రబోస్‌, సర్దార్‌ పటేల్‌, భగత్‌సింగ్‌, అల్లూరి, శ్రద్ధానంద లాంటి వాళ్లు పెద్దగా పట్టించుకోనవసరం లేని చిల్లర శాల్తీలు అన్నట్లు.

నెహ్రూ హయాంలో దేశ చరిత్రకు ‘సెక్యులర్‌ వెల్ల’ను కమ్యూనిస్టు రాతగాళ్ల చేత ఎంతదట్టంగా వేయించినా, నిజానికి మన ప్రాచీన పుణ్యభూమికి, దానిలో శతాబ్దాల పర్యంతం సాగిన భీకర, అద్భుత జాతీయోద్యమానికి సనాతన ధర్మమే ఊపిరి.

ఏడు శతాబ్దాలకు పైగా సాగిన ఇస్లామిక దండయాత్రలను, దురాక్రమణలను వీరోచితంగా ప్రతిఘటించి, చివరికి విదేశీయ దుష్టశక్తులను జయించింది సనాతన ధర్మం; దాని నుంచి స్ఫూర్తి పొందిన హిందూ పరాక్రమం.

నయవంచనలు, కుట్రలు, నమ్మకద్రోహాలతో దేశాన్ని దుర్మార్గంగా ఆక్రమించిన తెల్లరాకాసుల మీద జాతీయ స్థాయిలో మొట్టమొదటి గట్టి ప్రతిఘటన అయిన 1857 పోరాటాన్ని నడిపించింది ప్రధానంగా హిందూ వీరులు. ముఖ్య నాయకులందరిలోనూ సమానంగా ఉన్నది సనాతన ధర్మం పట్ల ప్రగాఢ నిబద్ధత. ఆ ప్రథమ స్వాతంత్య్ర పరాక్రమానికి ప్రజలను పురికొల్పినది క్రైస్తవ మిషనరీల దౌర్జనపు మతమార్పిళ్లు; ఆవుకొవ్వు, పందికొవ్వు పూసిన తూటాలను భారత సైనికులు నోట పెట్టుకునేట్లు చేయటం లాంటి తెల్లవాళ్ల ఆగడాలు.

1857 తర్వాత మళ్లీ జాతీయ స్థాయిలో దానికంటే సుదీర్ఘంగా, విస్తృతంగా నడచిన ప్రజా ఉద్యమం స్వామి దయానంద సరస్వతి ప్రారంభించిన గో-రక్షణ ఉద్యమం. 1880 నుంచి 1894 వరకు పధ్నాలుగేళ్ల పాటు గొప్పగా సాగి, బ్రిటిషు పాలకులకు చెమటలు పట్టించిన ఆ చారిత్రాత్మక పోరాటానికి ప్రేరణ సనాతన వైదికధర్మం. పోరాడిన వారు ఆ ధర్మానికి అంకితమైన హిందువులు.

మిషనరీ స్కూళ్లు, కాలేజీలు తెరిపించి, ఇంగ్లీషు చదువులతో భారతీయ చరిత్రను, సంస్కృతిని, హిందూ మతాన్ని, నీచంగా చిత్రించి; ఇంగ్లీషు విద్యావంతుల బుర్రలను ఎంత చెడగొట్టినా, విశాల ప్రజాబహుళ్యంలో హిందూ మతం మీద భక్తి, ధర్మం మీద విశ్వాసం ఎంతమాత్రం సడలలేదు. సామాన్య జనంలో తెల్లదయ్యాల మీద నానాటికీ పెరుగుతున్న ఆగ్రహాన్ని తట్టుకుని, ప్రజలకు భ్రమలు కల్పించేందుకు బ్రిటిషు పాలకులు పనిగట్టుకొని తమ తైనాతీల చేత 1885లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెసును పెట్టించారు. ఇంగ్లీషువారి బ్రెయిన్‌ వాషింగ్‌తో కొంతమంది మేధావులు ‘తెల్ల’బుట్టలో పడ్డా, భారత ప్రజలు ముఖ్యంగా హిందువులు బ్రిటిషు దుష్టపాలన మీద కుతకుతలాడుతూనే ఉన్నారు. వారిలో చిరకాలంగా రగులుతున్న ధర్మాగ్రహం ఒక్క పెట్టున భళ్లుమన్నది 1905లో. గవర్నర్‌ జనరల్‌ కర్జన్‌ అడ్డగోలుగా చేసిన బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా.

అమెరికా విశ్వవేదికపై నిలిచి హిందూ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన వివేకానందుడి అద్భుత ప్రేరణతో, సావర్కర్‌, అరవిందుల విప్లవ పోరాటాలతో బంకించంద్రుడి ‘వందేమాతర’ ప్రణవనాదంలో, రవీంద్రుడి జాతీయ గాన స్రవంతిలో ఉత్తేజితులై – బ్రిటిషు సామ్రాజ్య బంధనాల నుంచి భారతమాతను విముక్తి చేసేందుకు ఉరకలేస్తున్న హైందవ జాతీయ శక్తులను నిలువరించేందుకు తెల్లవాళ్లు వేసిన పాపిష్టి ఎత్తు బెంగాల్‌ విభజన. హిందూ జాతీయ చైతన్యానికి ప్రధాన కేంద్రమైన బెంగాల్‌ను అడ్డగోలుగా చీల్చి, ముస్లింలకు మెజారిటీ ఉండేలా కొన్ని ప్రాంతాలను కృత్రిమంగా వేరు చేసేందుకు బ్రిటిషు సామ్రాజ్యవాదులు, ఇస్లామిక సామ్రాజ్యవాద అవశేష శక్తులు కుమ్మక్కయి పన్నిన కుటిల వ్యూహాన్ని హిందూ జాతీయ వాదులు జయప్రదంగా వమ్ము చేశారు. వంగ దేశాన్ని దుర్మార్గంగా చెడగొట్టిన వారు తోక ముడిచి దానిని తిరిగి ఏకం చేయక తప్పని పరిస్థితిని దేశభక్తులు తెచ్చిపెట్టారు.

1905లో బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా మొదలైన పోరు క్రమేణా స్వదేశీ ఉద్యమంగా ఊపు అందుకుని దేశమంతటికీ పాకింది. మహారాష్ట్ర, పంజాబ్‌ల నుంచి, ఆంధ్ర, కళింగ తీరాల వరకూ ‘వందేమాతర’ మంత్రం; ‘స్వదేశీ’, ‘స్వరాజ్య’ నాదం పోలీసుల లాఠీల దెబ్బలు తింటున్న ప్రతి భారతీయుడి పెదవుల మీద దిక్కులదిరేలా నినదించాయి. ముస్లిం సోదరులూ ‘వందేమాతరం’ అంటూ హిందువులతో గొంతు కలిపిన అపురూప ఘట్టమది.

బెంగాల్‌ విభజన విఫల ప్రయోగంలో తెల్లవాళ్లు హైందవ జాతీయ విజృంభణకు ఎదురు నిలవటం తమ వల్ల కాదని గ్రహించారు. హిందూ-ముస్లిం సఖ్యతను చెడగొట్టి, జాతీయోద్యమాన్ని నీరుకార్చేందుకు ‘విభజించి పాలించే’ వక్ర నీతికి సానపెట్టారు. హైందవ పరాక్రమాన్ని నిర్వీర్యం చేసి హిందువుల చేతులు కట్టేసి, మహమ్మదీయులను వారిపైకి ఉసికొలిపి, బ్రిటిషు సామ్రాజ్యానికి ఎదురులేకుండా చేసుకోవటానికి మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. అణచివేత వల్ల కాని పనిని నయవంచనతో ఎలా సాధించాలా అని తెల్లవాళ్లు పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవలసిన అవసరం లేకపోయింది. కాగల కార్యాలు సాధించి పెట్టటానికి సరైన మనిషి వారికి సులభంగానే దొరికాడు.

ఇంగ్లీషువాళ్ల ఉచ్చులో దూరి, తెలిసో తెలియకో, అసంకల్పితంగానో, బుద్ధి పూర్వకంగానో బ్రిటిషు పాలకుల మాయాజూదంలో నాటకమై పాచికగా జీవితాంతం ఉపయోగపడ్డవాడు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధి!

మొదటి ప్రపంచ యుద్ధకాలంలో దక్షిణాఫ్రికా నుంచి రాచమర్యాదలతో బొంబాయి రేవులో అడుగుపెట్టింది మొదలుకొని, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత భారతమాతకు రంపపుకోత వరకూ గాంధీ మహత్ముడు చేసిన వరస తప్పుల వల్ల జాతీయోద్యమం చిందరవందర అయింది. గాంధీగారు తాగించిన మేకపాలతో హిందువుల క్షాత్రం సన్నగిల్లింది. ఆయన ఇచ్చిన వత్తాసుతో, కురిపించిన ధృతరాష్ట్ర ప్రేమతో ముస్లిం మతోన్మాదం పెట్రేగింది. మహాత్ముడు లొంగేకొద్దీ, బుజ్జగించే కొద్దీ, హిందువుల మెడలు బలవంతంగా వంచే కొద్దీ మహమ్మదీయుల పంతం నానాటికీ పెరిగి చివరికి దేశాన్ని ముక్కలు చేసింది.

ఐదు శతాబ్దాలకు పైగా ఇస్లామిక దండయాత్రలూ, దురాక్రమణలతోనూ; బ్రిటిషు పాలనలో తరాల తరబడి ముస్లిం మతోన్మాదంతోను పోరాడి ఎన్నో బాధలు పడి, భయానక కష్టనష్టాలకు లోనై, రక్తపుటేరుల నడుమ ఎట్టకేలకు స్వాతంత్య్రమనబడేది సాధించాక మనం ఏమి చేసి ఉండవలసింది? అన్ని శతాబ్దాల పర్యంతం అధికార మదంతో, దౌర్జన్యంతో విరగపడి హిందూదేశంలో హిందూమతాన్ని రూపుమాపేందుకు శాయశక్తులా ప్రయత్నించిన ఇస్లామిక మత ప్రకోపానికీ; తెల్లదొరల వత్తాసులో దేశాన్ని క్రైస్తవీకరించడానికి విశ్వ ప్రయత్నం చేసిన క్రైస్తవ మతశక్తులకూ ముకుతాడు వేసి; వెనుకటి ఆగడాలు, దురాగతాలు మళ్లీ జరక్కుండా గట్టి జాగ్రత్తలు తీసుకోవద్దా?

హిందువులు, ముస్లింలు ఎంతమాత్రం కలిసి ఉండలేని విరోధి జాతులు అన్న తప్పుడు సిద్ధాంతానికి విధిలేక తలవంచి; ముస్లిం మెజారిటీ ప్రాంతాలను ముస్లింలకు పంచి ఇచ్చి వేరుపడిన తరువాత, మిగిలింది హిందువులు మెజారిటీ అయిన హిందూ దేశమే కదా? హిందువులకు మిగిలిన ఆఖండిత భారతదేశంలోనైనా హిందువులు తలఎత్తుకొని తిరగవద్దా? శతాబ్దాలుగా తురుష్క, మ్లేచ్ఛ దురాక్రమణలతో నానా అగచాట్లు అవమానాలు పడి, ఎట్టకేలకు విముక్తి పొందిన తరవాతైనా విదేశీయ ఇస్లామిక, క్రైస్తవ మతాల పెత్తనాలు, తలపోట్లు లేకుండా తమ దేశంలో తమ మతానికి, తమ ధర్మానికి సముచిత గౌరవ స్థానం కల్పించి, నిర్నిబంధంగా, సగర్వంగా బతికే అవకాశం హిందువులకు ఉండవద్దా? నూటికి 80 మంది హిందువులైన దేశంలో రాజ్యం, రాజ్యాంగం హిందువుల ఆచారాలు, విశ్వాసాలు, జీవన విధానాలకు అనుగుణంగా ఉండకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? తరతరాలు పోరాడి, అష్టకష్టాలు పడి సంపాదించిన స్వాతంత్య్రం సార్థకం ఎలా అవుతుంది?

మెడమీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే జవాబు చెబతాడు. కాని మనవాళ్ళు అనుకున్న పగవాళ్లు వేరే రకంగా వక్రపు ఆలోచనలు చేశారు.

దేశాన్ని కోసి, ముస్లింల రాజ్యం ముస్లింలకు పంచి ఇచ్చిన తరువాత కూడా మిగిలేది హిందూ రాజ్యం కాదట! హిందూ మెజారిటీ దేశంలో కూడా ముస్లింలను, క్రైస్తవులను నెత్తిన ఎక్కించుకునే తిరగాలట! ఆ మైనారిటీలకు ఎక్కడా మనస్తాపం లేక అభద్రతా భావం కలగకుండా హిందువులు కళ్లలో వొత్తులు వేసుకుని కడు జాగ్రత్తగా మెలగాలట. మైనారిటీలను పువ్వుల్లో పెట్టి పూజించాలట. ప్రత్యేక హక్కులు, రాయితీలు మైనారిటీలకు సమకూర్చి, తాము చేతులు కట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని, అణగిమణిగి ఉండటమే మెజారిటీ ప్రజల ప్రారబ్దమట.

ప్రపంచంలో ఎక్కడా ఎన్నడూ లేని, బుద్ధి ఉన్నవాడెవడూ కలనైనా తలపోయని ఈ వెర్రిమొర్రి సిద్ధాంతాన్ని స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ పండితుడు జంకు లేకుండా ప్రవచించాడు. హిందువులు తమకు ఎంతటి అన్యాయం జరుగుతున్నదో విదేశీ పరతంత్రం నుంచి బయటపడిన వెంటనే మళ్ళీ స్వదేశీ పరతంత్రంలో ఎలా చిక్కుకుంటున్నామో, దాని పర్యవసానమేమిటో గ్రహించే అవకాశం లేకుండా మాయమాటలు చెప్పి, దుర్మార్గపు ఉద్దేశాలకు డాబుసరి పలుకుల మేలి ముసుగువేసి, నడమంత్రపు విధానాలను దేశం మీద రుద్దాడు.

ఆ మేలి ముసుగు పేరు ‘సెక్యులరిజం’.

చక్కగా నడుస్తున్న జాతీయోద్యమాన్ని గాంధీగారు జయప్రదంగా హైజాక్‌ చేశాక.. బానిసత్వంలో మగ్గుతున్న దేశానికి స్వతంత్రం సాధించటం కంటే కూడా హిందూ-ముస్లిం ఐక్యత అతి ముఖ్యమన్న సిద్ధాంతాన్ని ఆయన లేవదీసి, ముస్లింల చేతికి వీటో హక్కు ఇచ్చాక ముస్లిం మతశక్తులది ఆడింది ఆట అయింది. మహమ్మ దీయుల మెజార్జీని ఎలాగైనా పొందడం జాతీయ వాదుల శీలానికి గీటురాయి అయి కూర్చుంది. ఎవరు జాతీయవాదులు, ఎవరు మతోన్మాదులు అన్నది ముస్లిం మతవాదులు నిర్ణయించసాగారు. వారి డిమాండ్లకు తల ఒగ్గి, వారు కోరే హిరణ్యాక్ష వరాలను సమర్థించే వారు నేషనలిస్టులుగా, సమర్థించలేని వారేమో హిందూ కమ్యూనలిస్టులుగా వింగడించబడ్డారు.

ఇక స్వతంత్రం వచ్చాక ఎవరు సెక్యులరిస్టులో, ఎవరు కాదో నిర్ణయించేది మళ్లీ మైనారిటీలే. మైనారిటీల మత ఛాందసత్వాన్ని కిమ్మన మన్నించి, హిందువుల సమంజసమైన కోర్కెలను కూడా మతఛాందసత్వంగా తిట్టిపోసేవారికి ‘సెక్యులరిస్టులు’ అన్న భుజకీర్తులను మైనారిటీలు ప్రసాదించసాగారు. మెజారిటీ మత విశ్వాసాలు, సెంటిమెంట్ల పట్ల జరుగుతున్న దారుణ వివక్షను ప్రశ్నించే వారేమో ‘హిందూ కమ్యూనలిస్టులు’ అన్న చెడ్డపేరు పడ్డారు.

ముస్లిం మెజారిటీ ప్రాంతాలు వేరుపడి పోయాక, భారతదేశంలో మిగిలిపోయిన తమను హిందూ మెజారిటీ అణగదొక్కి, వేటాడే ప్రమాదం ఎంతైనా ఉన్నదని మైనారిటీల పెద్దలు గగ్గోలు పెట్టారు. హిందూ మతోన్మాదం తమను మింగివేయకుండా తమకు ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక హక్కులు కల్పించాలని వారు పట్టుబట్టారు.

‘ఔనౌను. మీరన్నది నిజమే! హిందువుల బారినుంచి మిమ్మల్ని తప్పక కాపాడాల్సిందే. దానికి రాజ్యాంగంలోనే గట్టి బందోస్తులు చేయాల్సిందే’ అన్నాడు దయగల నెహ్రూ పండితుడు.

అంతపనీ చేయించాడు కూడా!

– ఎం.వి.ఆర్‌.శాస్త్రి

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here