Home Telugu Articles వీర సావర్కర్… బహుముఖ వ్యక్తిత్వం

వీర సావర్కర్… బహుముఖ వ్యక్తిత్వం

0
SHARE

– రాంనరేశ్

యాతననుభవించె యావత్తు జీవము
కన్నభూమి కొరకు కడలినీదె
విప్లవాగ్ని యితడె  వీర సావర్కరు
వినుర భారతీయ వీర చరిత!

మన భారత ప్రియతమ మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి గారి మాటల్లో…. “సావర్కర్ అంటే తేజస్సు, సావర్కర్ అంటే త్యాగం, సావర్కర్ అంటే తపస్సు, సావర్కర్ అంటే తత్వం, సావర్కర్  అంటే తర్కం, సావర్కర్ అంటే వికాసం, సావర్కర్ అంటే అగ్ని శిఖ, సావర్కర్ అంటే ఎక్కుపెట్టిన బాణం, సావర్కర్ అంటే ఎత్తిపట్టిన ఖడ్గం, సావర్కర్ అంటే సంఘటనా శక్తి. సావర్కర్ అంటే స్థితప్రజ్ఞుడు మాతృభూమి కోసం విషాన్ని సైతం చాయ్ తాగినంత సులభంగా తీసుకోగలడు. సావర్కర్ ప్రఖర జాతీయవాది. జీవితంలోని క్షణ క్షణం, శరీరంలోని  కణకణం మాతృభూమి కోసం అర్పించే తత్వం కలవాడు . సావర్కర్ ఒక మహా సముద్రం అయితే మనం అందులోని బిందువు మాత్రమే. ఆ జాతీయవాద సంద్రపు కణకణంలో  ఒకే గుణం, ఒకే క్షమత మూర్తిభవించిన వాడు. అటువంటి సావర్కర్ ను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆలోచనా ధోరణిని విశ్లేషించాల్సి అవసరం ఉంది. ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గుండెకి చేర్చాలి”

ఇలా వాజపేయి గారి నుండి మొదలుకొని నాడు ఇంగ్లాండు నడిబొడ్డున కర్జన్ వైలీని మట్టుబెట్టిన విప్లవవీరుడు మదన్ లాల్ ధీంగ్రా వరకు ఎందరికో ఆదర్శం స్వాతంత్ర్య వీర సావర్కర్. ఆంగ్ల పోలీసుల కన్నుగప్పి ఓడ నుండి సముద్రంలో దూకి దాన్ని ఈదిన సాహసి సావర్కర్. కవిగా రచయితగా సంఘసంస్కర్తగా విప్లవ యోధుడుగా, త్యాగశీలిగా తన జీవితాన్ని భరతమాత పాదాల చెంత అర్పించిన ప్రేరణ దాత సావర్కర్.

ఈ దేశం నుండి  ఆంగ్లేయులను తన్ని తరిమి వేసే దాకా తాను విశ్రమించ బోనని దాని కోసం తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, బంధువులను, ఆఖరికి ప్రాణాలను సైతం త్యాగం చేస్తానని అర్ధరాత్రి పూట దుర్గామాత పాదాల ముందు నూనుగు మీసాల నూతన యవ్వనంలో ప్రతిన బూని ఆజన్మాంతం పాలించిన ధీరుడు సావర్కర్. భారత ధార్మిక సాంస్కృతిక విప్లవ కర్త స్వామి దయానంద సరస్వతి మరియు సాయుధ పోరాటయోధుడు వాసుదేవ బల్వంత్ ఫడకే లు స్వర్గస్తులైన సంవత్సరం 1883 అదే సంవత్సరం మే 28న వారి అంశగా అన్నట్టు వినాయక దామోదర్ సావర్కర్ నాటి బొంబాయి ప్రెసిడెన్సీ నాసిక్ జిల్లా లోని భాగూర్ లో జన్మించారు.సావర్కర్  పదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి రాధాబాయి కలరా వ్యాధితో కన్నుమూసారు. తనకు చిన్నప్పటి నుండి రామాయణ మహాభారతాలు రాణా ప్రతాప్, వీర శివాజీ, పీష్వా వీరగాధలు వినిపించిన తండ్రి దామోదర పంత్ కూడా తల్లి మరణించిన ఆరేళ్లకు ప్లేగు వ్యాధితో తుది శ్వాస విడిచారు. పదహారేళ్ళ వయసులొ తల్లిదండ్రుల కోల్పోయి అన్న సంరక్షణలో పెరిగారు.

కవి..రచయిత: పువ్వు పుట్టగానే పరిమళించినట్లు పదేళ్ల వయసులోనే నాటి సామాజిక స్థితిగతులపై సావర్కర్ కవితలను నాటి మహారాష్ట్రలోని ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. ఈ మహాకవిని అప్పటి పత్రికా సంపాదకులు పదేళ్ల బాలుడిని గుర్తించలేదు కానీ ఆ రచనావ్యాసంగం అలా కొనసాగి తర్వాతి కాలంలో ఎందరికో స్ఫూర్తినిచ్చింది.  THE INDIAN WAR OF INDEPENDENCE  1857 అనే గ్రంథం అప్పట్లో సంచలనం. నిజమైన భారతీయ చరిత్ర రచన ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో తెలియచెప్పిన గ్రంధమది. అదేవిధంగా ఆరు స్వర్ణ పత్రాలు, హిందూ పదపాదుషాహి, పానీపట్ చరిత్ర, అండమాన్ లో ఆజన్మాంతం వంటి రచనలు కూడా చాలా ప్రత్యేకమైనవి, ప్రేరణదాయకమైనవి. 1911 నుంచి 1921 వరకు అండమాన్ లో కఠిన జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన తన రచనావ్యాసంగాన్ని ఆపలేదు. `హిందూఇజం’ అనే పుస్తకాన్ని రచించారు.  అలాగే జైలు గోడలే కాగితాలుగా, ఇనుప మేకు కలంగా అనేక కవితలు వ్రాసారు. ఇలా బాల్యం నుండి వృద్ధాప్యం వరకు తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించి ఎందరెందరికో ప్రేరణ దాతగా నిలిచారు.

సంఘటన శీలి: తన పదేళ్ళ వయసులో బొంబాయి, ఆజంగఢ్ లో మతకలహాలు బాలసావర్కర్ ను తీవ్రంగా కలచివేశాయి. హిందూ సమాజం సంఘటితం అయితేనే వీటిని అణచవచ్చు  అని చిన్ననాడే భావించారు. తోటి బాలురను ఏకం చేసి వాటిని ఐకమత్యంగా ఎలా ఎదుర్కోవాలో చూపిన సంఘటనశీలి సావర్కర్. చిన్ననాడు చూపిన ఆ సంఘటన నైపుణ్యమే 1999లో మిత్ర మేళ స్థాపనకు, ఆ తర్వాత అభినవ భారత్ సంస్థ ఏర్పాటుకు క్రమేపి హిందూ మహాసభ సంస్థాపన వరకు కొనసాగి తన సంఘటన నైపుణ్యంతో ఎందరెందరో విప్లవవీరుల తయారు చేసిన అద్భుత సంఘటనశీలి మన సావర్కర్.

సేవావ్రతి : ఇప్పటి కరోనా మహమ్మారి లాగా నాడు ప్లేగు వ్యాధి జనాలు అందరినీ కబళిస్తున్న రోజులవి. ప్లేగు వ్యాధికి గురై మరణం సంభవిస్తే ఆ శవాలను తీసుకెళ్లడానికి ఏ ఇంటి నుంచి మనుషులు వచ్చేవారు కాదు. అప్పుడు సావర్కర్ సారథ్యంలోని మిత్ర మేళ అధిక సంఖ్యలో శవదహనాలు చేసింది. ఒకసారి విపరీతంగా అలసిపోయిన సావర్కర్  రుద్ర భూమి స్మశానంలో నిద్రపోయాడు. దీన్నిబట్టి మనకు సావర్కర్ సేవాతత్పరత అర్థమవుతుంది

అద్భుత వక్త:  బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో పూణె నగరంలో నిర్వహించిన విదేశీ వస్త్రదహనం కార్యక్రమంలో సావర్కర్ ఉపన్యాసం పిల్లలు, పెద్దలు అందరినీ ఊపేసింది. పత్రికల వార్తల నిండా సావర్కర్  ఉపన్యాసమే. పోలీసులు కూడా ఆ ఇరవై ఒక్క ఏళ్ల యువకుని ప్రసంగానికి దిగ్భ్రమ చెందారు. 1906 ఫిబ్రవరి అభినవ భారత సంస్థలో ఆయన చేసిన ప్రసంగానికి  ప్రభావితులై ఎందరెందరో యువకులు విప్లవ మార్గం పట్టారు.

విప్లవ మార్గదర్శి: శ్యాంజీకృష్ణవర్మ స్కాలర్ షిప్ తో బారిస్టర్ చదువుకోసం లండన్ వెళ్లి అక్కడ ఫ్రీ ఇండియా సొసైటీ స్థాపించి భాయ్ పరమానంద్, లాలాహరదయాళ్,  వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, వి వి ఎస్ అయ్యర్, తొలిసారి స్వాతంత్య్ర పతాకను విదేశీగడ్డ పై ప్రదర్శించిన మేడం కామా, బాంబు తయారు చేసిన  సేనాపతి బాపట్, ఇంగ్లీష్ అధికారిని ఇంగ్లాండ్ లోనే చంపిన మదన్ లాల్ ధీంగ్రా, నాసిక్ జిల్లా కలెక్టరు ను చంపిన అనంత లక్ష్మణ కణ్హరే, వైస్రాయ్ లార్డ్ మింటో పై దాడి చేసిన నారాయణ రావు  వరకు ఎందరెందరో వీరులకు విప్లవ మార్గదర్శిగా మారాడు. సావర్కర్ ప్రేరణతో 1908 ఏప్రిల్ 30 న యువ కిశోరాలు ఖుదీరాం బోస్, కన్నయ్య లాల్ దత్త, సత్యేంద్రనాథ్ బోస్ లు ఇంగ్లీషు వారిపై బాంబులు వేసి ఉరికంబాలకెక్కారు. తాను లండన్ లో ఉన్నప్పుడు ఇండియా హౌస్ వంట వాడితో 20పిస్టల్ లు భారత్‌కు పంపాడు. ఆంగ్ల ప్రభుత్వ వీర విధేయ భారతీయులు కొందరు మదన్ లాల్ ధీంగ్రాను తప్పుబడుతూ తీర్మానం చేస్తే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి విప్లవ వీరు కు అండగా నిలిచారు సావర్కర్.

త్యాగ శీలి: లండన్ లో బారిష్టర్ చదువు పూర్తి చేసిన పట్టా ఇవ్వడానికి అక్కడి అధికారులు నిరాకరిస్తూ `రాజకీయాల్లో పాల్గొనను’ అని హామీ పత్రం ఇస్తేనే పట్టా ఇస్తామంటే `మీరిచ్చే ఆ విలువ లేని పట్టా కోసం నేను ఇక్కడికి రాలేదు. నా దేశ స్వతంత్రమే నా ధ్యేయం. మీరు చెప్పిన హామీ పత్రం రాసి ఇవ్వను’ అని తిరస్కరించారు. మరో సందర్భంలో తాను యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నప్పుడు భార్య తనను చూడడానికి వచ్చి ఏడుస్తుంటే… నన్ను చూసి అయ్యో ఇలా ఎందుకు అయింది అని చింతించకు. సంతానం కనడం, సుఖంగా సంపాదించడం మాత్రమే జీవితం కాదు పక్షులు కూడా ఆ పని చేస్తాయి. మానవులం మనం దేశం కోసం మనల్ని త్యాగం చేయాలి అని ఉద్బోధించాడు. తన ఆస్తిని ఆంగ్లేయ ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా స్వాతంత్రం అనంతరం దానిని తిరిగి తీసుకునే ఆలోచన చేయకుండా దేశమంతా నాదే అయినప్పుడు కొన్ని ఎకరాల భూమి నాది కాకుండా పోతేనేమి అని నిర్వికారంగా దేశ సేవ చేసిన త్యాగశీలి సావర్కర్.

వీర సామాజిక సంస్కర్త:  జైలు నుండి విడుదలయ్యాక సావర్కర్ హిందూ సమాజాన్ని సంఘటితం చేసి అంటరానితనాన్ని రూపుమాపాలి అనుకున్నారు. 1924లో మిత్రులతో కలిసి రత్నగిరిలో శివాజీ ఉత్సవాలను నిర్వహించారు. పాఠశాలలో అన్ని వర్గాలు కులాల వారు చదువుకునేలా ఒత్తిడి తెచ్చి సాధించారు. బలవంతపు మత మార్పిడి జరిగిన వారిని శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి హిందుత్వంలోకి ఆహ్వానించారు. 1925లో హరిజనులకు దేవాలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టి రత్నగిరి లోని ప్రసిద్ధ విఠోభా దేవాలయంలో హరిజనులతో సమావేశం జరిపారు. రత్నగిరిలో జరిగిన దళిత సభలో నిమ్న జాతుల నేత రాజభోజ్ మాట్లాడుతూ సావర్కర్ ను గొప్ప విప్లవాత్మక సంస్కర్త అని కీర్తించాడు. 1931లో రత్నగిరిలో పతితపావన దేవాలయం నిర్మించారు.

స్వార్థపూరిత ఆనందం కోసం ఆయన సిద్ధాంతాలను, నమ్మకాలను, ఆదర్శాలను వదులుకోలేదు. అవకాశవాదిగా మారి పదవులు పొందలేదు. భరతజాతి అన్నివిధాల బలప్రభావాలతో  తులతూగాలని సావర్కర్ కన్న  కలలను నిజం చేద్దాం.

This article was first published in 2020…