Home News మేఘాలయలో హింసాత్మక ఘటనలు అరికట్టాలి – VHP

మేఘాలయలో హింసాత్మక ఘటనలు అరికట్టాలి – VHP

0
SHARE

ఇటీవ‌ల అక్టోబర్ 28న‌ మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన హింసాకాండ తీవ్రంగా ఖండించదగినద‌ని విహెచ్‌పి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిలింద్‌ పరాండే అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఖాసీ-జైంతియా అండ్ గారో పీపుల్ (ఎఫ్‌కెజెజిపి) నిరుద్యోగానికి వ్యతిరేకంగా హింసాత్మ‌కంగా చేసిన నిరసన ఉన్మాదంగా మారిన తీరు మేఘాలయ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశ ప్ర‌జ‌లంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేస్తోంద‌న్నారు. ఈ హింసాత్మ‌క దాడుల నుంచి రాష్ట్రంలోని అమాయక, శాంతియుత హిందూ సమాజానికి భద్రత కల్పించాలన్నారు. హింస, వేర్పాటువాదాన్ని నడిపించే సంస్థలపై, హింసాకాండకు కారకులైన వారిని, రాజకీయ సంస్థలను గుర్తించి రాజ్యాంగం, చ‌ట్ట ప్ర‌కారం శిక్ష‌లు విధించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

హింసాకాండకు పాల్పడడమే కాకుండా, ఆందోళ‌నకారులు లేవనెత్తిన రాజకీయ, దేశ వ్యతిరేక నినాదాలు ఈ అస్పష్టమైన ఆందోళన వెనుక ఏ శక్తులు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంద‌న్నారు. మేఘాలయ, భారత్ ల‌కు వ్య‌తిరేకంగా మేఘాలయ యువతలోని ఒక వర్గాన్ని హింసకు దిగేలా ప్రేరేపించి, క్రియాశీలం చేసే కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. FKJGP అధ్య‌క్షుడు డూండీ ఖోంగ్‌సిట్ హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే మ‌రోవైపు హింసాత్మక నిరసనల‌కు ఇది ప్రారంభం మాత్రమే అని బెదిరించ‌డం వెన‌క నిర‌స‌న‌ల అస‌లు ఉద్దేశం అర్థ‌మ‌వుతుంద‌న్నారు. స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి పెట్టకుండా భారత వ్యతిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ‌డం, శాంతియుత సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని, అక్కడి పాలనా యంత్రాంగం కూడా అగ్నికి ఆజ్యం పోసేలా వ్య‌వ‌హ‌రించింద‌న్నారు.

గత కొన్నేళ్లుగా దేశవ్యతిరేక శక్తుల ద్వారా జరుగుతున్న హింసాత్మక ఘటనలు మేఘాలయ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోంద‌ని వీహెచ్‌పీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంద‌న్నారు. మేఘాలయ ఆదాయంలో ప్రధానమైన ప‌ర్యాట‌కంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంద‌న్నారు. ఉత్పాదక, వాణిజ్య, వృత్తి, కార్పొరేట్ కార్యకలాపాలు నిలిచిపోయాయ‌ని, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమ సంస్థలను తెరవలేకపోతున్నార‌ని, పోలీసుల తీరు కూడా ప్రజలు ఇళ్లల్లోనే ఉండి ప్రజాజీవితానికి, కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వస్తోంద‌న్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చ‌ర్చ‌ల ద్వారానే పరిష్కారం ఉంటుందని, హింస ఏ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కాద‌ని మేఘాలయ యువతకు మిలింద్ పరాండే సూచించారు. మేఘాలయా యువతకు హింస ప‌ట్ల ఆసక్తి లేద‌ని, కానీ కొన్ని దేశ వ్య‌తిరేక శ‌క్తులు, వేర్పాటువాదులు యువశక్తిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నార‌ని, ఈ శక్తిని వారు తమ రాష్ట్ర‌, దేశ అభివృద్ధికి ఉపయోగించాల‌ని వారు కోరారు.

మేఘాలయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం హింసాత్మక ఘ‌ట‌న‌ల‌కు వ్యతిరేకంగా గట్టి చర్య తీసుకోవాలని శాంతిని ప్రేమించే గిరిజన, గిరిజనేతర హిందూ సమాజం మేఘాలయ అభివృద్ధికి సహకరించడానికి తగిన వాతావరణాన్ని అందించాలని VHP ఆశిస్తోంద‌న్నారు. హింస అనేది వేర్పాటువాదుల ఎజెండా కావచ్చు, దాని ఉజ్వల భవిష్యత్తు గురించి స్పృహతో ఉన్న యువశక్తికి కాద‌న్నారు. ప్రస్తుతం దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంద‌ని, ఈ అభివృద్ధికి రాష్ట్ర, దేశ ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని మిలింద్ ప‌రాండే గారు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here