Home News వరంగల్ లో విదేశీముస్లిం మత ప్రచారకుడిని అడ్డుకున్న VHP కార్యకర్తలు

వరంగల్ లో విదేశీముస్లిం మత ప్రచారకుడిని అడ్డుకున్న VHP కార్యకర్తలు

0
SHARE

భారతదేశ వీసా నిబంధ‌న‌లను ఉల్లంఘిస్తూ దేశంలో పర్యటిస్తున్న సూఫీ పీర్ సాకిబ్ ఇక్బాల్ షమీ అనే పాకిస్థానీ-బ్రిటిష్ ఇస్లామిక్ ప్రచారకుడు వరంగల్ ఆజాం జాహి మిల్ గ్రౌండ్ లో శనివారం రాత్రి నిర్వహించే ముస్లిం మత ప్రచార సభలో పాల్గొనకుండా లీగ‌ల్ రైట్స్ ప్రొటెక్ష‌న్ ఫోర‌మ్ (LRPF), విశ్వహిందూ పరిషత్ వరంగల్ మహానగర్ కార్యకర్తల ఫిర్యాదు మేర‌కు పోలీసులు అత‌న్ని నిలువరించారు.

వివ‌రాల్లోకి వెళితే.. పాకిస్తాన్ లో జన్మించి బ్రిటన్ పౌరసత్వం స్వీకరించిన సూఫీ పీర్ సాకీబ్ ఇక్బాల్ షమి అనే ముస్లిం మత ప్రచారకుడు కాన్ఫరెన్స్ వీసాపై భారత్ కు వచ్చాడు. ఈ వీసా ద్వారా వచ్చిన విదేశీయులు భారతదేశంలో మతపరమైన కార్యక్రమాల్లో గానీ, బహిరంగ సభలలో గానీ పాల్గొనకూడదు. కేవలం భారత ప్రభుత్వం అనుమతి పొందిన అంత‌ర్జాతీయ స‌మావేశాల్లో మాత్ర‌మే పాల్గొనాలి. దానికి వ్య‌తిరేకంగా ప్రభుత్వానికి తెలవకుండా వివిధ నగరాల్లో ముస్లింలు ఏర్పాటు చేస్తున్న మత ప్రచార సభల్లో ఇక్బాల్ షమి పాల్గొంటూ వారిలో దేశ వ్యతిరేక బీజాలను నాటుతున్నాడు. వరంగల్ లో కూడా దారుల్ ఉలూమ్ హన్ఫియా గరీబ్ నవాజ్, గరీబ్ నవాజ్ సూఫీ ఫోరం ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ శనివారం రాత్రి నగరంలోని అజంజాహి మిల్ మైదానంలో ఫైజాన్- ఏ- గరీబ్ నవాజ్, అంత‌ర్జాతీయ శాంతి స‌మావేశం పేరిట ఒక మత ప్రచార సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనడానికి కాన్ఫరెన్స్ వీసాపై వచ్చిన సూఫీ పీర్ సాకిబ్ ఇక్బాల్ షమీ పాల్గొంటున్నారన్న విషయంపై లీగ‌ల్ రైట్స్ ప్రొటెక్ష‌న్ ఫోర‌మ్ (LRPF) కేంద్ర హోం శాఖ‌కు, తెలంగాణ‌ రాష్ట్ర డిజీపీ కి ఫిర్యాదు చేసింది. అలాగే వరంగల్ మహానగర్ లోని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

విదేశీ ముస్లిం వివరాలన్నీ కనుక్కున్న పోలీసులు కాన్ఫరెన్స్ వీసాపై వచ్చి మత ప్రచార సభల్లో పాల్గొనడానికి అనుమతి లేదని తెలియజేయడంతో ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించడానికి వచ్చిన సూఫీ పీర్ సాకీబ్ ఇక్బాల్ షమీ ఆ సభలో పాల్గొనకుండా వెనుతిరిగాడు. వీ.హెచ్.పి ఇచ్చిన ఫిర్యాదుకు వెంటనే స్పందించి భారత వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సూఫీ పీర్ సాకీర్ ఇక్బాల్ షమీని వరంగల్ సభలో పాల్గొనకుండా నిరోధించిన పోలీసులకు ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ వరంగల్ మహానగర్ అధ్యక్షులు కేశిరెడ్డి జైపాల్ రెడ్డి, కార్యదర్శి శ్రీరామ్ ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు వెలగందుల రాజు కృతజ్ఞతలు తెలిపారు.