Home News కరీంనగర్‌ లో వీహెచ్‌పీ కార్యాలయం ప్రారంభించిన శ్రీ ప్రవీణ్‌ తొగాడియా

కరీంనగర్‌ లో వీహెచ్‌పీ కార్యాలయం ప్రారంభించిన శ్రీ ప్రవీణ్‌ తొగాడియా

0
SHARE

హిందువుల కేంద్రంగా భారతదేశం కొనసాగుతుందని విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా అన్నారు. కరీంనగర్‌ సుభాష్‌నగర్‌ ప్రాంతంలో వీహెచ్‌పీ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఎన్‌టీఆర్‌ చౌరస్తా నుంచి వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పెద్దఎత్తున ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. ఆనంతరం నూతన కార్యాలయాన్ని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రవీణ్‌తొగాడియా కరీంనగర్‌కు వచ్చిన సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ఆయనను గజమాలతో సన్మానించారు. వీహెచ్‌పీ భవన నిర్మాణానికి సహకరించిన దాతలతో సమావేశం నిర్వహించారు. ప్రతి హిందువు ఇలాంటి నిర్మాణాలను అదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో వీహెచ్‌పీ కార్యాలయాన్ని నిర్మించి ఐక్యతను చాటిచెప్పాలన్నారు. త్వరలోనే రామమందిర నిర్మాణంపై, గోవధ నిషేధం పై మంచి సంకేతాలు వినిపించనున్నాయని తెలిపారు. నిరుపేద హిందువుల ఆరోగ్య పరిరక్షణకు వీహెచ్‌పీ ఆధ్వర్యంలో హిందూ హెల్ప్‌లైన్‌, హెల్త్‌కేర్‌ ప్రారంభించామని తెలిపారు. ఉచిత మెడికల్‌ కేర్‌, రక్తదానం, వైద్య పరీక్షలు, వీహెచ్‌పీ ద్వారా అందిస్తున్నట్లు సూచించారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ ట్రంప్‌ గెలుపు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి కావడం మంచి సంకేతాలన్నారు. భవనంలోని రెండు గదులు స్వచ్ఛందంగా నిర్మించిన ఇంజినీర్‌ పవన్‌కుమార్‌ దంపతులను తొగాడియా సన్మానించారు.

దేశంలో హిందూ మతం నాశనమైపోనుందని ఓ వర్గీయులు పగటి కలలు కంటున్నారని.. విశ్వహిందూ పరిషత్‌ ఉన్నంతవరకూ అది సాధ్యంకాదని ప్రవీణ్‌ తొగాడియా పేర్కొన్నారు. నిజాం, మొఘల్‌ నవాబుల పాలన నుంచి హిందువులను ఆర్థికంగా దెబ్బతీస్తూ వచ్చారని తొగాడియా పేర్కొన్నారు. నేటి లవ్‌ జిహాద్‌ సంస్కృతిని హిందువులంతా ఏకమై తరమికొడతారని పేర్కొన్నారు. దేశంలో హిందువుల నుంచి ఎక్కువమొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. ఎక్కువ సంతానం, ఎక్కువ మంది భార్యలను చేసుకుంటున్న ఓ మతానికి పన్నుల ద్వారా వచ్చే లబ్ధిని ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. వారికి ప్రభుత్వ విద్య, వైద్యం, ఓటు హక్కుకి వీలులేకుండా చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని సవరించి దేశంలో హిందువుల రక్షణ కోరేవారే సీఎం, పీఎం అయ్యేలా ‘క్యాప్చర్‌’ రాజకీయ శక్తిని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

నాయకుల ఘన స్వాగతం

కరీంనగర్‌లోని వీహెచ్‌పీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ప్రవీణ్‌ తొగాడియా వస్తుండంతో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి ద్విచక్రవాహన ద్వారా భారీ ర్యాలీ చేపట్టారు. బస్టాండ్‌, తెలంగాచౌక్‌, కోర్టుచౌరస్తా, మంచిర్యాల చౌరస్తా నుంచి సుభాష్‌నగర్‌ వరకు ర్యాలీ కొనసాగించారు. భవనాన్ని ప్రారంభం సమావేశ ఆనంతరం ఆయన ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి నాయకులకు దిశానిర్దేశనం చేశారు. వీహెచ్‌పీ, భజరంగ్‌ధళ్‌, భాజపా నాయకులు ఆయన్ని సన్మానించారు. సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర, జిల్లా నాయకులు జగన్‌మోహన్‌రావు, సత్యం, మధుపూదన్‌రావు, రాజేందర్‌, మురళీమనోహర్‌, విజయమోహన్‌రెడ్డి, రామణాచారి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌, ఉట్కూరి రాధాకృష్ణ, తదితరులు ఉన్నారు. తిరుగు ప్రయాణంలో డాక్టర్‌ విజేందర్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లి నగరంలోని కొంతమంది వైద్యులతో కొంతసేపు ముచ్చటించారు.

(ఈనాడు సౌజన్యం తో)