Home Telugu Articles విచ్ఛిన్నవాదులకు చెంపపెట్టు, చెక్కుచెదరని మోదీ బలం

విచ్ఛిన్నవాదులకు చెంపపెట్టు, చెక్కుచెదరని మోదీ బలం

0
SHARE

ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అత్యద్భుత విజయం, మరో మూడు రాష్ట్రాల్లోనూ భాజపా బ్రహ్మాండమైన రీతిలో చొచ్చుకువెళ్లిన తీరు కొందరు రాజకీయ వ్యాఖ్యాతలను, ఎన్నికల విశ్లేషకులను తీవ్ర దిగ్భ్రమకు గురిచేసింది. విశ్లేషణలు, ఎన్నికల ముందస్తు సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ అంటూ రకరకాల పేర్లతో చాలామంది రాజకీయ మేధావులు వేసిన అంచనాలు, వల్లెవేసిన జోస్యాలు- వాస్తవ ఫలితాలతో పోల్చినప్పుడు గాలిలో విసిరిన రాళ్లని తేలిపోయింది. అసలు క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోంది, జన మనోగతంలో ఏముందో పసిగట్టి కనిపెట్టే సామర్థ్యాన్ని ప్రధాన స్రవంతి ప్రచార, ప్రసార (ప్రింట్‌, టెలివిజన్‌) మాధ్యమాల్లో కొన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది.

కొందరు విశ్లేషకులు, వ్యాఖ్యాతల వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది. వారు పచ్చి పక్షపాతం ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల, భాజపా పట్ల వారి నరనరాన ద్వేషం గూడు కట్టుకొంది. లౌకికవాదం, హిందూ మతవాదమనే రంగుటద్దాలతో ప్రతిదాన్నీ చూసేవారు కాగితాల్లో ఏవో రాసిస్తే, ఈ విశ్లేషకులేమో ఉన్నదున్నట్లు చదవడం వినా నిజానిజాల జోలికి పోలేదు. అందుకే వారి అంచనాలన్నీ అంత ఘోరంగా గురి తప్పాయి. మీడియాలో, ముఖ్యంగా ఆంగ్ల ప్రచార, ప్రసార మాధ్యమాల్లో; విద్యా వ్యవస్థలో, ఉన్నతాధికారవర్గాలలో గడచిన 70 ఏళ్లుగా నెహ్రూవాదులు, మార్క్సిస్టు ఆలోచనాపరులు తిష్ఠ వేసుకొన్నారు. అన్నీ తాము చెప్పిన ప్రకారమే జరగాలని వారు కోరుకొంటారు. వారి అడుగులకు మడుగులొత్తే కొందరు విశ్లేషకులు, వ్యాఖ్యాతల దృష్టిలో ఈ నెహ్రూవాదులు మంచివాళ్లు. వారి మార్క్సిస్టు మిత్రులూ మంచివాళ్లు. ఎటుదిరిగి, జాతీయ భావాలు కలిగినవారు మాత్రం చెడ్డవాళ్లు. ప్రాంతీయ రాజకీయ శక్తులను తమ అవసరాలకు అనుగుణంగా ఇష్టమొచ్చినట్లు వాడుకోవచ్చునన్నది వారి భావన. నెహ్రూవాదులకు, వామపక్ష వాదులకు ఈ తీరు అలవాటైపోయింది. తమ భావజాలంతో ఏకీభవించనివారిని వారు అంటరానివాళ్లుగా చూస్తారు!

నినాదాలా… విధానాలా?

తాజా యూపీ ఎన్నికల సంగతే చూద్దాం. ఈ ఎన్నికలను లౌకికవాద శక్తులకు, హిందూమత వాదులకు మధ్య జరుగుతున్న మహాయుద్ధంగా ప్రకటించిన నెహ్రూవాద, మార్క్సిస్టు ఆలోచనాపరులు- తమ రంగుటద్దాలను కాసేపు పక్కనపెట్టి నిజమేమిటో చూడాలనుకోలేదు. ఎన్నికల ఫలితాలు చూశాక కంగుతినడం వారి వంతైంది. ఈ మేధావులు పేర్కొన్న లౌకికవాద పార్టీలను ప్రజలు అసలు లౌకికవాద రాజకీయ పక్షాలుగానే పరిగణించలేదు. మోదీని, ఆయన పార్టీని మతతత్వ దృక్కోణంలో చూడలేదు. విచ్ఛిన్నవాదం ద్వారా ప్రజల మధ్య అడ్డుగోడలు సృష్టించడమే పనిగా పెట్టుకొని, దేశాన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఒకవైపు- అందరికీ సమాన అవకాశాలు కల్పించి, నవీన భారతాన్ని ఆవిష్కరించడమే పరమ లక్ష్యంగా, మూల మంత్రంగా ముందుకు సాగిపోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోవైపు! వారి మధ్య జరిగిన అసలు సిసలు సమరమిది. పెద్దనోట్ల రద్దు విషయంలోనూ మీడియాలో ఓ వర్గం పూర్తిగా తప్పుదోవ తొక్కింది. పెద్దపెద్ద బారులు తీరి బ్యాంకులు, ఏటీఎమ్‌ల ముందు గంటల తరబడి నిలబడిన పేదలు- భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మోదీకే మద్దతు పలికారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి వంటగ్యాస్‌ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన ఉజ్జ్వల పథకం, జన్‌ధన్‌ యోజన, పేదలకు తక్కువ ప్రీమియంతో బీమా పథకం వంటి కార్యక్రమాలను మోదీ చిత్తశుద్ధితో, నిజాయతీతో అమలుపరుస్తూ యావద్దేశ ప్రజానీకం గుండెల్లో, ముఖ్యంగా పేదల హృదయసీమల్లో తిరుగులేని స్థానం సంపాదించుకొన్నారు. ఈ విషయంలో ఆయనను కొంతమంది ఇందిరాగాంధీతో పోలుస్తున్నారు. ‘గరీబీ హఠావో’ నినాదమిచ్చిన ఇందిరాగాంధీ, పేదలను విపరీతంగా ఆకట్టుకొన్న మాట నిజమే. కానీ, ఆమె ఈ నినాదాన్ని విధానంగా మలుచుకొని అమల్లోకి తేలేకపోయారు. ఇద్దరి మధ్య పోలిక అంతవరకే. మోదీ కేవలం నినాదాలకు పరిమితం కాలేదు. వాటిని విధానాలుగా అమలులోకి తీసుకొస్తున్నారు. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారు. బూటకపు రుణమేళాలు పెట్టి ప్రజల సొమ్మును కాంగ్రెస్‌ కార్యకర్తలకు పప్పు బెల్లాలుగా పంచిపెట్టారు. మరో వైపు మోదీ, బ్యాంకు ఖాతాలు తెరిచేలా 25 కోట్ల పేద ప్రజల్ని ముందుకు నడిపించారు.

ఈ ఎన్నికల్లో మోదీ ఎక్కడా మతపరమైన అంశాల్ని ప్రస్తావించలేదు. కులం, మతం, జాతి, ప్రాంతం, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభ్యుదయం గురించి మాత్రమే మాట్లాడారు. ఎన్నికలు అనగానే కులమతాల సంఘర్షణే అన్న నిర్ణయానికి వచ్చేసిన ఓ వర్గం మీడియా, మోదీ కేవలం అభివృద్ధి ప్రాతిపదికనే ఓట్లు అడగడం, అత్యంత లౌకికవాదిగా వ్యవహరించడాన్ని నమ్మలేకపోయింది. అభివృద్ధి మంత్రానికి ఓట్లు రాలవని ఆ వర్గం భావించినట్లుంది.

ఆందోళనకర పరిణామాలు

ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికలు ఇంతకుముందు ఒడిశా, మహారాష్ట్రల్లో జరిగిన పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సందేశాలు ఎన్నో ఉన్నాయి. సర్వ సమర్థ, సమైక్య భారతావనిని పునర్‌ నిర్మించేందుకు అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోగల గట్టి నాయకుణ్ని ప్రజలు ఇప్పుడు మోదీలో చూస్తున్నారు. దేశంలో విచ్చిన్న ధోరణులు నానాటికీ పెరుగుతున్నాయి. దేశ సమైక్యత, సమగ్రతలను దెబ్బతీసేందుకు సమకట్టిన విచ్ఛిన్నవాదులను కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షవాదులు వెనకేసుకు రావడం ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దిల్లీ, పశ్చిమ బంగలోని విశ్వవిద్యాలయాల్లో పరిణామాలే చూడండి. వామపక్షాల మద్దతుతో చెలరేగిపోతున్న కొంతమంది విద్యార్థులు దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినదిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న సగటు భారతీయుడిలో నెత్తురు మరుగుతోంది. కొన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు కశ్మీరీ ఉగ్రవాదులను, వేర్పాటువాదులను సమర్థిస్తుండటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. మతపరమైన మైనారిటీలను బుజ్జగించేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తుండటం, ప్రమాదకర విచ్ఛిన్నవాద రాజకీయాలకు పాల్పడుతుండటం వారిని కలవరపరుస్తోంది. పైగా మన్మోహన్‌సింగ్‌ సారథ్యంలో పదేళ్లపాటు సాగిన సంకీర్ణ ప్రభుత్వ హయాములో దేశం పలువిధాల పతనం అంచులకు చేరింది. ఆ స్థాయి నుంచి దేశాన్ని అభ్యున్నతి దిశగా నడపాల్సి ఉంది. దాదాపు మూడు దశాబ్దాల తరవాత అందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. మోదీ సమర్థ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పాటైన ప్రభుత్వానికి- దేశాన్ని సమైక్యంగా ముందుకు నడిపించేందుకు గట్టి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఏర్పడింది. కేంద్రం బలహీనంగా ఉంటే ఇష్టారాజ్యం చలాయించవచ్చుననుకునే పార్టీలు ఇప్పటికే కంగుతిన్నాయి. సమాఖ్య సారథ్యంతో దేశ రథాన్ని ప్రగతిపథంలో నడపగలిగేది మోదీనేనని ప్రజలు గుర్తించారు కాబట్టి ఈ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం కట్టబెట్టారు. ఇందులో ఎలాంటి సందేహానికీ తావు లేదు!

-ఎ సూర్యప్రకాష్

ప్రసార భారతి చైర్మన్

(ఈనాడు సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here