Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

సూర్యకుమార్ సేన్

పళ్ళు విరగగొట్టి గోళ్ళూడదీసినన్
మరువ లేదు ఇతడు మాత స్వేచ్చ
సూర్య సేను నిలచె సూర్యునోలె నిచట
వినుర భారతీయ వీర చరిత

దంతములను విరిచి తన నఖాల్బెరికినన్
సేను వీడ లేదు స్వేచ్చ పోరు
చిరుత వోలె చెలగె చిట్టగాంగడవుల
వినుర భారతీయ వీర చరిత

సూర్యకుమార్ సేన్ 1894వ సంవత్సరం మార్చి 22వ తేదీన చిట్టగాంగ్ లోని రౌజాన్ ఉపజిల్లా నోపారాలో జన్మించారు. ఆయన తండ్రి రామణిరంజన్ సేన్ ఉపాధ్యాయుడు. 1916 లో బెర్హంపూర్ కళాశాలలో B.A. పూర్తి చేశారు. విద్యార్థి‌గా తన ఉపాధ్యాయులలో ఒకరి నుంచి భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుసుకున్నారు. విప్లవాత్మక ఆదర్శాల వైపు ఆకర్షితుడయ్యారు. అనుశిలన్ సమితి అనే విప్లవాత్మక సంస్థలో చేరారు. చదువు పూర్తి చేసిన తరువాత 1918 లో చిట్టగాంగ్‌కు తిరిగి వచ్చారు. నేషనల్ స్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడిగా చేరారు. చిట్టగాంగ్ ఆయుధాలయంపై దాడి చేసి అక్కడి పోలీసు, సహాయక దళాల ఆయుధాల స్వాధీన కార్యక్రమానికి 1930వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన ఒక విప్లవకారుల బృందానికి సేన్ నాయకత్వం వహించారు.

బ్రిటీషు వారి ఆయుధాల ప్రాంగణంలో భారత జాతీయ జెండాను సూర్యకుమార్ సేన్ ఎగురవేశారు. తరువాత తప్పించుకున్నారు. కొద్ది రోజుల తరువాత, విప్లవాత్మక సమూహంలో ఎక్కువ భాగాన్ని బ్రిటిష్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సమీపంలోని జలాలాబాద్ కొండలలో వారిని ఉంచారు. తరువాతి పోరాటంలో, పన్నెండు మంది విప్లవకారులు మరణించారు, చాలామంది అరెస్టయ్యారు. మరికొందరు సేన్‌తో సహా పారిపోయారు.

సేన్ అజ్ఞాతంలో ఉంటూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తూనే ఉన్నారు. కొన్నిసార్లు పనివాడిగా, రైతుగా, పూజారిగా, ఇంటి పనివాడిగా లేదా ముస్లింగా వేషభాషల్లోనూ రూపురేఖలను మార్పులను సంతరించుకున్నారు. ఈ విధంగా సేన్ బ్రిటిష్ వారి పట్టుబడకుండా తప్పించుకున్నారు. ఒకసారి నేత్రా సేన్ అనే వ్యక్తి ఇంట్లో ఆయన దాక్కున్నారు. కాని నేత్రా సేన్ సూర్యకుమార్ సేన్ తన ఇంట దాగి ఉన్న సమాచారాన్ని బ్రిటిష్ వారికి చేరవేశాడు, పోలీసులు వచ్చి ఫిబ్రవరి 1933 లో సేన్‌ను వారి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నేత్రాసేన్ ఇంటికి వచ్చిన ఒక విప్లవకారుడు అతడిని పొడవైన కత్తితో నరికి చంపాడు. సూర్యకుమార్ సేన్‌కు మద్దతు ఇస్తున్న నేత్రాసేన్ భార్య తన భర్తను చంపిన విప్లవకారుడి వివరాలను ఒక్కనాటికీ వెల్లడించలేదు.

సూర్యకుమార్ సేన్‌ను ఉరి తీయడానికి ముందు బ్రిటిష్ వారు ఆయన్ని దారుణంగా హింసించారు. సేన్ దంతాలను సుత్తితో పగలగొట్టారు. గోళ్లన్నింటినీ పెకలించివేశారు. సేన్ అవయవాలను, కీళ్ళను విరిచారు. అపస్మారక స్థితిలో ఉన్న సూర్యసేన్‌ను ఉరితీశారు. 1934 సంవత్సరం జనవరి 12వ తేదీన సేన్ పార్థివ దేహాన్ని సముద్రానికి అప్పగించారు.

“మరణం నా తలుపు తట్టింది. నా మనస్సు శాశ్వతత్వం వైపు ఎగిరిపోతోంది. ఇంత ఆహ్లాదకరంగా అంత సమాధిలో, ఇంత గంభీరమైన సమయంలో, నేను ఏమి వదిలివేయాలి మీకు? ఒకే ఒక్క విషయం, అది నా కల, బంగారు కల స్వేచ్ఛా భారత కల. చిట్టగాంగ్‌లో తూర్పు స్వరాజ్య సమరం జరిగిన రోజు ఏప్రిల్ 18, 1930 ని ఎప్పటికీ మర్చిపోకండి.. రుధిరాక్షారాలతో లిఖించండి. భారతదేశానికి స్వేచ్ఛ కోసం అమరులైన దేశభక్తుల పేర్లను మీ హృదయాలలో శాశ్వతంగా పదిలపరుచుకోండి” అని తన స్నేహితులకు రాసిన చివరి లేఖలో సూర్యకుమార్ సేన్ పేర్కొన్నారు.

-రాంనరేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here