Home News ‘ప్రేమ’ అంటే?

‘ప్రేమ’ అంటే?

0
SHARE

– సామవేదం షణ్ముఖశర్మ

తాను ప్రేమించింది తనకు దక్కకుండా పోయిందని – ఆమె ముఖంపై యాసిడ్ పోసిన దుర్మార్గుడు!
తన ప్రేమను అంగీకరించలేదని – ఒక అమాయకురాలిని హతమార్చిన నరరూప రాక్షసుడు!
పెద్దలు కాదన్నారని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు!
తాను కోరినవాడు కాక, మరొకరు లభించినందుకు ఆత్మహత్య చేసుకున్న వనిత!
మరొకరి కాపురంలో నిప్పులు పోసిన యువతి!
– ఇవి ఇంచుమించు అనునిత్యం వినవచ్చే వార్తలు!

ఎడతెరపిలేని ’ఎపిసోడ్ల సీరియల్స్’ విషసర్పాల వేల కోరలు!!
స్త్రీ పురుష సంబంధాలలో ధర్మసూత్రం తెగడం చేత, నిబద్ధతలో పవిత్రత లోపించడం చేత – భారతీయ సమాజంలో చెలరేగుతున్న అమానుష చర్యలు!

వీటికి మన సనాతన ధర్మ సాహితిలో ఉన్న పరిష్కారం ఏమిటి?
స్త్రీ పురుష సంబంధం ఒక చిత్రమైన అంశం. దీనిపై ఆధారపడి ధర్మాధర్మాలు వర్ధిల్లుతాయి. అందుకే ఈ సంబంధం పైననే రాజ్యాలు, హింసలు, కథలు, కావ్యాలు పుట్టి పెరుగుతున్నాయి. పరస్పరాకర్షణతో కూడిన కామం ’ప్రేమ’ అనే పేరుతో వివిధ పోకడలతో ప్రపంచవ్యాప్తంగా గాథలుగా ప్రసిద్ధిచెందినది. ఈ బంధంలోని పవిత్రత, అపవిత్రత – అనేవి ధర్మపరిమితుల బట్టి నిర్దేశించాలి.

మన ప్రాచీన పురాణ గ్రంథాలలో ప్రేమగాథలు లెక్కలేనన్ని, దైహిక కామం మాత్రమే ప్రేమలోని అంశం కాదు. మానసికమైన అనురాగం, దృఢమైన అనుబంధం, ఒకరి క్షేమం కోసం ఒకరి త్యాగం – ఉత్తమ ప్రేమలోని అంశాలు, వీటితో కూడిన దైహిక కామం పవిత్రమైనదే. స్త్రీ పురుష కామ సంబంధంపైనే మానవ సమాజాభివృద్ధి ఆధారపడి ఉంది. హితకరమైన ధార్మిక సంతానోత్పత్తికి – ’దాంపత్యధర్మం’ అనే గొప్ప వ్యవస్థను ఆవిష్కరించింది మన సంస్కృతి. ధర్మపు హద్దులలోని ప్రేమ మహోన్నతమైనది.

వివాహానంతరం అన్యోన్య ప్రేమయే ప్రధానమైనది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులది ప్రేమతత్త్వమే, సీతారాముల తత్త్వమూ ఇదే. రురు-ప్రమద్వరలు, నల దమయంతులు, సావిత్రీ-సత్యవంతులు, శకుంతలా-దుష్యంతులు, వీరందరివీ ప్రేమ కథలే. అయితే ఇవి వికృతమైనవి కాక, ధర్మబద్ధమై జీవితపు విలువల్ని విస్మరించనివి కనుక ’దివ్యం’గా భాసిస్తున్నాయి. ప్రమద్వర పాము కరచి మరణించగా, రురుదు విలపిస్తాడు. తన తపశ్శక్తి చేత తిరిగి ఆమెను బ్రతికిస్తాడు. తన ఆయువులో కొంత ధారపోయడం చేత ఆమెను బ్రతికించుకోగలిగాడు. దేవతలు తనను వరించినప్పటికీ, తాను నలునే ప్రేమించిన కారణంగా వారిని ప్రార్థించింది దమయంతి. సర్వాత్మనా నలుడే తనకు వరుడని భావించింది. దేవతలు కరుణించి వారికి వివాహం చేశారు. చక్కని వారి దాంపత్యంలో విధి వక్రించి, కలిపురుషుని ప్రభావం చేత విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. సంపదలను కోల్పోయి ఎడబాటుకి గురయ్యారు. కానీ దమయంతి తన ప్రేమ బలంతో భర్తను కాపాడగలిగింది.

సత్యవంతుడు ఏడాది లోపల మరణిస్తాడని తెలిసినప్పటికీ, సావిత్రి మనస్సు అతనికే అంకితం చేసినందున అతనినే వివాహమాడింది. తన తపస్సుతో అతనిని జీవింపజేసింది. మృత్యువునే జయించింది. స్వచ్ఛమైన ప్రేమకి భగవంతుని సహాయం ఉంటుందని దీని ఆంతర్యం. శకుంతలను చూడగానే ప్రేమభావం కలిగినప్పటికీ, ’ఈమె తనకు తగిన క్షత్రియ కన్య కనుకనే తనకీమెపట్ల ప్రేమ కలిగి ఉంటుందని’ భావించిన దుష్యంతుడు ఆమె వివరాలు తెలుసుకుంటాడు. ఇది ధర్మసంహితమైన ప్రేమయే అని నిశ్చయించి, తన ధర్మానికి తగినట్లుగా వివాహమాడాడు. ఆపై శాపవశాత్తూ విస్మృతి ఏర్పడినా శకుంతల పట్టుదలతో వారి ప్రేమ జయించింది.

ఇలాంటి కథలు ధార్మిక వాజ్ఞ్మయంలో చాలా ఉన్నాయి. అయితే ఆ ప్రేమ కథలను ఆదర్శంగా చూపించడం మానివేసి, ఉద్రేక స్వభావాలతో జీవితం విలువలను తెలియని అపరిపక్వ మనోవికారాలనే – గొప్ప ప్రేమకథలుగా చిత్రించడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. వీటి ప్రభావం సమాజంపై పడింది. సీతారాముల సంబంధం దివ్యమైనది. అయితే తనదికాని సీతను రావణుడు కామించడం అధర్మమైనది.

హద్దులు దాటిన కామాన్నే ’ప్రేమ’ అనడం దోషం, పెద్దల్ని క్షోభపెట్టి, సంప్రదాయపు మూల్యాలను నష్టపరచి కేవలాకర్షణతో కలసిన ప్రేమ కథలు వైఫల్యాలను పొందడం అధిక సంఖ్యలోనే కనిపిస్తున్నాయి.”నా ప్రేమను కాదన్నందుకు హింసించాను – చంపుతాను’ అనే ’అసురబుద్ధి’కి ప్రేమ పదమే కూడదు. అదే అసురకామం.

’ధర్మవిరుద్ధం కాని ప్రేమ నా స్వరూపం’ అని భగవానుని మాట (గీత). అధర్మకామం రాక్షసం. తనను వలచని దానిని తాను కామించడం మహాపాపం. అంబాంబికాలనే బాలికలను స్వయంవరవేళ జయించి తెచ్చిన భీష్ముడు, అంబ మరొకరిని వరించిందని తెలిసి, ’అన్యపురుషలగ్నమైన మనస్సు’ (ఇతరులను వలచిన మనస్సు) కలదానిని మరొక వివాహం చేయరాదని, విడిచిపెట్టాడు. ఆ తరువాతి కథ వేరే సంగతి.

మరొకరి సొమ్ము అయిన స్త్రీని హింసించడం నాశన హేతువు. సీతను చెరబట్టిన రావణుడు కూడా ’యాసిడ్ పోయడం’ లాంటి నీచకృత్యాలు చేయలేదు. అయినప్పటికీ ఆమెను బాధపెట్టినందుకు సమూల నాశనాన్ని పొందాడు.

ప్రేమపేరుతో హత్యలు, ఆత్మహత్యలు అధికం కావడం – సామాజిక రుగ్మతలు ఎంతగా బలీయమయ్యాయో చాటి చెప్తోంది. విద్యార్థి దశనుండే ప్రాచీన ధర్మాల విలువలను, మానవ సంబంధాలలోని నైతికతను, సంప్రదాయాల ఔన్నత్యాన్నీ, జీవితం గొప్పతనాన్నీ – చాటిచెప్పే పద్ధతి ఉన్నప్పుడు యువతలో ఈ మనోవికారాలుండవు. ఇందులో తల్లిదండ్రులకీ, ఉపాధ్యాయులకీ బాధ్యత ఉంది. బాల్యం నుండే రామాయణ, భారతాది కథలని -ధార్మిక కోణంలో చెప్పి, జీవితం కన్నా గొప్పది ఏదీ లేదని బోధించాలి. మానవుడు సాధించవలసిన ఎన్నో ఔన్నత్యాలున్నాయి. వాటిముందు ఈ కామ సంబంధాలు అత్యల్పమైనవి. రావణుడు, కీచకుడు, సైంధవుడు – వంటి అసురపాత్రలు స్త్రీ కామనతో, అనుచితంగా ప్రవర్తించి సర్వనాశనమైన ఉదాహరణలు.

వారిని ’ప్రేమికులు’ అనరు. స్త్రీ పట్ల గౌరవం కలిగేలా సంస్కారాలను ఆదినుంచే అందించాలి. ప్రాచీన గ్రంథాలను మతగ్రంథాలుగా భావించి, వాటినుండి జీవితపాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేయని కారణంగా ఈ దుస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం ధనార్జనే లక్ష్యంగా పిల్లల్ని తీర్చిదిద్దుతూ, వికృత మానసిక ధోరణుల కల్పి కథలను కళలుగా ఆదరిస్తున్న కారణంగా ఈ మానసిక రుగ్మతలు ప్రబలుతున్నాయి. దాంపత్య ధర్మబద్ధమైన ప్రేమయే ఆదర్శం.

ఆకర్షణ జనితమై, విలాస ప్రాధాన్యమైన ప్రేమలు వ్యక్తులకీ, సమాజానికీ కూడా హానికరాలు.ఈ పరమ సత్యాన్ని గ్రహించేలా యువతరాన్ని తీర్చిదిద్దాలి. విద్యావ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, మాధ్యమరంగ, మేధావివర్గం, కూడా ఈ ధార్మిక దృక్పథాన్ని వ్యాప్తం చేయగలిగినప్పుడే – ఆరోగ్యవంతమైన భావితరం ఏర్పడుతుంది.

ఋషిపీఠం సౌజన్యంతో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here