Home News భారత్ బంద్ లో జరిగిన హింస వెనుక హస్తం ఎవరిది ?

భారత్ బంద్ లో జరిగిన హింస వెనుక హస్తం ఎవరిది ?

0
SHARE

పద్మావత్‌ సినిమా విషయంలో కాంగ్రెస్‌ మద్దతుతో పనిచేసిన కరణీ సేన ఉద్యమ సమయంలో ఒక యువకుడు కనిపించాడు. అప్పుడు అతను ‘క్షత్రియుడు’. తలకి ‘కాషాయ రిబ్బను’ కట్టుకున్నాడు. అదే యువకుడు ఏప్రిల్‌ 2 భారత బంద్‌లో పాల్గొన్నాడు. ఇప్పడు అతను ‘దళితుడు’. తలకి నీలం రంగు రిబ్బను కట్టుకున్నాడు. అంటే ఎవరో కావాలని అల్లర్లకు పాల్పడ్డారన్నది సుస్పష్టం.

‘త్వరలో దేశమంతటా దళిత-దళితేతర వివాదాలపై పెద్ద ఎత్తున ఘర్షణలు జరగబోతున్నాయి. హింస చెలరేగబోతోంది’. ఆరు నెలల క్రితం జాతీయ రాజకీయాలను నిశితంగా అధ్యయనం చేస్తూ, దేశమంతటా పర్యటించే ఒక విశ్లేషకుడు చెప్పిన మాట ఇది. సరిగ్గా ఆరు నెలల తరువాత ఏప్రిల్‌ 2 నాడు ఉత్తర భారతదేశమంతటా ఎస్‌.సి., ఎస్‌.టి. అత్యాచారాల నిరోధ చట్టం 1989పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాల పేరిట హింస చెలరేగింది. తొమ్మిది మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఎన్నో రైళ్లు రద్దయ్యాయి.

ఈ గొడవలు ముందే జరుగుతాయని ఊహించినట్టుగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టు నేతలు, సోకాల్డ్‌ వామపక్ష మేధావులు, సోషల్‌ మీడియా వీరులు ట్వీట్ల వర్షం కురిపించి ఎప్పట్లాగే బిజెపిని, ఆరెస్సెస్‌ ను తిట్టేశారు. విమర్శలు వెల్లువెత్తించారు. రాహుల్‌ గాంధీ సైతం అత్యంత వేగంగా ట్విట్టర్‌ కామెంట్లతో బిజెపిదే తప్పని, బిజెపి, ఆరెస్సెస్‌లు దళిత వ్యతిరేకులని తీర్పు చెప్పేశారు. ఒక వర్గం మీడియా ‘దళితులు బిజెపికి దూరమౌతున్నారా?’ అంటూ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది.

చట్టాన్ని నీరుగార్చే ప్రసక్తే లేదు : కేంద్రం

ఎస్‌.సి., ఎస్‌.టి. చట్టం విషయంలో సుప్రీం చెప్పిన తీర్పు విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని నీరుగార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాలను సవాలు చేస్తూ అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. నిజానికి ఎస్‌.సి., ఎస్‌.టి. చట్టం క్షేత్ర స్థాయి అమలు విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ చట్టాన్ని నీరుగార్చడం సరైనది కాదన్న విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. అయినప్పటికీ కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతుతో కొన్ని సంస్థలు న్యాయస్థానం ఆదేశాలకి వ్యతిరేకంగా భారత్‌ బంద్‌కి పిలుపునిచ్చాయి. ఆ బంద్‌ను హింసాత్మకం అయ్యేలా శాయశక్తులా కృషి చేశాయి. దీని వెనుక బిజెపి వ్యతిరేక రాజకీయ శక్తులు ఉన్నాయన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఉదాహరణకు ఇక్కడ ఇచ్చిన ఫోటోను చూడండి. ఈ రెండు ఫోటోల్లో ఉన్నది ఒకే యువకుడు. పద్మావత్‌ సినిమా విషయంలో కాంగ్రెస్‌ మద్దతుతో పనిచేసిన కరణీ సేన ఉద్యమ సమయంలో ఇదే యువకుడు కనిపిం చాడు. అప్పుడు అతను ‘క్షత్రియుడు’. తలకి ‘కాషాయ రిబ్బను’ కట్టుకున్నాడు. అదే యువకుడు ఏప్రిల్‌ 2 భారత బంద్‌ లో పాల్గొన్నాడు. ఇప్పడు అతను ‘దళితుడు’. తలకి నీలం రంగు రిబ్బను కట్టుకున్నాడు. అంటే ఎవరో కావాలని అల్లర్లకు పాల్పడ్డారన్నది సుస్పష్టం.

ఆ వేగాలను, ఆవేశాలను కాస్సేపు పక్కన బెట్టి కొన్ని విషయాలను ఆలోచిద్దాం. గతేడాది ఏప్రిల్‌లో హఫింగ్‌ టన్‌ పోస్ట్‌ మాజీ డిప్యూటీ ఎడిటర్‌ శివమ్‌ విజ్‌ వామపక్ష అనుకూల వెబ్‌ సైట్‌ ‘స్క్రోల్‌ డాట్‌ ఇన్‌’ లో ఒక పోస్టును పెట్టారు. అందులో ‘ఉదారవాదులు (వామపక్ష కుహనా సెక్యులర్ల ముద్దుపేరు) బిజెపి వల నుంచి ఎప్పుడు బయటపడతారు?’ అని ప్రశ్నించాడు. ఇక ‘హిందూ- ముస్లిం’ మాటలు మాట్లాడటం మానేయండి. అది బిజెపి ఆరెస్సెస్‌కే లాభాన్ని చేకూరుస్తుంది. ఇప్పడు మనం కులం గురించి మాట్లాడాలి. కుల పోరాటాల అధారంగా మాత్రమే మనం బిజెపిని ఎదుర్కోగలం అని వాదించాడు. ఈ విజ్‌ ఎవరో దేశంలో చాలా మందికి తెలియదు. కానీ ఆయన వాదనను సీనియర్‌ జర్నలిస్ట్‌ శేఖర్‌ గుప్త సమర్థించారు. ఆ వెనువెంటనే కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సమర్థించారు. సరిగ్గా ఇదే సమయానికి పాకిస్తాన్‌ సెనేట్‌ కూడా భారత్‌లో దళిత-దళితేతర వివాదాలను సృష్టించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. దీనిని 13 సభ్యుల కమిటీ ముసాయిదాలో పేర్కొన్నారు.

నకిలీ కథనాలు

ఇటీవలి కాలంలో ఉన్నట్టుండి దళితులపై దాడుల నకిలీ కథనాలు పత్రికల్లో వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒక దళిత కుటుంబాన్ని పోలీసులు వివస్త్రలను చేశారని వార్త వచ్చింది. తరువాత ఆ వార్త అబద్ధమని తేలింది. ఆ తరువాత ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వెబ్‌ సైట్‌లో ఇద్దరు దళిత మహిళలను రేప్‌ చేయాలని ఖాప్‌ పంచాయతీ ఆదేశించిందని పేర్కొన్నది. కానీ దీనిపై కథనం ప్రసారం చేసేందుకు బిబిసి అక్కడకు వెళ్తే అది నిజం కాదని తెలిసింది. ఆ తరువాత రాజపుత్రులు కొందరు దళిత బాలురను హత్య చేశారనే కథనం కొన్ని ఛానెళ్లలో ప్రసారమైంది. కానీ తరువాత ఇదీ అబద్ధమని తేలింది. ఉత్తరప్రదేశ్‌లో మరో వార్త ఇలాగే ఒకరోజంతా రాజ్యం చేసింది. దాని ప్రకారం ఒక దళితుడు దేవాలయంలో ప్రవేశించినందుకు అగ్రవర్ణాల వారు చంపేశారట. ఆ తరువాత తేలిందేమిటంటే ఒక తాగుబోతు అతడిని వేరే వివాదంలో కొట్టి చంపేశాడు. కానీ నిజం కాళ్లకు చెప్పులు తొడుక్కునే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుంది. ఈ సూత్రం ప్రకారం టివి చానెళ్లు చర్చలు నిర్వహించి, తీర్పులు కూడా ఇచ్చేశాయి. తరువాత వార్త అబద్ధం అని తేలగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్‌ చుప్‌.

ఇలాంటి కథే గుజరాత్‌లోని లింబోదరా గ్రామంలోని దిగంత మాహేరియా అనే దళిత యువకుడి గురించి వచ్చింది. అతను మీసాలు పెంచుకున్నందుకు అగ్రవర్ణాల వారు చంపేశారని వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని ఏకంగా గుజరాత్‌ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాడు. మూడు రోజుల తరువాత తేలిందేమిటంటే ఒక ‘స్వచ్ఛంద సంస్థ’ డబ్బిచ్చి దిగంత మహేరియా చేత ఈ మాటలు చెప్పించింది. ఈ అబద్ధాలకు జెఎన్‌యు జాతీయవాద వ్యతిరేక వామపక్ష విద్యార్థి నేత షెహ్లా రషీద్‌ వంటి వారు సైతం వత్తాసు పలికారు.

పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందంటే ఉత్తరప్రదేశ్‌లో పలు చోట్ల బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటనలు జరిగాయి. ఇవన్నీ ఎవరో కావాలనే చేయించారన్నది సుస్పష్టం. ప్రతి చిన్న విషయాన్నీ వివాదం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. బాబాసాహెబ్‌ భీమారావ్‌ రాంజీ అంబేద్కర్‌ పేరులో రాంజీ అన్న పదాన్ని కూడా వివాదంగా మార్చే ప్రయత్నాలు జరిగాయి.

ఏప్రిల్‌ రెండున జరిగిన అల్లర్లు కూడా ఈ కోవకు చెందినవేనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎస్‌.సి., ఎస్‌.టి. చట్టాన్ని నీరుగార్చమని కోరడం లేదు. బిజెపి అసలు కోరడం లేదు. అయితే వీటిని వివాదంగా మార్చి, హింస చెలరేగేలా చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.

విభజించే ప్రయత్నం : దత్తాత్రేయ హోసబళె

రెండు వారాల క్రితం ఆరెస్సెస్‌ సహసర్‌ కార్యవాహ దత్తాత్రేయ హోసబళె జాగృతికి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో చెప్పిన విషయాలు గమనార్హం. -‘దురదృష్టవశాత్తూ రాజకీయ స్వార్థాల కోసం హిందూ సమాజ విరోధులు హిందూ సమాజాన్ని కులాల పేరిట విభజించే ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ మన సమాజంలో కుల వివక్ష, అస్పృశ్యత ఇప్పటికీ ఉంది. ఈ విషయాన్ని మనం కాదనలేము. గత అనేక శతాబ్దాలుగా ఎందరో మహాపురుషులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ దీనినుంచి లబ్ది పొందాలనుకోవడం నేరం. కానీ ఇది జరుగుతోంది. ఇటీవలి నాలుగైదేళ్లలో జరిగిన సంఘటనలు క్రమేపీ తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్న హిందూ వ్యతిరేక సంస్థలు, భారత వ్యతిరేక శక్తులు కులాన్ని ఉపయో గించి విభేదాలను సష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఋజువు చేస్తున్నాయి. షెడ్యూల్డు కులాలు, తెగల మధ్య ఒకరిపై ఇంకొకరిని ఉసిగొల్పుతున్నాయి’.

అనేక సందేహాలు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సుప్రీంకోర్ట్‌ తన ఆదేశాలను పునః సమీక్షించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన తరువాత కూడా అల్లర్లు చెలరేగడం పలు సందేహాలకు తావిస్తోంది. ముఖ్యంగా హింస బాగా చెలరేగిన ప్రాంతాలలో ఇతర మతవర్గానికి చెందినవారు కూడా ఆయుధాలతో కనిపించడం, గుజరాత్‌కు చెందిన దళిత నాయకుడు, ఇటీవల శాసనసభకు ఎన్నికైన నాయకుడి అనుచరులు ఆయుధాలతో వీధుల్లో భయభ్రాంతులు సృష్టించడానికి ప్రయత్నిస్తూ మీడియా కళ్ళకు చిక్కడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. అలాగే ఉత్తర్‌ ప్రదేశ్‌లో బి.ఎస్‌.పి.కి చెందిన మాజీ ఎమ్మెల్యే యోగేశ్‌ శర్మను మీరట్‌లో అల్లర్లకు ప్రధాన కుట్రదారుగా గుర్తిస్తూ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చాలాచోట్ల ఆందోళనకారులకు తాము అసలు ఎందుకు రోడ్లపైకి వచ్చామన్న సంగతి కూడా తెలియదంటే అపోహలు, పుకార్లు ఏ స్థాయిలో వ్యాపించాయో అర్ధం చేసుకోవచ్చు. ఎస్‌.సి., ఎస్‌.టి. చట్టంలో కొన్ని మార్పులు చేయాలని సుప్రీంకోర్ట్‌ చెపితే కేంద్రం ఏకంగా ఎస్‌.సి., ఎస్‌.టి.లకు కల్పిస్తున్న రిజర్వేషన్లు రద్దుచేయనుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారమే ఆందోళనలు అంత తీవ్ర స్థాయికి చేరడానికి కారణమంటున్నారు. చాలాచోట్ల ఆందోళనకారులు ‘వోట్‌ హమారా, హక్‌ తుమ్హారా – నహి చలేగా నహి చలేగా’ అంటూ నినాదాలు చేశారు.

ఒకప్పుడు బీహార్‌లో ఎన్నికలు గెలవడానికి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన పార్టీ ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. సమాజంలో కొన్ని కుల సముదాయాలు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలను పొందుతున్నాయని, తాము కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పరిమితమయ్యామని దళితులలో ప్రచారం చేయడం ద్వారా లాలూ అధికారంలోకి వచ్చారు. దళితులలో తమకు అన్యాయం జరుగుతోందన్న భావనను రెచ్చగొట్టడం ద్వారా రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారం సాధించవచ్చని ఆశిస్తున్న కొన్ని పార్టీలు మళ్ళీ ఇలాంటి ప్రచారానికి పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక చట్టంలో కొన్ని మార్పులు చేయాలని సుప్రీంకోర్ట్‌ చెపితే రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని ప్రచారం చేయడం వెనుక ఈ వ్యూహం కనిపిస్తోంది.

హింసను రెచ్చగొట్టే ఇలాంటి ప్రయత్నాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. మరోవైపు అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి. క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం దళిత, దళితేతర విభేదాలను సృష్టించే ప్రయత్నాలను వమ్ము చేయాల్సిన అవసరం ఉంది.

తీర్పుతో సంఘ్‌కు సంబంధం లేదు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి – భయ్యాజి జోషి
File photo – Bhaiyyaji Joshi

ప్రతి చిన్న విషయానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు సుప్రీంకోర్ట్‌ తీర్పు కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుట్రలో భాగమేనంటూ నిందారోపణలు చేశాయి. దళితులకు అన్యాయం చేయడానికి చేసిన కుట్రలో ఇది భాగమని ఆరోపించాయి. ఈ వివాదానికి ఆరెస్సెస్‌తో ముడిపెట్టాలని చూడటం హాస్యాస్పదం.

ఈ విషయాన్ని ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ్‌ భయ్యాజి జోషి స్పష్టంగా ఖండించారు. ఆయన ప్రకటన సారాంశం ఇది.

‘ఎస్‌.సి., ఎస్‌.టి. అత్యాచార (నిరోధక) చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా హింస చెలరేగడం దురదష్టకరం. సర్వోన్నత న్యాయస్థానపు తీర్పును అడ్డంపెట్టుకుని సంఘ్‌పై దుష్ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిరాధారమైనది, ఖండించదగినది. సర్వోన్నత న్యాయస్థానపు ఈ తీర్పుతో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌కు ఎలాంటి సంబంధం లేదు.

కులం ఆధారంగా ఎలాంటి వివక్ష, అణచివేత ఉండరాదని సంఘ్‌ మొదటినుంచి చెపుతూ వస్తున్నది. ఇలాంటి వివక్ష, అణచివేతలను నిరోధించే చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలి. సర్వోన్నత న్యాయస్థానం ఈ చట్టం విషయంలో వెలువరించిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్‌ ధాఖలు చేయాలని నిర్ణయించడం సరైన చర్య.

ఇలాంటి పరిస్థితిలో సమాజంలో పరస్పర ప్రేమ, విశ్వాసం పెంపొందే విధంగా ప్రయత్నించాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మేధావులకు, ఆలోచనాపరులకు విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ప్రజలు కూడా పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మకుండా ఒకరిపట్ల మరొకరు స్నేహభావాన్ని నిలుపుకోవాలని కోరుతోంది’.

ఎస్‌.సి., ఎస్‌.టి. వేధింపుల (నిరోధక) చట్టం

కులం పేరిట సమాజంలో వివక్ష, అవమానాలకు గురవుతున్న వర్గాలకు రక్షణ కల్పించడం కోసమే ప్రభుత్వం ఈ ఎస్‌.సి., ఎస్‌.టి. చట్టాన్ని తెచ్చింది. ఇటువంటి అమానవీయ ధోరణులను తొలగించడానికి 1955లో పార్లమెంట్‌ ‘అంటరానివారిపై నేరాల నిరోధక చట్టం’ ను ఆమోదించింది. ఆ తరువాత దీనికే 1976లో ‘పౌరహక్కుల చట్టం’గా పేరు మార్చారు. అయితే చట్టం అమలు అనుకున్న రీతిలో అమలు కాకపోవడం, ఎస్‌.సి., ఎస్‌.టి.ల సామాజిక, ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడకపోవడంతో 1989లో ప్రస్తుతం అమలులో ఉన్న ‘ఎస్‌.సి., ఎస్‌.టి. వేధింపుల నిరోధక చట్టం’ గా రూపొందించారు. కులం పేరున ఇతరులు ఎస్‌.సి., ఎస్‌.టి.లపై సాగించే దూషణలు, వేధింపులు, దాడులు, అత్యాచారాలను అడ్డుకోవడమే ఈ చట్ట ప్రధాన లక్ష్యం. ఈ చట్టానికి మరింత పదును పెడుతూ 2015లో కొన్ని సవరణలు చేశారు. శిరోముండనం, మీసాలు తొలగించడం వంటి అమర్యాదకర చర్యలను కూడా వేధింపులుగానే పరిగణిస్తూ చట్ట పరిధిలోకి తెచ్చారు.

ఈ చట్టం ప్రత్యేకత ఏమిటంటే దీని కింద కేసు నమోదు చేస్తే వెంటనే అరెస్టులు చేసి, ఆ తరువాత రిమాండుకు పంపుతారు. ఇది చాలా కీలకమైన నిబంధన. నిందితులకు జామీను కూడా లభించదు. వేధింపులను పూర్తిగా అరికట్టడానికి ఈ కఠినమైన నిబంధనను చట్టంలో చేర్చారు.

సుప్రీం కోర్ట్‌ సూచించిన మార్పులు ఏమిటి ?

ఎస్‌.సి., ఎస్‌.టి.లపై వేధింపులను అరికట్టేందుకు ఉద్దేశించిన చట్టం దుర్వినియోగ మవుతోందని, కొన్ని సందర్భాలలో వ్యక్తిగత, ఇతర చిన్న కారణాలకే ఈ చట్టాన్ని ఆశ్రయిస్తున్నారనే ఫిర్యాదుల మధ్య సుప్రీంకోర్ట్‌ చట్టంలో కొన్ని మార్పులను సూచించింది.

‘నిర్దోషులైన ప్రభుత్వోద్యోగులను బెదిరించేందుకు, ప్రైవేటు వ్యక్తులపై కక్ష తీర్చుకు నేందుకు, స్వప్రయోజనాలను పరిరక్షించుకు నేందుకు’ తరచుగా ఈ చట్టాన్ని దిర్వినియోగం చేస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా అమాయకులపై తప్పుడు కేసులు పెట్టడానికి చట్టాన్ని ఉపయోగిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. అమాయకులను ‘నిందితులుగా’ నిలబెట్టడం చట్ట ఉద్దేశ్యం కాదని, వేధింపుల నిరోధక చట్టం కుల భావనలను పెంచి పోషించేదిగా ఉండ కూడదని, అలా జరిగితే అది సమాజ సమైక్యతకు, రాజ్యాంగ విలువలకు విఘాతంగా మారుతుందని అభిప్రాయపడింది. ఈ నేపధ్యంలో మార్చ్‌ 20న జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం చట్టంలోని అరెస్టు, బెయిల్‌ మంజూరుకు సంబంధించిన నియమాలకు కొన్ని సవరణలు సూచించింది.

వాటి ప్రకారం చట్టం కింద నేరం చేసినట్లు ఆరోపిస్తూ ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ సేవకులపై కేసు నమోదైనప్పుడు వారి నియామకాధికారులు లేదా ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి ఉంటేనేగానీ అరెస్ట్‌ చేయడానికి వీలులేదు. అలాగే ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు అయినప్పుడు సంబంధిత జిల్లా సీనియర్‌ పోలీసు అధికారి అనుమతించిన తరువాతే అరెస్ట్‌ చేయాలి.

చట్టం కింద ముందస్తు జామీను తీసుకునేందుకు వీలేలేదన్న నిబంధనకు కూడా సడలింపు చేసింది. ఆరోపణలు దురుద్దేశంతో గానీ, మరేదైనా కారణంతో గానీ చేసినవని ప్రాథమిక దర్యాఫ్తులో తేలితే ముందస్తు జామీను ఇవ్వకూడదన్న నిబంధన వర్తించదు.

సుప్రీంకోర్ట్‌ సూచించిన ఈ మార్పులు అసలు చట్టాన్నే నిర్వీర్యం చేసేట్లుగా ఉన్నాయని కొన్ని రాజకీయ పక్షాలు, దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

కేంద్రం ప్రతిస్పందన ఏమిటి ?

ఎస్‌.సి., ఎస్‌.టి. చట్టానికి సుప్రీంకోర్ట్‌ సూచించిన మార్పుల పట్ల దళిత సంఘాలు, వర్గాలలో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమ తీర్పును పునఃసమీక్షించుకోవాలని కోరుతూ కేంద్రం కోర్ట్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. మార్పులు చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై పునరాలోచించాలని కోరింది. కోర్టు తీర్పు రాజ్యాంగంలోని అధికరణం 21ని ఉల్లంఘిం చేలా ఉందని అభ్యంతరం చెప్పింది. చట్టంలోని పాత నిబంధనలను యధాతథంగా కొనసాగ నివ్వాలని కోరింది. ఈ విషయంలో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడించారు.

మరోవైపు కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని, పునఃసమీక్షించాలని కోరుతూ ఎస్‌.సి., ఎస్‌.టి. సంస్థల అఖిల భారత సమాఖ్య పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసర ప్రాతిపదికన వెంటనే విచారణకు చేపట్టాలన్న సమాఖ్య విజ్ఞప్తిని మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది.

– రాకా సుధాకరరావు

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here