Home News ముస్లిమ్‌ వేర్పాటువాద ఆలోచనను కల్పించిన వ్యక్తిని చారిత్రక మహా పురుషుడుగా ఎవరు అభిమానిస్తున్నారు?

ముస్లిమ్‌ వేర్పాటువాద ఆలోచనను కల్పించిన వ్యక్తిని చారిత్రక మహా పురుషుడుగా ఎవరు అభిమానిస్తున్నారు?

0
SHARE

అలీగఢ్‌ ముస్లిమ్‌ విశ్వవిద్యాలయం లేకపోతే, బహుశా, నేడు పాకిస్థాన్ వుండేది కాదు. హిందువులు, ముస్లింలు రెండు భిన్న జాతులని ప్రవచించిన సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్ ద్విజాతి సిద్ధాంత ‘దార్శనికత’ లేనట్లయితే, దేశ విభజన కారక, పాకిస్థాన్‌ భావ సృష్టికి మూలమైన అలీగఢ్‌ ముస్లిమ్‌ విశ్వవిద్యాలయమూ వుండేది కాదు.

అలీగఢ్‌ ముస్లిమ్‌ విశ్వవిద్యాలయం (ఏఎమ్‌యూ), భారత ఉపఖండంలో ముస్లిమ్‌ వేర్పాటువాద పితామహుడు సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ 200వ జయంత్యుత్సవాలు గత నెల 17న మనదేశంలో జరిగాయి. ఈ జయంత్యుత్సవాల సందర్భంగా ‘లౌకికవాద’ ప్రహసనం బాగా ప్రదర్శితమయింది. సర్‌ సయ్యద్‌ ‘గుణగణాల’ను ఉగ్గడిస్తూ, దేశానికి ఆయన అజరామర ‘సేవల’ను కొనియాడుతూ పలు వార్తాపత్రికలు వ్యాసాలు ప్రచురించాయి. ఏఎమ్‌యూలో ప్రణబ్‌ ముఖర్జీ (మాజీ రాష్ట్రపతి) సర్‌ సయ్యద్‌ స్మారకోపన్యాసం వెలువరించారు. సర్‌ సయ్యద్‌ ‘ఆధునిక భారత ద్రష్ట’ అని ప్రణబ్‌ అభివర్ణించారు. ఆయన స్థాపించిన ఏఎమ్‌యూపై కూడా ప్రణబ్‌ ప్రశంసలను వర్షించారు. ‘భారత జాతీయవాదం, భారతీయ విలువల’కు ఏఎమ్‌యూ ఒకఉత్కృష్ట ఉదాహరణ’ అని ప్రణబ్‌ అన్నారు.

సర్‌ సయ్యద్‌ను ఒక ‘చారిత్రక మహా పురుషుడు’గా గౌరవిస్తున్న భారత్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌, మహమ్మద్‌ అలీ జిన్నాలకు అటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తోంది?

పాకిస్థాన్‌ ఆధ్యాత్మిక సంస్థాపకులుగా సర్‌ సయ్యద్‌, ఇక్బాల్‌, జిన్నాలు అసంఖ్యాక ప్రజల పూజలందుకొంటున్నారు. పాకిస్థాన్‌ ఆవిర్భావానికి ఈ త్రయమే ప్రధాన కారకులని పాకిస్థానీ పాఠశాల పాఠ్య గ్రంథాలలో అభివర్ణిస్తున్నారు. పాక్‌ పత్రిక ‘ఎక్సప్రెస్‌ ట్రిబ్యూన్‌’లో సర్‌ సయ్యద్‌, ఇక్బాల్‌లపై పర్వేజ్ హూద్‌ బోయ్‌ (పాక్‌ అణు శాస్త్రవేత్త) రాసిన వ్యాసంలో ఆ ఇద్దరి వ్యక్తిత్వాలతోను పలు ఉమ్మడి అంశాలున్నాయని పేర్కొన్నారు. ఇరువురూ సర్‌ బిరుదాంకితులని పర్వేజ్‌ పేర్కొన్నారు. ఇరువురూ బ్రిటిష్‌ సామ్రాజ్యానికి సేవలు (సర్‌ సయ్యద్‌ 1888లోను, ఇక్బాల్‌ 1923లోను) అందించారని ఆయన పేర్కొన్నారు. ఇరువురూ సంప్రదాయ మత నేపథ్యాల వచ్చిన వారే అని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌ తన విలక్షణ అస్తిత్వాన్ని చాటుకోవడానికై దేశ విభజనకు పూర్వపు మహానాయకులు గాంధీ, నేతాజీ, భగత్‌ సింగ్‌ల పేర్లను ఏ ప్రభుత్వ భవనానికీ పెట్టలేదు. అయితే పాకిస్థాన్‌ భావజాల ప్రభవ ప్రాభవాలకు సర్‌ సయ్యద్‌ అందించిన తోడ్పాటును నిత్యం గుర్తుచేసుకోవడానికై డజన్లకొద్దీ ప్రభుత్వ భవనాలకు ఆయనపేర నామకరణం చేశారు.

ఇక్బాల్‌, జిన్నాలు జాతీయవాదులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం బ్రిటిష్‌పాలకులతో కలిశారు. భారత్‌లో ముస్లింలు అధికంగా వున్న ప్రాంతాలతో పాకిస్థాన్‌ను ఏర్పాటుచేయాలని ఇక్బాల్‌ ఆకాంక్షించగా జిన్నా దాన్ని రాజకీయంగా సుసాధ్యం చేశారు. సర్‌ సయ్యద్‌ తన ప్రజా జీవితంలో మొదటినుంచీ ద్విజాతి సిద్ధాంతానికే కట్టుబడి వున్నారు. ముస్లింలకు ఇంగ్లీష్ విద్యను అందించడానికి కృషి చేశారు. ఆంగ్ల విద్యా ప్రభావంతో ముస్లింలు హిందువులకు వ్యతిరేకంగా బ్రిటిష్‌వారితో జట్టు కడతారని ఆయన ఆశించారు. తన ఆశయసాధనలో ఆయన సఫలమయ్యారు.

సర్‌ సయ్యద్‌ ఒక భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చారు. 1838లో ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగిగా చేరారు. 1867లో జడ్జి అయ్యారు. 1876లో ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితంలోకి ప్రవేశించి ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొన్నారు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సమరం కాలంలో ఆయన బ్రిటిష్ సామ్రాజ్యానికి పూర్తి విధేయు డుగా వున్నారు. పలువురు యూరోపియన్ల ప్రాణాలు కాపాడారు. బ్రిటిష్‌ పాలకుల విశ్వాసాన్ని పొందారు. 1869 ఏప్రిల్‌ 1న ఆయన తన కుమారుడితో కలిసి ఇంగ్లాండ్‌ వెళ్ళారు. అదే ఏడాది ఆగస్టు6న బ్రిటిష్‌ ప్రభుత్వం సయ్యద్‌ కు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. బ్రిటిష్‌ వారితో ఆయన సంబంధాలు పరస్పర ప్రయోజనకరమైనవని రుజువయ్యాయి. 1887లో లార్డ్‌ ఢఫరిన్‌ (భారత్‌ వైస్రాయి) సర్‌ సయ్యద్‌ను సివిల్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడుగా నియమించారు. ఆ మరుసటి సంవత్సరం అలీగఢ్‌లో ఆయన ‘యునైటెడ్‌ పేట్రియాటిక్‌ అసోసియేషన్‌’ను స్థాపించారు. బ్రిటిష్‌ వారితో రాజకీయ సహకారాన్ని పెంపొందించడం, బ్రిటిష్‌ ప్రభుత్వంలో ముస్లింలకు మరింత భాగస్వామ్యం కల్పించడం ఈ సంఘం లక్ష్యాలుగా సయ్యద్‌ ప్రకటించారు. సయ్యద్‌కు తొలుత ‘ఖాన్ బహదూర్‌’ బిరుదునిచ్చారు. ఆ తరువాత 1898లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనకి సర్‌ బిరుదునిచ్చింది. ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడుగా బ్రిటిష్‌ సామ్రాజ్ఞికి విధేయుడుగా వున్నందుకు ఆయనకు ‘నైట్‌ కమాండర్ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

మన కాలంలో కశ్మీర్‌ అబ్దుల్లాల వలే సర్‌ సయ్యద్‌ కూడా రెండునాల్కల ధోరణితో మాట్లాడతారు. సందర్భాన్ని బట్టి, శ్రోతలను బట్టి ఆయన మాట్లాడేవారు. అయితే హిందువులు, ముస్లింల మధ్య అంతరాన్ని మరింతగా పెంపొందించి, తన సహ మతస్థులు, బ్రిటిష్ వలసపాలకులకు మధ్య సంబంధాలను పటిష్ఠం చేయాలన్నదే ఆయన ఎజెండా. ఈ ఎజెండాకే సర్‌ సయ్యద్‌ తన జీవిత పర్యంతం కట్టుబడివున్నారు. 1888 మార్చి 16న మీరట్‌లో ఆయన చేసిన ఒక ప్రసంగంలోని భాగాలను ఉటంకించడం సందర్భోచితంగా వుంటుంది. ఆయన ఇలా అన్నారు. ‘ఆంగ్లేయులు, వారి సైనికదళాలు తమ చట్టాలు, పాలనా సంప్రదాయాలు, ఫిరంగులు, ఆయుధాలు సమస్తాన్నీ తీసుకొని భారత్‌ నుంచి వెళ్ళిపోయారనుకోండి. అప్పుడు ఈ దేశపాలకులు ఎవరవుతారు? ఆంగ్లేయులు లేని పరిస్థితుల్లో రెండు జాతులు– ముస్లింలు, హిందువులు అదే సింహాసనం మీద కూర్చోగలరా? అధికారంలో సమానభాగస్వాములు కాగలరా?

ఖచ్చితంగా అవ్వలేరు. వారిలో ఎవరో ఒకరు మరొకరిని ఓడించడం తప్పనిసరి… ఓ నా ప్రియమైన సోదర ముస్లమానులారా, భారతదేశంలో మీరు ఏడువందల సంవత్సరాల పాటు పాలకులుగా వున్నారు. ఇప్పుడు మిమ్ములను పాలిస్తున్న జాతిపట్ల న్యాయ విరుద్ధంగా వ్యవహరించవద్దు. వారు ఎంత నిష్పాక్షికంగా పాలన చేస్తున్నారో ఆలోచించండి. తన పాలనలో వున్న విదేశీ జాతులకు ఇంగ్లీష్‌ ప్రభుత్వం అందిస్తున్న సేవలకు సమానమైన ఉదాహరణ ప్రపంచ చరిత్రలోనే లేదు’. మనం ఏ జాతిలో ఏకం కాగలమో ఆ జాతితో ఏకం కావాలి. ముస్లింలకు క్రైస్తవుల మినహా మరే మతం వారు స్నేహితులు కాలేరని అల్లా అన్నారు. ఏ ముస్లిమూ కాదనలేని మాట ఇది. కనుక మనం ఇంగ్లీష్‌ వారితో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలి. వారి పాలనా పద్ధతులను మనం అనుసరించాలి. తద్వారా వారి పాలన ఈ దేశం సుస్థిరంగా కొనసాగేందుకు తోడ్పడాలి. అధికారం బెంగాలీల చేతుల్లోకి వెళ్ళకుండా చూడాలి’. కాంగ్రెస్‌ నాయకులను ‘బెంగాలీలు’ అనడం ద్వారా కాంగ్రెస్‌ పట్ల తన వ్యతిరేకతను, తిరస్కార వైఖరిని సర్‌ సయ్యద్‌ వ్యక్తం చేశారు. అప్పట్లో భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులలో అత్యధికులు బెంగాల్‌కు చెందినవారే వుండేవారు.

తన జీవితపు ఆఖరి పది సంవత్పరాలలో సర్‌ సయ్యద్‌ ఎటువంటి సంకోచం లేకుండా బ్రిటిష్‌ వలసపాలకుల పక్షం వహించారు. కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. పాకిస్థాన్‌ ఆవిర్భావంలో ఆయన మేధో శిశువు అలీగఢ్‌ ముస్లిమ్‌ విశ్వవిద్యాలయం ఒక నిర్ణయాత్మక పాత్ర వహించింది. నిజానికి జిన్నా, 1941 నాటికే ఈ వాస్తవాన్ని గుర్తించారు. తన ఉద్యమానికి ఏ ఎమ్‌యు విద్యార్థుల నుంచి లభిస్తున్న తోడ్పాటు గురించి మాట్లాడుతూ అలీగఢ్ ముస్లిమ్‌ విశ్వవిద్యాలయం ‘పాకి స్థాన్‌ ఆయుధశాల’ అని ఆయన అభివర్ణించారు. 1941 ఆగస్టు 31న లియాఖత్‌ అలీ ఖాన్‌ ‘అలీగఢ్‌’ విద్యార్థులతో మాట్లాడుతూ ఇలా అన్నారు: ‘ముస్లిమ్‌ జాతి స్వాతంత్ర్య సమరంలో విజయం సాధించేందుకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రికోసం మేము మీ వైపే చూస్తున్నాము’. ఈ లియాఖత్‌ అలీఖాన్‌ పాకిస్థాన్‌ ప్రథమ ప్రధానమంత్రి. 1954లో ఆగాఖాన్‌ కూడా ‘అలీగఢ్‌’ విద్యార్థులను ఘనంగా కొనియాడారు. ఆయన ఇలా అన్నారు: ‘నాగరిక జాతుల చరిత్రలో ఒక విశ్వ విద్యాలయం, సంబంధిత జాతి మేధో, ఆధ్యాత్మిక పునరుజ్జీవానికి మూల కేంద్రంగా వుండడం కద్దు… అలీగఢ్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. బయటివారి తోడ్పాటు లేకుండా మనం స్వయంగా నిర్మించుకున్న మహా సంస్థ అలీగఢ్‌ ముస్లిమ్‌ విశ్వవిద్యాలయం అని మనం సగర్వంగా చెప్పుకోగలం. ఒక సార్వభౌమిక జాతిగా పాకిస్థాన్‌ ఈ విశ్వవిద్యాలయంలోనే జన్మించిందని కచ్చితంగా భావించవచ్చు’. అలీగఢ్‌ ముస్లిమ్‌ విశ్వవిద్యాలయం లేకపోతే, బహుశా, నేడు పాకిస్థాన్ వుండేది కాదు. హిందువులు, ముస్లింలు రెండు భిన్న జాతులని ప్రవచించిన సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్ ద్విజాతి సిద్ధాంత ‘దార్శనికత’ లేనట్లయితే దేశవిభజన కారక పాకిస్థాన్‌ భావ సృష్టికి మూలమైన అలీగఢ్‌ ముస్లిమ్‌ విశ్వవిద్యాలయమూ వుండేది కాదు.

బల్బీర్‌ పుంజ్‌

(వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు)

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here