Home News కరోనా కల్లోలానికి కారకులు ఎవరు?

కరోనా కల్లోలానికి కారకులు ఎవరు?

0
SHARE

– ఎస్. గురుమూర్తి

రిగ్గా రెండు నెలల క్రితం ఫిబ్రవరి 15వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఒక ప్రకటన చేస్తూ దేశంలోని ఐదో వంతు జిల్లాలలో గత వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించారు. అప్పటి వరకు  రోజుకు 90 వేల వరకు చేరిన కేసులు కాస్త తగ్గుతూ 9 వేలకు  చేరాయి. కానీ ఊహించని రీతిలో ఏప్రిల్ మాసంలో కేసుల్లో ఒకేసారి  పెరుగుదల ప్రారంభమైంది. జాతీయస్థాయిలో అలజడి సృష్టిస్తున్న ఈ విపత్కాల సందర్భంలో ప్రాణవాయువు అందక రోగులు మృతి చెందడం దురదృష్టకరం. ప్రాణ వాయువు ఉత్పత్తి, సరఫరా పై ఒకేసారి మొదలైన చర్చలన్నీ, సహేతుక కారణాలు చూపకపోగా  అర్ధంలేని విశ్లేషణలుగా మిగిలిపోయాయి.  దీనివల్ల ప్రజల్లో కోవిడ్ పై పోరాడే శక్తి సన్నగిల్లింది, నిస్తేజం నిండిపోయింది. ఒకసారి ప్రధానాంశాలు ఎలా మరుగున పడ్డాయో పరిశీలిద్దాం.

లాభార్జనులే ఫిర్యాదుదారులైన వేళ

మొట్టమొదటిగా ఢిల్లీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ప్రాణవాయువు అందక రోగుల మృతి చెందడం జరిగింది. ఈ ఆసుపత్రులన్నీ గత సంవత్సర COVID పరిస్థితుల కంటే ఈ సంవత్సరం COVID  పరిస్థితులలో ఇప్పటికే అధిక లాభాలను ఆర్జించాయి. ఒకరకంగా ఈ ఆసుపత్రుల యాజమాన్యాలు COVID కు ఈ విషయం లో కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ విషయాన్ని గమనించిన అనంతరం నేషనల్ హెరాల్డ్ పత్రిక 20.06.2020 న “Profit in times of Covid-19”  అనే శీర్షికన ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఇందులో కరోనా చికిత్సకు ఢిల్లీలోని ఒక్కొక్క ఆసుపత్రిలో ఒక వారంలో  ఒక్కోరోజుకు బిల్లు 25వేల రూపాయలతో మొదలై ఏడవరోజుకు 12లక్షలకు చేరింది. గత రెండు వారాలుగా ఇలా పెంచాయి. (వీటిలో మళ్ళీ పీపీఈ కిట్లు, మందుల చార్జీలు అదనం). ఈ బిల్లులన్నీ కలిపితే భారత జాతీయ తలసరి ఆదాయానికి సమానం. పోనీ ఇంటి దగ్గర చికిత్స అయినా ఏమన్నా తక్కువ ఉందంటే అది కూడా సుమారు 5700 రూపాయల నుండి మొదలుకొని 21900 రూపాయల వరకు వసూలు చేశాయి. వీటికి వైద్యపరీక్షల చార్జీలు అదనం అని పేర్కొంటూ నేషనల్ హెరాల్డ్ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ లీవ్ పిటిషన్ తో అప్రమత్తమైన  AHPs (Association of Healthcare Providers), FICCI లు బిల్లులపై స్వీయ నియంత్రణ విధించుకునేందుకు అంగీకరించాయి. స్వీయనియంత్రణ  అంటే, AHP  రేట్లు సాధారణ వార్డుకు 15 వేల రూపాయలు దీనికి ఆక్సిజన్ చార్జీలు 5,000 అదనం, ICU బెడ్ అయితే 25 వేల రూపాయలు దీనికి వెంటిలేటర్ చార్జీలు 10000 అదనం. ఇక FICCI వారైతే రోజుకు 17 వేల నుంచి 45 వేల రూపాయల దాకా ఇంకా ఎక్కువగా వసూలు చేశారు. ఆసుపత్రులకు 375 రూపాయల నుండి 500  రూపాయల వరకు ఒక పీపీయి కిట్ దొరికితే దాన్ని రోగులకు 10 నుంచి 12 రెట్లు ఎక్కువగా చేసి అమ్మారు. ఢిల్లీతో పాటు చెన్నై ముంబై వంటి నగరాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని నేషనల్ హెరాల్డ్ పేర్కొంది. ఇంత నిర్వాకం వెలగబెడుతున్న ఈ కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రభుత్వమే   ప్రాణవాయువు  సప్లై చేయాలని అది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు అని పేర్కొంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.  ఒక్కరైనా కార్పొరేట్ హాస్పిటళ్ళు సృష్టించిన ఆక్సిజన్ కృత్రిమ కొరత వల్ల జరుగుతున్న బలవంతపు మరణాల గురించి వివరించారా? మరో ముఖ్యమైన విషయం. ఇలా లాభాలు దండుకున్నఈ కార్పొరేట్ హాస్పిటళ్ళు తమ సొంత ఖర్చులతో అతి తక్కువ పెట్టుబడితో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రాణవాయువు  ఉత్పత్తిపై  ఎలాంటి నిబంధనలు లేవు. ఆక్సిజన్ వాణిజ్యస్థాయిలో నిలువ, వినియోగం పైన కూడా ఆంక్షలు లేవు.  మన దేశంలో మెడికల్ ఆక్సీజన్ వ్యాపారం ప్రభుత్వ నియంత్రణలొ లెదు. దీని ధరలను జాతీయ ఔషధ నియంత్రణ సంఘం (NPPA, National Pharma Pricing Authority)   అనే ఒక స్వతంత్ర సంస్థ మాత్రమే నియంత్రించగలదు. ఈ సంస్థ రసాయనాలు ఎరువుల శాఖ పరిధిలో పనిచేస్తుంది.

ప్రైవేటు ఆక్సిజన్ ఉత్పత్తిదారులు పరిశ్రమలతో, ఆసుపత్రులతో, ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. హాస్పిటల్లో అత్యవసర సమయాల్లో ఎంత ఆక్సిజన్ అవసరమవుతుందో ఆ  సమయంలో ఉత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తారు. ఆక్సిజన్ రవాణా చాలా దూరాభారంతో కూడుకుని ఉన్నది. ప్రత్యేకంగా వేల కిలోమీటర్ల దూరంలోగల ఈశాన్య రాష్ట్రాల ఉత్పత్తి కేంద్రాల నుండి ఢిల్లీ హాస్పిటళ్ళకు చేరాలంటే చాలా సమయం పడుతుంది.  సాధారణ పరిస్థితుల్లో కూడా ప్రాణవాయువు సరైన సమయంలో సరఫరా చేయడానికి ప్రత్యేక ప్రణాళిక అవసరం. ఇంతటి సంక్లిష్ట వ్యవహారంపై గత 10-15 రోజుల్లో ఆసుపత్రుల్లో ముందస్తు తయారీ ఏమాత్రమైనా జరిగినట్లు  మనకు కనబడుతోందా???

కొరత లేదు

రెండో విషయానికి వస్తే మనదేశంలో ప్రాణవాయువు కొరతలేదు. మనము ప్రతి రోజు ఒక లక్ష టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాము. గుజరాత్ లోని ఒక కంపెనీయే ఇందులో ఐదో వంతు ఆక్సీజన్ ఉత్పత్తి చేయగలదు. ఇంత పరిమాణపు ప్రాణవాయువులో కేవలం చాలా నామమాత్రంగా అంటే ఒక్క శాతం మాత్రమే మెడికల్ ఆక్సిజన్ గా ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా మెడికల్ ఆక్సిజన్ వినిమయం 5 నుంచి 6 శాతం మాత్రమే ఉన్నది. ఆక్సిజన్ ద్రవరూపంలో ఉండడంవల్ల దానిని 45 లక్షల విలువగల భారీ ట్యాంకర్లను ఉపయోగించి సరఫరా చేస్తారు. ఇంతటి క్లిష్ట పరిస్థితులలో ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ ధర 300 రూపాయలు మాత్రమే ఉంటే దాన్ని 10 వేలకు పెంచారు. ఇక్కడ లాభాలను ఆర్జించిన కార్పొరేట్ ఆసుపత్రులు  తమ తప్పును ఒప్పుకోకుండా నిందను మరొకరిపై మోపుతున్నారు.

కోవిడ్ మొదటిదశ అనుభవాల తరువాత ఢిల్లీలోని ఆసుపత్రులు తమ సొంత ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని ఉండాల్సింది. ఒక వార్తా కథనం ప్రకారం సాధారణ సమయంలో  240 పడకల ఆసుపత్రి (40 ఐసీయూ పడకలు)  నెలకు ఐదు లక్షల విలువగల ఆక్సీజన్ ను ఉపయోగిస్తుంది. ఇటువంటి ఆసుపత్రి 50 లక్షలు ఖర్చుపెట్టి మంచి Pressure Swing Absorption (PSA) ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కేవలం 18 నెలల్లోనే ఆ పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది. ఢిల్లీలోని ప్రతి ఆసుపత్రికీ ఈ విధంగా ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటుచేసుకోగల సామర్ధ్యం ఉంది.  కానీ ఏ ఒక్క ఆసుపత్రి కూడా ఈ పనిని చేయలేదు. వీరు తమ ప్రాంగణంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు గురించి ఆలోచించకుండా  వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాల నుండి ఆక్సీజను పొందాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సరఫరా చేయడంలోని  ఇబ్బందులను గత సంవత్సరమే కేరళలో గల త్రిసూర్  జూబ్లీ మిషన్ మెడికల్ కాలేజ్ కు చెందిన అనస్తీషియా డిపార్టుమెంటు కు చెందిన డా.చెరిష్ పౌల్, జాన్ పౌల్,  అఖిల్ బసు లు లోకానికి తెలిపారు. ఈ ముగ్గురూ రాసిన పరిశొధన పత్రంలో, భారతదేశ ఆసుపత్రుల్లో ఆక్సీజను సరఫరా వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ.. చాలా హాస్పిటల్లు కేవలం ఒకే చోటునుండి ఒకే ఒక పైపులైన్ ద్వారా ఆక్సీజను సరఫరా చేస్తాయి. దీని బదులు ఆసుపత్రి సామర్థ్యానుసారం అనేక మార్గాల ద్వారా ఆక్సీజను పొందవచ్చు అంటూ స్వంత ఆక్సీజను ప్లాంటులు ఏర్పాటు చేసుకుంటే  ఇది సాధ్యమవుతుంది అని తెలిపారు . ఇది డిల్లీ ఆసుపత్రులకు కూడా వర్తిస్తుంది. కానీ.. ఆసుపత్రులు సొంత ప్లాంటులు ఏర్పాటు చేసుకోవడానికి సుముఖంగా లేవు. వాళ్ళెవరూ కూడా ఈ విపత్కర పరిస్థితులలో ఆక్సీజను సరఫరా నిర్విఘ్నంగా కొనసాగడానికి ప్రయత్నించలేదు. ఈ పని చేయకుండా రోగులను పిండి లాభాలు మాత్రం ఆర్జిస్తూ  ప్రాణవాయువు సరఫరా బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే అంటూ కోర్టుకెక్కాయి. కోర్టులు కూడా ప్రభుత్వానిదే తప్పు అనేసరికి.. ఈ ప్రకటన  కోవిడ్ పై యుధ్ధంలో జరగాల్సిన  అసలు పోరాటాన్ని దారిమరల్చింది. ప్రాణవాయువు సరఫరా సక్రమంగా నిర్వహించుకోలేని ఆసుపత్రులు ప్రభుత్వంపై  నిందమోపాయి.

ఆసుపత్రులు వదిలేసిన 129 ఆక్సీజను ప్లాంట్లు

ఈ సందర్భంలో అందరూ మరిచిపోయిన, మరుగునపడిన కీలక విషయం ఏమిటంటే COVID మొదటి దశలోనే ఇలాంటి ఆకస్మిక అవసరాన్ని ఊహించి మోడీ ప్రభుత్వం 200కోట్లు వెచ్చించి 162 PSA Plants ఏర్పాటు చేసుకోవడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ 162 ప్లాంట్లు  నిమిషానికి 80,500 లీటర్ల ఆక్సీజను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కల్గి ఉన్నాయి. కానీ… దురదృష్టం ఏంటంటే… 162ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతినిస్తే కేవలం దేశవ్యాప్తంగా 33మాత్రమే ఏర్పాటు చేసారు. దీనికి కారకులు ఎవరు??? చాలా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికను అసలు పట్టించుకోనేలేదు. ఒక వార్త ప్రకారం డిసెంబర్ లో ఆర్డర్లు ఇచ్చిన స్థలాల్లో ప్లాంట్ల స్థాపనకు వెళ్ళిన సిబ్బందిని ఆసుపత్రి యాజమాన్యాలు స్థలాభావం అని సాకు చూపి తిప్పిపంపాయి. కేంద్ర ప్రభుత్వపు ఈ దూరదృష్టిని ఏ ఒక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రస్తుతించడంలేదు సరికదా కనీసం ప్రస్తావించడం కూడా లేదు. ఎందుకో మరి???

కొత్త కోవిడ్ సునామి పాత దాని పునరావృతం కాదా?

ప్రస్తుతం కల్లోలం సృష్టిస్తున్న మహమ్మారి పాత వైరస్ కు కొత్త రూపం. ఇది ఊహకందని విధంగా విజృంభిస్తోంది.  మార్చ్ 2021  మొదటి వారంలో మొదలైన కరోనా కొత్త కేసుల పెరుగుదల ఒక నెలలోనే సునామీలా విరుచుకుపడింది. కేవలం ఏడు వారాల్లో బీహార్ లాంటి రాష్ట్రంలో 522 రెట్లు, ఉత్తరప్రదేశ్ లో 399రెట్లు, ఆంధ్రప్రదేశ్ లో 186రెట్లు, ఢిల్లీ, ఝర్ఖండ్ లొ 150 రేట్లు పశ్చిమ బెంగాల్లో 142 రెట్లు, రాజస్థాన్ లో 120 రెట్లు  కేసులు నమోదయ్యాయి. ఇలా ఎవరి అంచనాలకు అందని విధంగా విపత్తు సునామీలా విరుచుకుపడింది.

జాతీయ సంకల్పం అవసరం

ఈ అనూహ్య విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి జాతీయ సంఘటిత శక్తి, సంకల్ప బలం అవసరం. ఇక్కడ ఎవరూ వాస్తవాన్ని విస్మరించవలసిన అవసరం లేదు.  ఎవరూ ఎవరినీ నిందించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పటికే ఈ కోవిడ్ విపత్కర పరిస్థితిలో సంఘటిత శక్తి లోపం కారణంగా మనం ఎంతో కోల్పోయాం. ప్రతిపక్షాలు కూడా ప్రజల్ని పక్కదారి పట్టించే ధోరణిని మార్చుకోకపోవడం దురదృష్టకరం. ఇది గతంలోనూ కనిపించింది. భారత ప్రభుత్వం అత్యవసర అనుమతి ఇచ్చిన కొవాక్సిన్ టీకా పై ప్రతిపక్షాల అభ్యంతరాలు అనేక వదంతులకు కారణమయ్యాయి. రణదీప్ సుర్జేవాలా, శశిధరూర్, మనీష్ తివారి, జైరాం రమేష్ లాంటి కాంగ్రెస్ నాయకులు కొవాక్సిన్  కు వ్యతిరేకంగా గళం విప్పడం, ఆనంద శర్మ ఐతే ఏకంగా దీన్ని ప్రమాదకారి అనడం, రాజస్థాన్ మినహా ప్రతిపక్షపాలిత రాష్ట్రాలైన పంజాబ్, చత్తీస్ గఢ్, కేరళ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్  లలో రాష్ట్ర ప్రభుత్వాలే ప్రజల మనసుల్లో అనేక సందేహాలు లేవనెత్తాయి. ఈ చర్యలవల్ల టీకా కార్యక్రమం చాలా మందకొడిగా సాగింది. జనవరి నెలలో 33శాతం మంది టీకాకు సిద్దంగా ఉంటే, 40శాతం మంది వేచిచూస్తామని, 16శాతం మంది అసలు టీకా వేసుకోమనీ అన్నారు. అదే మార్చ్ కల్లా 57శాతం మంది టీకాకు మొగ్గుచూపగా, కేవలం 6శాతంమంది మాత్రమే వద్దన్నారు.3నెలల విలువైన సమయం పోయిన తరువాత    ప్రజల్లో కాస్త నమ్మకం పెరిగి రోజుకు 30లక్షల మంది టీకా తీసుకుంటున్నారు. ఇలా నెలకు 9కోట్లమంది టీకా తీసుకుంటున్నారు. ప్రజలు సరైన ఆలోచనతోనే ఉన్నారు. కానీ మన నాయకులే ప్రక్కదారి పట్టిస్తున్నారని అర్థం అవుతోంది. వీరు మన రక్షాకవచాన్ని మనమే తొలగించుకునేలా చేస్తున్నారు. ఇక్కడ ఎన్నో కేసులు నమోదు అవుతున్నా, Google Mobility Data ప్రకారం 78శాతం ప్రజలు సాధారణ జీవనాన్నిసాగిస్తున్నారు. 87శాతం మంది పార్కులకు వస్తూనే ఉన్నారు. 92శాతం మంది ప్రయాణాలు చేస్తూనేఉన్నారు. ఇంకా విచిత్రంగా 120శాతం మంది గత లాక్డౌన్ కంటే ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారు. ఇందులో చాలామంది కోవిడ్ సాధారణ నిబంధనలైన భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటివి కూడా పాటించడం లేదు.

ఇప్పుడు మనముందు అతిపెద్ద సవాలు కరొనా రూపాన నిలిచింది. దీన్ని ఎదుర్కోవడానికి మనలో సంఘటిత శక్తి, సంకల్ప బలం ఉన్నాయా? మనం సమర్థులమేనా???

న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ సౌజన్యంతో…

తెలుగు అనువాదం: యు. రవికుమార్ 

విజ్ఞ‌ప్తి : మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ కింది లింక్ ద్వారా మీ విరాళాలను అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది, DONATE HERE