Home Telugu Articles కేంద్ర ప్రభుత్వం పై చర్చ్, క్రైస్తవ మత సంస్థల వ్యతిరేకత ఎందుకు?

కేంద్ర ప్రభుత్వం పై చర్చ్, క్రైస్తవ మత సంస్థల వ్యతిరేకత ఎందుకు?

0
SHARE
Representative image

కశ్మీర్‌ లోయలో పండిట్‌లపై హింసాకాండ, గోధ్రాలో కరసేవకుల సజీవ దహనం మొదలైన దారుణ ఘటనలకు ఏమాత్రం స్పందించని క్రైస్తవ మత పెద్దలు ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆక్రోశించడానికి కారణమేమిటి? క్రైస్తవ మత విస్తరణకై చట్ట విరుద్ధ మత మార్పిడులను ప్రోత్సహించేందుకు ఆస్కారం లేకుండా చేసినందునే మోదీ సర్కార్‌ను వ్యతిరేకించాలని ఆ పెద్దలు పిలుపునిచ్చారా?

మతపరమైన భావోద్వేగాలు చాలా సున్నితమైనవి. ఇటీవల ఇద్దరు క్రైస్తవ మత పెద్దలు తమ మతస్థులను ఉద్దేశించి ఇచ్చిన లిఖిత సందేశాలు పత్రికల పతాక శీర్షికలకు ఎక్కాయి. ఈ ఇరువురు పెద్దలలో ఒకరు ఢిల్లీ బిషప్‌ కాగా మరొకరు గోవా బిషప్‌. వీరి సందేశాలలోని మూడు ప్రథానాంశాలు: (అ) భారత రాజ్యాంగం ముప్పులో ఉన్నది; బహుత్వ వాద విలువలు, సంప్రదాయాలు ప్రమాదంలోపడ్డాయి; మైనారిటీలు (ముఖ్యంగా క్రైస్తవులు), ఆదివాసీలు, దళితులు అమితంగా హింసాకాండకు గురవుతున్నారు.

బిషష్‌లు తమ సందేశాత్మక ప్రకటనలలో ఎవరినీ పేరు పెట్టి ప్రస్తావించలేదు. అయితే వారి సూచిత లక్ష్యం ఎవరన్నది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఢిల్లీ, గోవా బిషప్‌లు తమ మతస్థులకు రాసిన లేఖలలో ఆ పెద్దలు ఎవరినీ పేరు పెట్టి ప్రస్తావించలేదు. మాటల పటాటోపాన్ని పక్కనుంచితే 2019 సార్వత్రక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటమికి చురుగ్గా కృషి చేయాలని క్రైస్తవ మతస్థులకు ఆ రెండు లేఖలు విజ్ఞప్తి చేశాయి. ప్రజాస్వామ్యం, బహుతావాదం, మేధో స్వాతంత్ర్యం, మత స్వేచ్ఛ, లౌకికవాదం, సామాజిక న్యాయం, మానవ హక్కులు మొదలైన పదాలు ఆ రెండు లేఖలలోనూ పదే పదే ప్రస్తావితమయ్యాయి.

సరే, ఒకసారి ఇటీవలి చరిత్రలోకి వెళదాం. 1989–91 సంవత్సరాల మధ్య కశ్మీర్‌ లోయలో కశ్మీరీ పండిట్‌లకు వ్యతిరేకంగా కనీ వినీ ఎరుగని స్థాయిలో హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఇస్లామిక్‌ సిద్ధాంతాల స్ఫూర్తితో స్థానిక ముస్లింలు పాకిస్థాన్‌ నుంచి అందుతున్న ఆర్థిక ప్రోత్సాహం, ఆయుధ మద్దతుతో ఈ దురాగతాలు, అమానుషత్వాలకు పాల్పడ్డారు. పండిట్‌ మహిళలపై మూకుమ్మడి అత్యాచారాలు జరిపారు. పండిట్‌ల దేవాలయాలను ధ్వంసం చేశారు. ఇదంతా చాలా నిర్భయంగా జరిగింది

తమను ఎవరూ ఏమీ చేయలేరన్న భరోసాతోనే దుండగులు ఈ అకృత్యాలకు పాల్పడ్డారు. యాదృచ్ఛికంగా గాక, ఒక పథకం ప్రకారం జరిగిన హత్యలివి. ఈ బీభత్సాలకు తల్లడిల్లిపోయిన కశ్మీర్ పండిట్‌లు తరతరాలనుంచి తమ పూర్వీకులకు దూరంగా, తమకు ప్రేమాస్పద జన్మభూమి అయిన కశ్మీర్‌లోయ నుంచి వేరే రాష్ట్రాలకు, ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్ళిపోయారు. అసంఖ్యాక పండిట్‌లు ప్రాణాలు కోల్పోయారు. మిగతావారు ఆత్మగౌరవాన్ని రక్షించుకొనేందుకు ఆస్తులను వదిలివేసి కట్టుబట్టలతో లోయ నుంచి తరలిపోయారు. 2002 ఫిబ్రవరిలో గోధ్రాలో 59 మంది కరసేవకులు సజీవ దహనానికి గురయ్యారు. మరి ఈ విషాదాలు చర్చ్‌ పెద్దల అంతరాత్మను కదిలించాయా? మానవతను మట్టుబెట్టిన ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా వారు జాగరూకులయ్యారా?

చర్చ్‌ ఎప్పుడైనా పాలకులకు నిరసన తెలిపిందా? 1919 ఏప్రిల్‌ 13న సంభవించిన జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతలు, ఆ తరువాత పంజాబ్‌లో భారతీయులపై పోలీసుల మితిమీరిన ఆగడాల సందర్భంలో సైతం చర్చ్‌ మౌనంగానే ఉండిపోయింది కదా! ఆ నీతి బాహ్య పరిణామాలపై ఏ మాత్రం నిరసన వ్యక్తం చేయకుండా సంయమనం పాటించిన చరిత్ర చర్చ్‌దే సుమా. ఆనాడు పంజాబ్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వ సైనిక చర్యను సమర్థించిన మిషనరీలు ఉన్నారు.

హిందూ భారతదేశంతో క్రైస్తవ మత తొలి సంబంధాలు మన ప్రస్తుత రాజ్యాంగం ఉనికిలోకి రావడానికి 1600 సంత్సరాల పూర్వం నాటివి. క్రీస్తు శకం తొలినాళ్ళలో ఇరాన్ బద్ధ శత్రువు అయిన రోమ్‌ సామ్రాజ్యం క్రైస్తవాన్ని స్వీకరించింది. దీంతో ఇరాన్‌లోని క్రైస్తవుల రాజభక్తిపై అనుమానపు నీడలు పరచుకున్నాయి. ఇరానియన్ క్రైస్తవులకు వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆ యాతనల నుంచి బయటపడేందుకుగాను ఆ క్రైస్తవులు ఇరాన్‌ నుంచి పరారై మలబార్‌ తీరానికి వచ్చి ఆశ్రయం పొందారు. ఆ తరువాత సిరియా, ఆర్మీనియా నుంచి కూడా అనేక మంది క్రైస్తవులు మలబార్‌కు శరణార్థులుగా వచ్చారు. మలబార్ రాజులు, సామాన్యులు ఎవరూ ఈ శరణార్థుల మతం గురించి ఎటువంటి ఆరా తీయలేదు. శరణు కోరి వచ్చిన వారిని ఎటువంటి మినహాయింపులు లేకుండా ఆదరించారు. కాలక్రమంలో ఈ శరణార్థులు సిరియన్ క్రైస్తవులుగా తమకొక స్వతంత్ర, విలక్షణ గుర్తింపును సముపార్జించుకున్నారు.

మరి హిందూ–క్రైస్తవ సంబంధాలలో ‘అసహనం’ ఎప్పుడు జొరబడింది? క్రీ.శ.1542లో సెయింట్ ఫ్రాన్సిస్‌ జేవియెర్‌ గోవాకు వచ్చారు. అవిశ్వాసులు, బహుదేవతారాధకులు, నాస్తికులను కఠినంగా అణచివేయాలన్న ఆదేశం, దాన్ని అమలుపరిచేందుకు అవసరమైన అధికారాలతో ఆయన భారత్‌కు వచ్చారు. దరిమిలా శతాబ్దాల పాటు పోర్చుగీస్ పాలనలో భారతదేశపు పశ్చిమ తీరంలో పెద్ద ఎత్తున మూకుమ్మడి మతాంతరీకరణలు, క్రైస్తవేతరులను హింసించడం సాధారణమైపోయాయి. కేరళలోని సిరియన్‌ క్రైస్తవులు కూడా కేథలిక్‌ చర్చ్‌ మిషనరీ అభిజాత్యాన్ని తప్పించుకోలేక పోయారు. ‘సిరియన్‌ క్రైస్తవులు మత వ్యతిరేకులు, మేకవన్నెపులి లాంటి వారని క్రైస్తవ మత న్యాయాధికారులు భావించారని, ఫలితంగానే పోప్‌ ప్రతినిధులు సిరియన్‌ చర్చ్‌లపై కఠినంగా వ్యవహరించారని’ డాక్టర్ అంబేడ్కర్‌ రాశారు.

ఆ తరువాత గోవా ఆర్చ్‌బిషప్‌గా అలెక్సిస్‌ డి మెనెజెస్‌ నియమితులయ్యారు. క్రైస్తవేతరులను అణచివేయడంలో ఆయన అనుసరించిన క్రూర పద్ధతులు, సాధించిన ఫలితాలు వాటికన్‌ మెప్పును పొందాయని డాక్టర్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

ఐరోపాలో ప్రొటెస్టెంట్‌ క్రైస్తవం ప్రభవిస్తున్న కాలమది. ప్రొటెస్టెంట్‌లను అణచివేయడానికి వాటికన్ చాలా కఠినంగా వ్యవహరించింది. కేథలిక్, ప్రొటెస్టెంట్‌ క్రైస్తవుల మధ్య యుద్ధాలు ప్రజ్వరిల్లాయి. క్రైస్తవ మతంలో సంభవించిన ఈ అంతర్యుద్ధంలో అమాయక క్రైస్తవులు లక్షల సంఖ్యలో హతమయ్యారు. అత్యంత అమానుషమైన పద్ధతులలో కేథలిక్‌లు, ప్రొటెస్టెంట్‌లు పరస్పరం చంపుకున్నారు. ఒకే మతానికి చెందిన భిన్న శాఖలకు చెందిన వారయినప్పటికీ తమ శాఖ ప్రాబల్యాన్ని నెలకొల్పి, సుస్థిరపరచేందుకు ఇరువర్గాలూ ప్రత్యర్థుల పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించాయి.

ఇది చరిత్ర. ఎవరూ చెరిపివేయలేని చరిత్ర. పైగా భగవంతుని పేరిట చోటు చేసుకున్న అమానుష చరిత్ర. మరి ఈ చరిత్రకు కేథలిక్‌ చర్చ్‌ ‘వారసురాలు’. ‘సహనం, లౌకికవాదం’ మొదలైన ఉన్నత విలువల గురించి కేథలిక్‌ చర్చ్‌ ఇప్పటికీ చాలా ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా మాట్లాడుతుంటుంది. భారత్‌ లౌకికవాద దేశం. రాజ్యాంగం నిర్దేశించింది కాబట్టి భారత్‌ ఒక లౌకిక దేశం కాలేదు. సహస్రాబ్దాలుగా భారతీయ సమాజంలో బహుత్వవాద విలువలను ఔదలదాల్చిన హిందూ సంప్రదాయాలు వర్థిల్లుతున్న కారణంగానే స్వతంత్ర భారత రాజ్యాంగం లౌకికవాద రాజ్యాంగమయింది.

ఈ చారిత్రక వాస్తవం మనలను ఈ ప్రశ్న వద్దకు తీసుకువచ్చింది: మోదీ ప్రభుత్వ పాలనతో చర్చ్‌ ఎందుకు తలకిందులవుతోంది? అంతగా కలవరపడడానికి కారణమేమిటి? చట్టవిరుద్ధ మార్పిడులు గతంలో వలే ఇప్పుడు జరగడం లేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే బలవంతపు మత మార్పిడులకు ఇప్పుడు ఎలాంటి ఆస్కారం లేదు. అనేకానేక ప్రభుత్వేతర స్వచ్ఛంద సేవా సంస్థలు (ఎన్‌జిఓలు) వివిధ ముసుగుల్లో చర్చ్‌ కార్యకర్తలుగా పనిచేస్తున్నాయి. విదేశాల నుంచి వస్తున్న నిధులు ఈ అపవిత్రబంధం వర్థిల్లడానికి తోడ్పడుతున్నాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విదేశాల నుంచి దేశం లోకి చట్టవిరుద్ధ నిధుల– ఇవే అనేక అవిశ్వసనీయ ఎన్‌జిఓల మనుగడకు ప్రధానాధారాలు– ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఎన్‌జిఓలకు విరాళాల రూపంలో అందుతున్న విదేశీ నిధులు 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.17,773 కోట్ల నుంచి 2016–17లో రూ. 6,499 కోట్లకు తగ్గిపోయాయి. ఇటీవలి సంవత్సరాలలో చట్టాలను ఉల్లంఘించిన కారణంగా విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం కింద 18,868 ఎన్‌ జి ఓల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మత మార్పిడులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన తమ పథకాల అమలుకు అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయన్న వాస్తవాన్ని చర్చ్‌ గుర్తించింది. మరి మోదీ ప్రభుత్వ పాలనను చర్చ్‌ ఇష్టపడకపోవడంలోనూ, వ్యతిరేకించడంలోనూ ఆశ్చర్యమేముంది?

భారతదేశంలో చర్చ్‌ వ్యవహరిస్తున్న తీరుతెన్నుల పట్ల స్వామి వివేకానంద మొదలు మహాత్మా గాంధీ వరకు ఎంతో మంది ప్రముఖులు తమ తీవ్ర అసంతృప్తిని, చిరాకును వ్యక్తం చేశారు. 1956లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన నియోగి కమిటీ చర్చ్‌ కపట చర్యలు, అనుచిత ప్రలాపాలను బహిర్గతం చేసింది. దరిమిలా చర్చ్‌ తన వ్యూహంలో అనేక ఆవశ్యక మార్పులు చేసుకున్నది. అయితే దాని లక్ష్యాలూ, వాటిని సాధించడానికి అనుసరిస్తున్న పద్ధతులలో ఎటువంటి మార్పు లేదు. ఇతరులకు తాను ఉపదేశిస్తున్న ఆదర్శాలతో ఎటువంటి సంబంధంలేని పద్ధతులనే తన క్రైస్తవ మత విస్తరణ లక్ష్యాల పరిపూర్తికి అనుసరిస్తోంది.

-బల్బీర్‌ పుంజ్‌
(వ్యాసకర్త సీనియర్‌ బీజేపీ నాయకుడు)

(ఈ వ్యాసం మొదట జూన్ 2018లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here