Home News తెలంగాణలో కేవలం ముస్లిం లకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు ఎందుకు?

తెలంగాణలో కేవలం ముస్లిం లకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు ఎందుకు?

0
SHARE
representation image
ముస్లిం వర్గాన్ని సంతోషపెట్టేందుకు, వారి అభిమానాన్ని సంపాదించేందుకు తెలంగాణా ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇతర వర్గాల ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి ప్రభుత్వం పాల్పడుతున్న ఈ సంతుష్టీకరణపట్ల అప్పుడే పలు విమర్శలు వస్తున్నాయి.

విధాన నిర్ణయాలను ప్రకటించేముందు ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే ఆ నిర్ణయాలవల్ల సమాజంలో తాత్కాలిక మైన, శాశ్వతమైన ఇబ్బందులు, నష్టాలు కలిగే ప్రమాదం ఉంటుంది. తెలంగాణా ప్రభుత్వం ఉర్దూను ద్వితీయ భాషగా గుర్తిస్తూ చేసిన ప్రకటన ఇలాంటిదే. ఇదే కాదు ఇస్లామిక్‌ సెంటర్‌ ఏర్పాటు, ముస్లిములకు ప్రత్యేక ఐటి కారిడార్‌ వంటివి భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీయవచ్చును.

 
ఉర్దూ ద్వితీయ భాష
నవంబర్‌ 9న ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉర్దూను ద్వితీయ అధికార భాషగా గుర్తిస్తున్నట్లు ప్రకటిం చారు. వెంటనే 900మంది ఉర్దూ ఉపాధ్యాయుల్ని కూడా నియమిస్తామని, అందుకోసం ప్రత్యేక జిల్లా సెలక్షన్‌ కమిటీ(డిఎస్‌సి)ని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ ఉపాధ్యాయులకు ఉండాల్సిన కనీస అర్హతలను ఉర్దూ అకాడమీ, మైనారిటీ సంక్షేమ విభాగం నిర్ణయిస్తాయని అన్నారు. అత్యంత ప్రాధాన్యతగల అంశంగా పరిగణిస్తూ నియామకాలను 70రోజులలోగా పూర్తి చేస్తామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కీలకమైన వివిధ ప్రభుత్వ విభాగాల్లో 66మంది ఉర్దూ ఆఫీసర్లను కూడా నియమించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఇప్పటి వరకూ మదర్సాలలో ఆధునిక విద్య అందిస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. పైగా ఇవి మతఛాందసత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అటువంటి పాఠశాలలో బోధించే అంశా లను క్షుణ్ణంగా పరిశీలించకుండా వాటి సంఖ్యను బాగా పెంచడంవల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒవైసీ వంటి నాయకులు ఇటువంటి పాఠశాలలో తమకు అనుకూలమైన, తమకు కావలసిన పాఠ్యాంశాల్ని చొప్పించరని చెప్పలేం. నిజాం, మొగలుల గుణగానానికి, చరిత్ర వక్రీకరణకు ఈ పాఠశాలలు బాగా ఉపయోగపడతాయి. 1948లో భారత రాజ్యంలో కలవకుండా నిజాం చేసిన ప్రయత్నాలు, రజాకార్ల అకృత్యాలను అబద్ధాలని, దుష్ప్రచారం అని నిరూపించాలని చాలా ప్రయత్నమే జరుగుతోంది. ఈ పాఠశాలలవల్ల ఆ ప్రయత్నం మరింత బలపడి ముస్లిం వేర్పాటువాదానికి మరో సారి బీజం పడేప్రమాదం ఉందని సామాజిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు మహాత్మా గాంధీ మద్దతు తెలిపిన ఖిలాఫత్‌ ఉద్యమంతో ఊపిరిపోసుకున్న ముస్లిం వేర్పాటువాదం చివరికి దేశవిభజనకు దారితీసిందన్న సంగతి మరచిపో రాదని హెచ్చరిస్తున్నారు. మొదట్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఒవైసీ ఆ తరువాత అందుకు అంగీకరించడానికి కారణం ఏమిటి? ముస్లిములు అధికంగా ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణాలో చేర్చాలన్న తన డిమాండ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఒవైసీ అంగీకారం తెలిపారు.
ఇస్లామిక్‌ సెంటర్‌
హైదరాబాద్‌ శివార్లలో కోకాపేట్‌ దగ్గర అంతర్జాతీయస్థాయిలో ఇస్లామిక్‌ కల్చరల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఇటీవల తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ ఇస్లామిక్‌ సెంటర్‌లో ఏ రకమైన పరిశోధన, అధ్యయనం జరుగుతాయన్నది ఎవరికీ తెలియదు.
ప్రత్యేక పారిశ్రామిక కారిడార్‌
ఇది ప్రస్తుతం కాగితాల్లోనే ఉన్నప్పటికీ 2019 ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం ఎంతైనా ఉంది. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టడానికి తాము సంసిద్ధంగా ఉన్నా మంటూ సౌదీ అరేబియా రాయబారి సౌద్‌ మహమ్మద్‌ అల్‌సాటీ అక్టోబర్‌ నెలలో ప్రకటించారు. ఇలాంటి మతపరమైన పెట్టుబడులు వస్తే రాష్ట్రంలోనే కాక దేశం మొత్తంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిములకు ప్రత్యేక పారిశ్రామికి నడవా ప్రకటిస్తే అది మరిన్ని డిమాండ్లకు దారితీస్తుంది. అటువంటి నడవా కోసం ఉర్దూ చదువుకున్నవారు, ముస్లిం పెట్టుబడిదారులు బాగా అవసరమవుతారు. అప్పుడు ముస్లిములకు ప్రత్యేక సంక్షేమ నిధి కావాలని, ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ అవసరమనే డిమాండ్‌లు తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
మొత్తానికి ముస్లిముల అభివృద్ధి, సంక్షేమం పేరుతో తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు అభివృద్ధిమాట అటు ఉంచి ముస్లిం వేర్పాటువాదానికి, రాష్ట్రంలో వివిధ వర్గాల మధ్య పొరపొచ్చాలకు దారితీసే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
– కుంటి సురేందర్
(లోకహితం సౌజన్యం తో)