Home News భారత వ్యతిరేక వైఖరి లో మార్పు లేకుండా చైనా స్నేహ ప్రతిపాదనలు ప్రతిబంధకాలే

భారత వ్యతిరేక వైఖరి లో మార్పు లేకుండా చైనా స్నేహ ప్రతిపాదనలు ప్రతిబంధకాలే

0
SHARE

చైనా తన సామ్రాజ్యవాద ఆకాంక్షలను త్యజించి, ఇరుగు పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తుందా? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సందిగ్థతకు తావులేని వైఖరి అనుసరిస్తుందా? ప్రస్తుత పరిస్థితులలో ఇవి సాధ్యమేనా? సాధ్యమే అయితే భారత్‌ చైనాతో కలిసి విశ్వనర్తనం చేయగలదు.

దౌత్యంలో స్నేహ ప్రతిపాదనలు సార్థకమైనవేనా? భారత్‌, చైనాలు పరస్పరం ప్రత్యర్థులుగా పరిగణించుకోకుండా ‘కలసి నృత్యం చేయాలని’ చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యి ఇటీవల సూచించారు. పోటీదారైన భారత్‌ పట్ల చైనా సుహృద్భావాన్ని హర్షిస్తూ, ఆ సంఘీభావం పరిపూర్ణంగా వర్థిల్లాలని కోరుకొనేవారు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. ఇందుకొక కారణం ఉన్నది. ఇది, అంటే 21వ శతాబ్ది ‘ఆసియా శతాబ్ది’ గా గణుతికెక్కింది. ‘ఒకే యూరోప్‌’ పురోగమనం నిరుత్సాహకరంగా ఉన్నది. అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరికా యుగం ముగిసినట్టేనన్న జోస్యాలను విశ్వసించక తప్పడం లేదు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశాన్ని క్రమంగా ప్రపంచ బాధ్యతల నుంచి ఉపసంహరిస్తున్నారు. ఆర్థిక, వాణిజ్య రంగాలలో సంరక్షణ విధానాలకు ప్రాధాన్యమిస్తున్నారు. స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రపంచ ప్రథమ స్థానంలో ఉన్న అమెరికాను అధిగమించడానికి ద్వితీయ స్థానంలో ఉన్న చైనా ఆరాటపడుతోంది చైనా అధ్యక్షుడు క్సి జిన్‌ పింగ్‌ తాను జీవితకాలం అధికారంలో ఉండేలా, పాలక కమ్యూనిస్టు పార్టీ చేత రాజ్యాంగాన్ని సవరింప చేయించారు. రష్యాలో అధ్యక్షుడు పుతిన్‌ ఇంతదూరం వెళ్ళలేదు గానీ , ఆయన తిరుగులేని నియంతగా వ్యవహరిస్తున్నారు. జిన్‌పింగ్‌ వలే పుతిన్‌ కూడా జీవిత కాల అధ్యక్షుడుగా పరిణమించే అవకాశాన్ని త్రోసిపుచ్చలేము.

సరే, తన ఇరుగు పొరుగు ఆగ్నేయాసియా దేశాల పట్ల చైనా తన అగ్రరాజ్య అభిజాత్యాన్ని కొనసాగిస్తోంది. బీజింగ్‌ పాలకుల దురాక్రమణ రాజకీయాలు చైనా పెత్తందారీతనాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆగ్నేయాసియా దేశాలు గట్టిగా భావిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలోని దీవుల విషయంలో చైనా అగ్రరాజ్యాధిపత్యాన్ని ఫిలిప్పీన్స్‌ చవి చూస్తోంది. ఆ దీవుల వివాదంలో మూడో దేశ జోక్యానికి బీజింగ్‌ ససేమిరా అంటోంది. ఫిలిప్పీన్స్‌ తనవిగా పేర్కొంటున్న దీవులలో చైనా తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొంది! హైనాన్‌ దీవి విషయంలో వియత్నాంకు బీజింగ్‌ సామ్రాజ్యవాద దురహంకారం అనుభవంలోకి వచ్చింది. చైనా తన సైనిక సదుపాయాలను ఇప్పటికే ఆ దీవికి విస్తరింపచేసింది . దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం చమురు నిక్షేపాల అన్వేషణకు పూనుకోవడం పట్ల బీజింగ్‌ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది.

భారత్‌తో సంబంధాల విషయంలోనూ బీజింగ్ ఎప్పుడూ ఈ ఆధిపత్యవాద విధానాన్నే అనుసరిస్తోంది. భారత్‌లోని ప్రవాస టిబెటన్లకు న్యూఢిల్లీ ఎటువంటి వసతులు కల్పించకూడదని బీజింగ్‌ డిమాండ్‌ చేస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ పై భారత్‌ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి చైనా నిరాకరిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో భారీ లోటుకు భారత్‌ ను బీజింగ్‌ తప్పుపడుతోంది. అయితే చైనాలోని భారతీయ వ్యాపారులకు సరైన సదుపాయాలు కల్గించడానికి నిరాకరిస్తుంది.

వారిపై తీవ్ర ఆంక్షలు విధిస్తోంది. అంతేగాక చట్ట విరుద్ధ లావాదేవీలకు పాల్పడుతున్నారంటూ భారతీయ వ్యాపారులను పలువిధాల వేధింపులకు గురిచేస్తోంది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనే విషయమై న్యూఢిల్లీ– బీజింగ్‌ల మధ్య దశాబ్దాలుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. భారత్‌లో మరిన్ని భూభాగాలపై తమకు హక్కు ఉన్నదని చైనా వాదిస్తోంది. ఉగ్రవాదుల అణచివేతకు తమ సహకారం పూర్తిగా ఉంటుందని బీజింగ్‌ పదే పదే చెప్పుతుంది. అయితే ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ముంబై పై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను కాపాడడంలో పాకిస్థాన్‌కు చైనా పూర్తిగా సహకరిస్తోంది.

న్యూఢిల్లీని వ్యతిరేకించడానికి, భారత్‌ ప్రయోజనాలను దెబ్బతీయడానికి పాకిస్థాన్‌ను చైనా పరోక్షంగా ఉపయోగించుకొంటున్నంతవరకు డ్రాగన్‌ (చైనాకు ప్రతీక), ఏనుగు (భారత్‌కు ప్రతీక) మధ్య నాట్యం జరగడమనేది అసాధ్యం. పాకిస్థాన్‌లో తన సైనిక ప్రయోజనాలను పెంపొందించుకోవడానికై, వాణిజ్యం మిషతో రవాణా సదుపాయాలను అభివృద్ధిపరచడానికి వందలకోట్ల డాలర్లను బీజింగ్‌ వెచ్చిస్తోంది. భారత్‌ నుంచి పాకిస్థాన్‌ స్వాధీనం చేసుకున్న కొన్ని భూభాగాలను తనకు కట్టబెట్టించుకోవడంలో కూడా బీజింగ్‌ సఫలమయింది.

ఈ పరిణామాలేవీ ఇంకెంతమాత్రం రహస్యమైనవికావు. న్యూఢిల్లీలోని ప్రస్తుత ప్రభుత్వం దేశ ప్రజల సహకారంతో చైనా ఆధిపత్య వాదాన్ని సమర్థంగా ఎదుర్కొంటోంది. బీజింగ్‌ పాలకులు ప్రతిపాదించిన ‘వన్‌ బెల్ట్‌, వన్‌రోడ్‌’, ‘సిల్క్‌ రోడ్‌’ ఇత్యాది అంతర్జాతీయ ప్రాజెక్టులలో భాగస్వామికావడానికి న్యూఢిల్లీ తిరస్కరిస్తోంది. చైనా సామ్రాజ్యవాద విస్తరణను ఆడ్డుకోవడానికి భారత్ సమర్థ నాయకత్వాన్ని అందించగలదని ఆగ్నేయాసియా దేశాలు ఆశిస్తున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన ఆసియన్‌ శిఖరాగ్ర సదస్సులోను, ఇటీవల సౌరశక్తి పై జరిగిన సమావేశంలోనూ ఆగ్నేయాసియా దేశాలు తనకు వ్యతిరేకంగా కలసికట్టుగా వ్యవహరించడం బీజింగ్‌ పాలకులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. హిందూ మహాసముద్రంలో చైనా విస్తరణను అడ్డుకొనే లక్ష్యంతోనే ఫ్రాన్స్‌, ఇండియాలు ఇటీవల ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలో భారత్‌–చైనాల మధ్య స్నేహ సంబంధాలు గొప్పగా వర్ధిల్లాయి. ‘భాయ్‌–భాయ్‌’ అనే సుహృద్భావ వాతావరణం ఆ రోజుల్లో రెండు దేశాల ప్రజల మధ్య వెల్లి విరిసింది. అయితే 1962లో భారత భూభాగాలను ఆక్రమించుకోవడం ద్వారా బీజింగ్‌ పాలకులు నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. ఆ రోజులు గతించాయి. కాలం మారింది. న్యూఢిల్లీలోని ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులలోనూ అటువంటి అవమానాలు పునరావృతం కావడానికి అనుమతించబోదు. చైనాతో అడుగడుగునా నిర్మొహమాటంగా వ్యవహరిస్తోంది. చైనా పాలకులు తమ అసలు ఉద్దేశాలను దాచిపెట్టేందుకు ఇచ్చే ఆకర్షణీయమైన నినాదాలను న్యూఢిల్లీ పాలకులు ఇంకెంత మాత్రం విశ్వసించరు. భారత్‌తో నిజంగా సత్ససంబంధాలను బీజింగ్‌ కోరుకొంటున్న పక్షంలో తన భారత్‌ వ్యతిరేక వైఖరిని విడనాడాలి. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ ను ఉపయోగించుకోవడానికి స్వస్తి చెప్పాలి. అప్పుడు మాత్రమే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ మహాశయుడు ఆశిస్తున్న విధంగా భారత్‌ –చైనా కలసికట్టుగా ముందుకు సాగుతాయి.

చైనా పాలకులు ఒక వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. ఒక ప్రజాస్వామ్యదేశంగా భారత్‌ తన ప్రజలకు పటిష్ఠ పాలననందిస్తోంది. జాతీయ ప్రయోజనాల విషయంలో కులమతాలు, భావజాలాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకునే సుదృఢరాజ్య వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు తియ్యని మాటలతో భాతర ప్రజలను గానీ, న్యూఢిల్లీ పాలకులను గానీ ఎవరూ మాయపుచ్చలేరు. భారత్‌ తన రక్షణ పాటవాన్ని వ్యూహాత్మకంగాను, ఆయుధ సంపత్తిపరంగానూ పెంపొందించుకోవడాన్ని సమర్థంగా కొనసాగిస్తోంది. చైనా ఏ క్షణంలో ఎటువంటి సైనిక దుస్సాహసానికి పాల్పడినా పమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సర్వ సన్నధంగా ఉన్నది.

జనాభా పరంగా ప్రపంచంలో రెండు అతి పెద్ద దేశాలుగా ఉన్న భారత్‌, చైనాలు కలసికట్టుగా ముందుకు సాగడమనేది ఆ రెండు దేశాలకే గాక యావత్‌ మానవాళికి మేలు చేస్తుందనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ జనాభాలో ఈ రెండు ఆసియా దేశాల జనాభా మొత్తం 36 శాతంగా ఉన్నది. ఈ ధరిత్రిపై నడయాడుతున్న దాదాపు 800 కోట్ల మంది ప్రజలలో 300 కోట్ల మంది ఈ రెండు దేశాల ప్రజలే. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి మూడో వ్యక్తి చైనీయుడు లేదా భారతీయుడే.

భారత్‌, చైనాల మధ్య సంపూర్ణ శాంతి సామరస్యాలు వర్థిల్లితే ఆసియాలో కోట్లాది ప్రజలు పేదరికం నుంచి బయటపడతారు. ఆ శాంతి సామరస్యాల సాధన ఒక సుందర స్వప్నమే, సందేహం లేదు. మరి చైనా తన సామ్రాజ్యవాద ఆకాంక్షలను త్యజించి, ఇరుగు పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తుందా? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సందిగ్థతకు తావులేని వైఖరి అనుసరిస్తుందా? ప్రస్తుత పరిస్థితులలో ఇవి సాధ్యమేనా? సాధ్యమే అయితే ఆ సుందర స్వప్నం సాకారమవుతుంది. అప్పుడు భారత్‌ చైనాతో కలిసి విశ్వ నర్తనం చేయగలదు.

బల్బీర్‌ పుంజ్‌

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here