Home News ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

0
SHARE
ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి.
అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది.
దేశంలో అస్థిరత పేరిట  విధించిన ఈ ఎమర్జెన్సీ కారణంగా.. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు ఉద్దేశించిన  ఎన్నికల ప్రక్రియ నిర్వీర్యమైంది. సామాజిక స్వేచ్ఛ అణిచివేయబడింది. ప్రజల ప్రాథమిక హక్కులు హరింపబడ్డాయి. దేశ భద్రత పేరిట రాజకీయ నాయకుల అరెస్టులు జరిగాయి.  పత్రికలు వార్తలు ప్రచురించాలంటే ప్రెస్ అడ్వైజర్  ముందస్తు అనుమతి తప్పనిసరి అయ్యింది. దేశవ్యాప్తంగా ఒక భయానక వాతావరణం ఏర్పడింది.
ఎమర్జెన్సీని నిరసించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మీద ఇందిరా గాంధీ ప్రభుత్వం నిషేధం విధించింది. వేలాది మంది స్వయంసేవకులు జైలుపాలయ్యారు.
ఈ సమయంలో ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం  ఆర్.ఎస్.ఎస్ నడిపిన ఉద్యమంలో జైలు పాలైన సంఘ్ అనుబంధ సంస్థల మహిళా కార్యకర్తల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అఖిల భారతీయ విద్యార్థి  పరిషత్  కార్యకర్త అయిన అంజలీ దేశ్ పాండే. ఆ సమయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పుణె తదితర ప్రాంతాల్లోని కళాశాల విద్యార్థులు అనేకమంది ఉద్యమంలో పాల్గొనడానికి ముందుకు వచ్చారు. అంజలీ దేశ్  పాండే నేతృత్వంలోని ఒక విద్యార్థినుల సమూహం, సెయింట్ మీరా కళాశాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఆ సమయంలో ఆమెతో పాటు విద్యార్థినులందరినీ అరెస్ట్ చేసి, మళ్ళీ విడుదల చేశారు. అయినా పట్టు వీడని అంజలి దేశ్ పాండే, మరోసారి నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో ఇందిర ప్రభుత్వం ఆమెను నెలరోజులు పాటు యెరవాడ జైలులో నిర్బంధించింది.
విచిత్రం ఏమిటంటే, అప్పటికే ఎరవాడ జైలు 250 మంది మహిళా ఉద్యమకారిణులతో కిక్కిరిసిపోగా, వారిలో అత్యధికులు  ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్థల కార్యకర్తలే. 3 నెలల శిక్ష అనంతరం ఆమెను జైలు నుండి విడుదల చేశారు. ఆనాడు తనతో పాటు జైలుకు వెళ్లివచ్చిన ఉద్యమకారుల్లో జయవంతి బెన్ మెహతా, సుమతీబాయి సుకాలీకర్, పరిమళ దండావతే, అహల్యా రంగేకర్ తో పాటు  అనేక మంది ఉద్యమకారుల్ని  అంజలీ దేశ్ పాండే ఇప్పటికీ స్మరించుకుంటారు.
ప్రజాస్వామ్య పునరుద్ధరణే పరమావధిగా ఆర్.ఎస్.ఎస్ ఉద్యమాన్ని నిర్మిస్తోందని పేర్కొన్న ‘ది ఎకానమిస్ట్’, ఉద్యమంలో 23,015 మంది MISA (Maintainance of Internal Security Act), DIR (Defence of India Rules) చట్టాల కింద జైలుపాలు కాగా, అందులో 16,386 మంది  ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు ఉన్నట్లు పేర్కొంది. వీరిలో జనసంఘ్, రాష్ట్ర సేవికా సమితి, విశ్వహిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  కార్యకర్తలున్నారు. శాంతియుత సత్యాగ్రహ ఉద్యమంలో 44965 మంది అరెస్ట్ కాగా అందులో 35310 మంది పైన పేర్కొన్న సంస్థల కార్యకర్తలున్నారు. ఈ సత్యాగ్రహ ఉద్యమంలో  అరెస్ట్ అయిన  ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తల్లో 2424 మంది మహిళలు ఉండటం గమనార్హం. వీరిలో అత్యధిక శాతం మహిళలు మహారాష్ట్ర ప్రాంతం వారు.