Home News ప్రపంచ శాంతి భారత్ వల్లనే సాధ్యం – డా. మోహన్ భాగవత్

ప్రపంచ శాంతి భారత్ వల్లనే సాధ్యం – డా. మోహన్ భాగవత్

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ గణతంత్ర దినోత్సవ సందేశం

గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ కాన్పూర్ లోని నారాయణ సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయపతాకం స్పూర్తి, ప్రేరణలకు ప్రతీక అన్నారు. ఈ పతాకం మధ్యలో ధర్మ చక్రం ఉంటుందని, ధర్మమంటే ఏదో ఒక పూజా పద్దతి మాత్రమే కాదని ఆయన అన్నారు. ధర్మంలో పూజాపద్దతి కూడా భాగం కావచ్చని వివరించారు. ధర్మం అందరినీ కలుపుతుందని, సమాజపు భౌతిక, మానసిక ఉన్నతికి బాటలు వేస్తుందని, అలాగే సర్వమంగళకరమైన సమాజానికి మూలం ధర్మమేనని డా. భాగవత్ అన్నారు. పతాకంలో పైన ఉండే కాషాయ రంగు నిరంతర కర్మను తెలుపుతుంది. మనం కాషాయ రంగును గౌరవిస్తాము. మధ్యలో ఉండే తెల్లని రంగు ప్రాచీన కాలం నుండి మన దేశంలో ప్రజలు అనుసరిస్తున్న సర్వ శాంతి, తను మన పవిత్రతలకు ప్రతీక. ఇక ఆకుపచ్చ లక్ష్మి దేవికి సంకేతం. అంటే సమృద్ధికి ప్రతీక. మనస్సు, బుద్ధిల సంపన్నతను సాధించడంతో పాటు క్రోధ, మదమాత్సర్యాలను వదిలిపెట్టాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ చెడు గుణాలను మనం పరిహరించాలనుకుంటాము. ఎవరికీ మనం కీడు తలపెట్టం. అందరి సుఖసంతోషాలను కోరుకుంటాము. సర్వే భవన్తు సుఖినః సర్వేసంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ అన్నది మన ధ్యేయం. శాంతి, సద్గుణాలను పూర్తిగా నాశనం చేయడానికి అనేక జాతి వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి.  ప్రపంచమంతా వీటివల్ల కష్టపడుతోంది. ఇలాంటి శక్తులను పరాజితం చేయగలిగిన శక్తి భారత్ కు ఉందని ప్రపంచానికి తెలుసు. జనజీవనాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది, తద్వారా భారత్ ను తిరిగి విశ్వగురువుగా నిలపాలనే సంకల్పం నేడు మనం తీసుకుంటాము. గణతంత్ర దినోత్సవాన్ని మనం ఎప్పుడూ మరచిపోము. వందల ఏళ్ల బానిసత్వం తరువాత మనకు స్వాతంత్ర్యం వచ్చింది. కేవలం రాజకీయ స్వాతంత్ర్యమేకాదు సామాజిక, ఆర్ధిక స్వాతంత్ర్యాలకు గుర్తుగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. నేడు బాలురు, యువత, వృద్ధులు  అనే తేడా లేకుండా అంతా ఆనందంగా గడుపుతారు. మనం విడివడిగా, వేరువేరుగా ఉన్నాం కాబట్టి ఒకటి కావాలని కాదు. ప్రాచీన కాలం నుంచి ఈ దేశం ఒకటిగానే ఉంది. మనమంతా భారతమాత పుత్రులం. మన పూర్వజులు ఒకరే. బయటకు కనిపించే వివిధత్వం మన ప్రాచీనమైన ఏకత్వానికి వ్యక్తీకరణ మాత్రమే. జాతి, పూజా పద్ధతి మొదలైనవాటన్నింటికి అతీతంగా మనమంతా సోదరులం, సోదరీమణులం. జాతీయపతాకం మనకు మార్గదర్శి, ప్రేరణదాయి అని డా. మోహన్ భాగవత్ తన ఉపన్యాసంలో వివరించారు.

ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ సంస్థల అధ్యక్షుడు శ్రీ కైలాష్ నారాయణ్ శాలువా, పతకంతో సర్ సంఘచాలక్ ను సత్కరించారు. సంస్థ కార్యదర్శి అమిత్ నారాయణ్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమతి పూనం తివారీ కార్యక్రమ నిర్వహణ చేశారు. సర్ సంఘచాలక్ తో పాటు పూర్వ ఉత్తర క్షేత్రం, కాన్పూర్ ప్రాంతానికి చెందిన పదాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.