Home News నీ బలిదానం వృథా పోదు

నీ బలిదానం వృథా పోదు

0
SHARE

‘లాలా ఉన్నారా?’ ఇద్దరు యువకులు తలుపు తట్టారు.

అర్ధరాత్రి, అపరాత్రి ఎవరో ఒకరు తలుపు తట్టడం, ఆయన్ను సాయం అడగటం ఆ ఇంటి యజమానికి అలవాటే. లాయరుగా సంపాదించిన ప్రతి రూపాయీ ఆయన పేదల కోసమే ఖర్చు చేసేవారు. ఎవరు ఏ సమయంలో వచ్చి సాయ మడిగినా ఆయన చిరునవ్వుతో చేయగలిగింది చేస్తాడు. అందుకే ఆయన్ను అంతా ‘లాలా’ (అన్నయ్య) అంటారు.

శ్రీనగర్‌లో ఆయన పేరు తెలియని వారుండరు. అందరికీ ఆయన తలలో నాలుక. చిరునవ్వుతో అందరినీ పలకరించడం ఆయన స్వభావం. అయితే దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారికి మాత్రం ఆయన సింహస్వప్నం. జాతీయవాదమే ఆయన ఊపిరి. కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్టాలన్న వేర్పాటువాదానికి ఆయన వ్యతిరేకం. దాన్ని ఆయన దాచుకోలేదు.

తలుపు తీశాడు.

ఆ ఇద్దరూ ఒక్క ఉదుటున తుపాకీ తీసి ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన రక్తం మడుగులో నేలకొరిగాడు.

క్షణాల్లో శ్రీనగర్‌లోని హబ్బాకడల్‌లో ‘లాలాని చంపేశారు’ అనే వార్త అడవిలో అగ్గిలా పాకేసింది.

అది సెప్టెంబర్‌ 14, 1998. ‘లాలా’ అని కశ్మీరీ పండితులే కాక, కశ్మీరీలందరూ పిలుచుకునే ఆయన పేరు పండిట్‌ టికాలాల్‌ టాప్లూ. ఆర్‌.ఎస్‌.ఎస్‌. స్వయంసేవక్‌. భారతీయ జనతాపార్టీ జమ్మూ కశ్మీర్‌ ఉపాధ్యక్షుడు. కశ్మీరీ హిందువులకు తిరుగులేని నాయకుడాయన.

టికాలాల్‌ 1930లో జన్మించారు. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం చదివి, ఆ తరువాత 1957 నుంచి లాయర్‌గా పనిచేశారు. 1971లో హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. అనేక ఉద్యమాలు కూడా నిర్వహించి అరెస్టయ్యారు. ఎమర్జెన్సీలో సత్యాగ్రహం చేసి జైలు పాలయ్యాడు కూడా. పేద క్లయింట్ల దగ్గర నుంచి టికాలాల్‌ డబ్బు తీసుకునేవారు కాదు. హిందువులు, ముస్లింలు అన్న తేడా ఆయన ఏనాడూ చూపించలేదు.

ఉగ్రవాదం ఉవ్వెత్తు సునామీలా కశ్మీర్‌ లోయను ముంచెత్తుతున్న సమయంలో నిశ్చలంగా, నిబ్బరంగా జాతీయవాద గళాన్ని వినిపించిన నిర్భయ వీరుడు టికాలాల్‌ టాప్లూ. జిహాదీ ఉన్మాదంతో ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న తొలి నాయకుడాయన. ఆయన చనిపోయిన తరువాత కశ్మీరీ పండితులు దిక్కు తోచక, ప్రాణ భయంతో కశ్మీర్‌ లోయను విడిచి స్వదేశంలో శరణార్థులయ్యారు.

టికాలాల్‌ టాప్లూ జీవితమంతా పేదరికంలో గడిచింది. ఆయన ఆలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో చదువుకున్నారు. శ్రీనగర్‌లోనే లాయర్‌గా ప్రాక్టీసు చేసేవారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌ కార్యకర్తగా కశ్మీర్‌ లోయ అంతటా పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేవారు. అన్ని పనులను ముందుండి నడిపించే వారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన ఎనలేని సేవలందించారు. టాప్లూ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు స్వయంగా లాల్‌ కృష్ణ అద్వానీ వచ్చారు.

టికాలాల్‌ టాప్లూ బలిదానం వథా పోయిందా? లేదు. ఆయన త్యాగం కశ్మీరీ పండితుల సమస్యలను దేశమంతటా ఎత్తి చూపింది. తమది స్వతంత్ర పోరాటమని కల్లబొల్లి కబుర్లు చెప్పుకుని కాలం గడిపే ఉగ్రవాదులను నిలదీసింది. వారు జవాబు చెప్పుకోలేక ఇప్పటికీ పక్క చూపులు చూస్తూనే ఉన్నారు. మొత్తం భారతదేశం టికాలాల్‌ టాప్లూ బలిదానంతో మేల్కొంది. కుహనా సెక్యులరిస్టు కూహకాలను పక్కనబెట్టి జాతీయవాద శంఖాన్ని పూరించింది. నేటికీ కశ్మీరీ పండితులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనను తలచుకుంటూ ఉంటారు.

నేడు కశ్మీర్‌ లోయలో మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదం వెనుకంజలో ఉంది. కశ్మీరీ ప్రజలే ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని వెనుక కశ్మీరీ ప్రజల సంతోషం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని టికాలాల్‌ టాప్లూ త్యాగం కూడా ఉంది. ఆ నాయకుడు కనిపించని కశ్మీర్‌ హీరో. ఆయన నుంచి వెలువడిన రక్తపు బొట్టు జాతీయవాదం నుదుట తిలకం బొట్టు.

– ప్రభాత్‌

(Tika Lal Taplooజాగృతి సౌజన్యం తో)