Home Hyderabad Mukti Sangram యువకులను తరిమిన రజాకార్లు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-29)

యువకులను తరిమిన రజాకార్లు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-29)

0
SHARE

మెయిన్ రోడ్డుపైకి వెళ్ళగానే ఎదురుగా రెండు లారీలు, ఒక జీపు కనబడ్డాయి. ఆ వాహనాలు ఆగిపోయాయి. వాటిలో నుండి సాయుధులైన రజాకార్లు దిగి నినాదాలు చేస్తున్న యువకులను తరమడం ప్రారంభించారు. కాంగ్రెసు కార్యకర్తలని భ్రమపడిన యువకులకు త్వరలోనే వాస్తవం తెలిసిపోయింది. యువకులంతా బీబీనగర్ గ్రామంలోకి పరుగు లంఘించుకున్నారు. వారిలో లవంగ అచ్చయ్య ఒకడు.

హైద్రాబాద్  విజయవాడ రైల్వే మార్గంలో బీబీనగర్ స్టేషన్ ఉంది. ఇది హైద్రాబాద్‌కు 30 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామం. ఒకప్పుడు నిజామ్‌కు సంబంధించిన ఒక బేగమ్‌పేర నెలకొన్న గ్రామం. ఊరు చుట్టూ దాదాపు కూలిపోయిన గోడ  పెద్ద ద్వారాలు  మధ్యలో ఒక కూడలి ఉన్నాయి.

1948 జనవరి పదవ తేదీనాడు ముస్త్యాలపల్లి రజాకార్ల నాయకుడు ఛోటేమియా రజ్వీ గౌరవార్థం పెద్ద విందు చేశాడు. మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ అధ్యక్షుడు, రజాకార్ల సాలారే అజమ్, కాయదేసిద్ధిక్ ఫీల్డ్ మార్షల్ అలీజనాబ్ ఖాసిం రజ్వీ ఆ విందుకు హాజరైనాడు. రజ్వీ పలుకుబడి హైద్రాబాద్ సంస్థానంలో అప్పటికే అన్ని రంగాల్లోకి వ్యాపించింది. చివరికి రియాసత్ ప్రధాని మీర్ లాయక్ ఆలీ కూడా అతని సిఫార్సువల్లనే పదవిలోకి వచ్చాడు. మీర్జా ఇస్మాయిల్, నవాబ్ ఛత్రీలాంటి ప్రధానమంత్రులు రజ్వీ వత్తిడివల్ల పదవుల్లోంచి తొలగించబడ్డారు.

ఆచరణలో పాలకుడుగా రజ్వీకి ఛోటేమియా భువనగిరి తాలుకా తదితర ప్రాంతాలలో కుడిభుజంగా పనిచేశాడు. రజ్వీని పరోక్షంగా తన ప్రతినిధిగా నియమించి నిజాం తన స్వతంత్ర పాలనను కొనసాగించాలని ప్రయత్నించాడు. రజ్వీ చేతిలో ఉన్న రజాకార్ల సైన్యం రోజుకు మూడువేల రూపాయలు ఖర్చుపెడుతూ ఉండేది. అలాంటి రజ్వీ తన విందుకు రావడం ఛోటేమియాకు గర్వకారణమైంది. భువనగిరి తాలూకాలోని ముస్త్యాలపల్లి కేంద్రంగా ఛోటేమియా కొంతకాలం గ్రామాలను దోచి ప్రజలను వణికించి వేశాడు.

ముస్త్యాలపల్లిలో జరిగిన ఈ విందుకు రెండు లారీల నిండా ఉన్న సాయుధులైన అంగబలంతో రజ్వీ జీప్‌లో వచ్చాడు. ఆ విందుకు కొలిపాక తహసీల్దార్, మోత్‌కూర్ గడ్డం అమీన్, భోనగిరి డిప్యూటీ కలెక్టర్, గూడూర్ మీర్ ఖాదర్ ఆలీఖాన్, సికింద్రాబాద్ మోహ్మద్‌హాజీ మొదలైన హంగుదార్లు కూడా హాజరైనారు. వేలసంఖ్యలో రజాకార్లు కూడా ఈ విందు భోజనం చేశారు. ఆనాడు సంస్థానంలో బియ్యం కొరతవల్ల విందులపై ఆంక్షలు ఉన్నా వీళ్ళకు మాత్రం ఏ అడ్డంకీ లేదు.

గ్రామాలపైబడి బలవంతంగా బియ్యం, కోళ్ళు, పాలు, నెయ్యి దోచుకువచ్చి పెద్ద ఎత్తున విందు చేశాడు ఛోటేమియా. ముస్త్యాలపల్లిలో ఆ రోజు విందు ముగించుకొని రజ్వీ తన జీపు, రెండు లారీలతో దారిపోడగునా నినాదాలు చేస్తూ హైద్రాబాద్ తిరిగి వస్తున్నాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రజాకార్లు “ఆజాద్ హైద్రాబాద్ పాయింబాద్, షాహే ఉస్మాన్ జిందాబాద్, కాయదేమిల్లత్ సిద్ధిక్ ఖాసిం రజ్వీ జిందాబాద్‌” అని అరుస్తూ బీబీనగర్ ప్రవేశించారు. అప్పుడే పై సంఘటన జరిగింది. స్టేట్ కాంగ్రెస్ కార్యకర్తలు సత్యాగ్రహం చేసి వస్తున్నారేమోనని భ్రమపడి ఉత్సాహంగా ఎదురువెళ్ళిన యువకులకు రజాకార్లు ఎదురైనారు.

Source: Vijaya Kranti