Home Telugu Articles అతిథులను ఆహ్వానించే-సేంద్రియ గ్రామం

అతిథులను ఆహ్వానించే-సేంద్రియ గ్రామం

0
SHARE

మనోహరమైన భరత్‌ పుజ నదీ తీరం. అక్కడ ఒక స్వీయ నిర్మిత వృక్షగృహం, దట్టమైన పచ్చనిచెట్ల పందిరి అతిథులకు స్వాగతం పలుకుతోంది. వచ్చిన ప్రతి అతిథికి సేంద్రియ తోటలో పెరిగిన తాజా ఉత్పత్తులతో వండిన రుచికరమైన భోజనం లభిస్తుంది. సాయంత్రం సమయంలో మధురమైన స్థానిక గీతాలు, ఉత్సాహభరితమైన చర్చలు ఉంటాయి.

కేరళ రాష్ట్రం, పాలక్కాడ్‌ జిల్లాలో ఉన్న సేంద్రియ గ్రామంలో మోహన్‌ చవర, ఆయన కుటుంబమే మొదటి నివాసులు. మన్ననూర్‌ రైల్వేస్టేషన్‌ నుండి కొద్దిపాటి నడక దూరంలోనే ఉన్న ఈ గ్రామం రెండున్నర ఎకరాల సుందర గ్రామీణ ప్రాంతాల మధ్యలో ఉంది. చవర ఆలోచనల నుండి రూపుదిద్దుకొన్న ఈ సేంద్రియ గ్రామాన్ని ఆయనే స్థాపించారు. మోహన్‌ చవర తమ విస్తారమైన సేంద్రియ తోటనుండి తెచ్చిన తాజా ఉత్పత్తులతో భోజనం సిద్ధం చేస్తున్నారు.

మోహన్‌ చవర ఒక ప్రతిభావంతుడైన శిల్పి. ప్రకృతిలో సరళమైన జీవనశైలి, సామరస్యత ఆధారంగా ఒక ప్రత్యేక మైన సేంద్రియ గ్రామం నిర్మించాలనుకున్నాడు. చవర భార్య రుక్మిణి (నర్సింగ్‌ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌). వీరు పచ్చని జీవనశైలికి కట్టుబడిన వ్యక్తుల సమాజాన్ని నిర్మించాలని కలలుగనే వారు.

2013లో వారు స్వయం పోషకమైన సేంద్రియ గ్రామం తమ కోసమే నిర్మించడం కోసం 14 సారుప్య భావ కుటుంబాలతో చర్చించారు. వారందరూ కాలుష్యాన్నీ, ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని, నగరాల గందరగోళాన్ని వదలి ప్రకృతి ఒడిలో ఆరోగ్య కరమైన కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకున్నారు.

భరత్‌ పుజ నది ఒడ్డున ఒక అందమైన రెండున్నర ఎకరాల భూమి చూసి తమ సేంద్రియ గ్రామం నిర్మించడానికి అదే సరైన స్థలం అని గ్రహించారు. అవసరమైన నిధులను పోగు చేసి గతంలో ఒక రబ్బరుతోటగా ఉన్న ఆ భూమిని వారు కొనుగోలు చేసారు. నేలకు మంచిది కాదు కనుక రబ్బరు చెట్లను నరికివేసి తొలగించడంతో ఈ బృందం పని ప్రారంభమైంది. ఆ తరువాత స్వహస్తాలతో వృక్ష గృహాలు నిర్మించుకొని, తరువాత పండ్ల చెట్లను కూరగాయల తోటను నాటారు. 2015లో మోహన్‌, రుక్ష్మిణి, వారి ఇద్దరు కుమార్తెలు (18 సంవత్సరాల సూర్య, 11 సంవత్సరాల శ్రియ) ఆ కొత్త గ్రామంలో మొదటి నివాసులుగా ప్రవేశించారు.

పంచుకోవడం, దగ్గరగా ఉండడం అనేవి సూత్రాలుగా సేంద్రియ గ్రామ రూపాన్ని ప్రణాళికా బద్ధంగా రూపొందించారు. ప్రారంభ మైన నాటి నుంచే ఈ సేంద్రియ గ్రామాన్ని మెచ్చు కొంటూ సందర్శకులు రావడం మొదలయింది. దానితో ఒక అతిథి గృహాన్ని, అందరు కలసి వండుకొని తినేందుకు వీలుగా సామూహిక వంటగదిని నిర్మించాలని చవరా, ఇతర కుటుంబాలు ప్రణాళిక వేశారు.

ఈ గ్రామంలో నిర్వహించబోయే వారపు కళాజాతరకు కళాకారులను, చైతన్యవంతులైన కార్యకర్తలను, పొరుగు గ్రామాల ప్రజలను ఆహ్వానించ డానికి ఈ కుటుంబాలు ప్రణాళికలు వేస్తున్నారు.

ఇటీవలే చవర కుటుంబం తమ కోసం ఒక సాధారణ మట్టి ఇల్లు నిర్మించడం ప్రారంభించారు. పైకప్పు కోసం బయటి నుండి సహాయం తీసుకుంటున్నారు. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు సాగు చేయడంతోపాటు చవర కుటుంబం కోళ్ళు, మేకలు, ఆవుల పెంపకం కూడా చేపట్టారు. ఈ గ్రామానికి వచ్చిన ప్రతి అతిథికి తమ సేంద్రియ తోటలో పెరిగిన తాజా ఉత్పత్తులతో రుక్మిణి వండిన రుచికరమైన భోజనం స్వాగతం పలుకుతోంది. సాయంత్రం భోజన సమయంలో మధురమైన స్థానిక గీతాలు, ఉత్సాహభరితమైన చర్చలు ఉంటాయి.

సాధారణ పాఠశాలలతో పోల్చినప్పుడు, ప్రకృతితో కలసి జీవిస్తున్నప్పుడు ప్రేమ, మానవత్వ, కరుణ గురించి ఎక్కువగా తెలుసుకోవచ్చని చవరల కుటుంబం నమ్ముతున్నది. అందువలననే శ్రేయ, సూర్యలు ప్రకృతి జీవనం సాగించడానికి వీలుగా సాధారణ పాఠశాలకు వెళ్ళడం మానివేశారు. సూర్య 8వ తరగతి చదివే వరకు తరగతిలో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ, ఆమె 8వ తరగతి నుండి సాధారణ పాఠశాలకు వెళ్ళడం మానివేసింది. ఈ ప్రత్యామ్నాయ, అనియత విద్య ద్వారా నేర్చుకోవడం ఆమెకు మరింత సౌకర్యవంతంగాను సంతోషకరంగాను ఉంది.

మరోవంక శ్రేయకు డైస్లెక్సియా వ్యాధి ఉంది. దాని వలన ఆమెకు చదవడం, వ్రాయడం కష్టంగా ఉంటుంది. ఆమె ఉపాధ్యాయులు ఆమె సామర్థ్యాలను అర్థం చేసుకోలేక పోయారు. ఇప్పుడు, సేంద్రియ గ్రామం అందిస్తున్న కొత్త అవకాశాలతో ఆమె వృద్ధి చెందుతోంది. ప్రకృతిలో వచ్చే అందమైన మార్పులను గమనిస్తోంది. తమ పనిచేసుకుంటూనే పక్షుల కిలకిలారావాలను వినడం, వారి వృక్ష గృహం ఇంటి చుట్టూ తిరుగుతూ చల్లని తాజా గాలిని ఆస్వాదించడం ఈ ఇద్దరు సోదరీమణులకు చాలా ఆనందం కలుగజేస్తున్నాయి.

తమ రాష్ట్ర సాంస్కృతిక, సాంఘిక వైవిధ్యం గురించి మరింత తెలుసుకోవడానికి సూర్య, శ్రేయ తరచు పర్యటనలు చేస్తుంటారు. 2013లో వారు అరన్‌ములకు ఒక బాలల బృందాన్ని తీసుకువెళ్ళారు. ఆ ప్రాంతంలోని జీవ వైవిధ్య సంపదను దెబ్బ తీస్తుందని భావించిన ప్రతిపాదిత ప్రాజెక్టు గురించి అవగాహన పెంచడానికి సంకేతంగా అక్కడ వరి మొక్కలు నాటారు.

వారి తండ్రి వద్ద నేర్చుకొని సూర్య, శ్రియలు శిల్పకళ, ఇతర కళారూపాల్లోనూ ప్రావీణ్యం పొందారు. వారి సృజనాత్మకతకు తల్లిదండ్రుల ప్రోత్సాహమూ తోడవడంతో ఈ సోదరీమణులు ఎన్నో శిల్పాలు, చిత్తరువులను తయారు చేశారు. వాటిని ముద్దొచ్చే తమ మట్టి ఇంటి గోడలకు, స్తంభాలకూ అలంకరించారు. నగర గందరగోళం నుండి దూరంగా నిశ్శబ్ద ప్రదేశంలో వారి ప్రయత్నాలతో ఈ గ్రామం సాంప్రదాయ అడవి జీవనంలో కళాత్మక రూపం సంతరించుకుంది.

సుస్థిర జీవన విధానం వారి సంతానంపై చూపుతున్న సానుకూల ప్రభావాన్ని చూసిన చవరలు, ఇతర కుటుంబాలు ఇప్పుడు కళలు, చేతివృత్తుల కార్యశాలలు, తోటపని తరగతులు మొదలైన వాటితో సహా, పిల్లలు తమలో తాము పోటీపడటానికి బదులు కలసి జీవించడాన్ని ప్రోత్సహించే తమదైన విద్యావిధానాన్ని రూపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

గొప్ప సాహసం సుస్థిరత, ప్రేమాభిమానాలు నిండిన తన గాథతో సేంద్రియ జీవనానికి ఏకైక ఉదాహరణగా నిలచిన చవరలు భారతదేశ వ్యాప్తంగా ప్రజలు తమ మూలాలకు తిరిగి రావడానికి ప్రేరేపిస్తున్నారు.

– రాంసి నడిమింటి.

(జాగృతి సౌజన్యం తో)