Home News స్ఫూర్తి మంతంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శిక్షావర్గ సార్వజనికోత్సవం

స్ఫూర్తి మంతంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శిక్షావర్గ సార్వజనికోత్సవం

0
SHARE

హిందూ అని చెప్పుకోవడానికి ఏమాత్రం వెనుకాడ వద్దని, స్వాభిమానంతో ముందుకు సాగాలని తెలంగాణా ఆబ్కారీ శాఖ విశ్రాంత డిప్యూటీ కమీషనర్ శ్రీ చల్లా వివేకానంద రెడ్డి అన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (RSS) తెలంగాణా ప్రాంత ప్రథమ, ద్వితీయ సంఘ శిక్షా వర్గల సార్వజనికోత్సవం భాగ్యనగరంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు.

నాలుగు వేల సంవత్సరాల నాటి విష్ణుపురాణంలో భారత్ ప్రస్తావన ఉందని వారన్నారు. ప్రస్తుతం మన దేశంలో విదేశీ మూలాలు ఉన్నవారు ఎవరూ లేరని విదేశీ మతాలను అవలంబిస్తున్న వారి పూర్వికులు హిందువులే అని స్పష్టం చేశారు. మన అమూల్యమైన నాగరికతను పూర్వీకుల నుండి అందివచ్చిన వారసత్వాన్ని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత నేటి యువతపైనే ఉందని శ్రీ వివేకానంద రెడ్డి తెలిపారు.

కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్ఛేసిన హిందూ జాగరణ మంచ్ పశ్చిమ, మధ్య క్షేత్రాల (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా,రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల)  సంఘటనా మంత్రి శ్రీ పి. దేవేందర్ మాట్లాడుతూ స్వయంసేవకుల శక్తి సామర్థ్యాలను పెంపొందించి, సంఘ సిద్ధాంతం పట్ల అవగాహన పెంచుకునే అవకాశాన్ని సంఘ శిక్షావర్గ అందిస్తుందని అన్నారు. సమాజ హితాన్ని ఆకాంక్షిస్తూ మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేలా స్వయంసేవకులు పని చేయాలని వారు పిలుపుని చ్చారు. దేశంలోని హిందువులందరూ తమ జాతికి ధర్మానికి నష్టం కలిగించే విధర్మీయులను, విజాతి శక్తులను ఎదిరించేలా, ప్రశ్నించేలా వారిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వయంసేవక్ సంఘ్ పని చేస్తుందని దేవేందర్ జీ అన్నారు.

మే 15 వ తేదీ నుండి జూన్ 4 వరకు జరిగిన ప్రథమ వర్ష సంఘ శిక్షావర్గలో 301 మంది, ద్వితీయ సంఘ శిక్షావర్గలో 173 మంది స్వయంసేవకులు శిక్షణ తీసుకున్నారు. ప్రథమ వర్ష వర్గాధికారిగా శ్రీ పబ్బ సత్యనారాయణ, ద్వితీయ వర్ష వర్గ సర్వాధికారిగా శ్రీ హెచ్ కె నాగు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర సహా సంఘచాలకులు శ్రీ దూసి రామకృష్ణగారు, తెలంగాణా ప్రాంత సంఘచాలకులు శ్రీ బూర్ల దక్షిణామూర్తిలతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్షేత్ర, ప్రాంత అధికారులు, స్వయంసేవకులు పాల్గొన్నారు.
శిక్షణ పొందిన స్వయంసేవకుల శారీరక ప్రదర్శనలు కార్యక్రమానికి తలమానికంగా నిలిచాయి.