Home News ఓటే ముద్దు.. ఫస్ట్ టైం ఓటర్స్‌తో ABVP యువ సమ్మేళనం

ఓటే ముద్దు.. ఫస్ట్ టైం ఓటర్స్‌తో ABVP యువ సమ్మేళనం

0
SHARE

హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓటర్స్ సహా ప్రజలందరూ NOTAకు బదులు.. మెరుగైన అభ్యర్థికి ఓటు వేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని “ABVP యువ ఓటర్ల సమ్మేళనం”లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోకుంటే అత్యంత అసమర్ధుడైన అభ్యర్ధి గెలుపొంది దేశాన్ని భ్రష్టుపట్టించే అవకాశముందని, కనుక సరైన ఆలోచనతో దేశం కోసం పనిచేసే వ్యక్తులకు ఓటు వెయ్యాలన్నారు.

నగరంలోని నారాయణగూడలో ఉన్న KMIT ప్రాంగణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) నిర్వహించిన యువ ఓటర్ల సమ్మేళనానికి ఫస్ట్ టైమ్ ఓటర్స్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వీరిని ఉద్దేశించి ప్రసంగించిన లింగం శ్రీధర్ ఓటు ప్రాధాన్యతను వివరించారు. ఒకట్రెండు పూటల భోజనం కోసం తెచ్చే కూరగాయల్లో పుచ్చులుంటే ఏరివేస్తుంటామని, అలాంటిది ఐదేళ్ల కాలానికి పరిపాలన కోసం మనం ఎన్నుకునే నేతల విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని అన్నారు. “నా ఒక్క ఓటు పడకుంటే ఏమవుతుంది? నా ఓటుతో వచ్చే పెద్ద మార్పు ఏముంటుంది?” అనుకుని ఓటుని నిర్లక్ష్యం చెయ్యరాదంటూ చుక్క చుక్క కలిస్తేనే నదులవుతాయని సహేతుకంగా వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగకర్తలు దేశప్రజలకు ఇచ్చిన ఓటుహక్కును తప్పక వినియోగించుకోవాలన్నారు.

తెలంగాణ విషయానికి వస్తే కొన్ని పార్టీలు ఇక్కడ ఓటును అంగడిసరుకుగా మార్చేశాయని ప్రాంత ప్రచారక్ ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి డబ్బు, మద్యం, కులాభిమానం, బంధుప్రీతి వంటివాటికి ప్రభావితం కాకుండా పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో, గత చరిత్రను పరిశీలించి ఓటెయ్యాలని యువతరానికి సూచించారు. NDA కూటమి భారత్‌ని విశ్వగురువుగా నిలబెట్టే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలబడితే… కాంగ్రెస్-ఇండీ కూటమి మాత్రం గొప్ప సంకల్పంతో పనిచేస్తున్న ప్రధాని మోదీని దించడం లక్ష్యంగా ఎన్నికల్లో నిలబడిందన్నారు. ప్రధాని మోదీ యోగాతో ఇస్లామిక్, క్రైస్తవ దేశాలను సైతం ఏకతాటిపై నిలబెట్టారని, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పాక్ బస్సు ఒకటి అక్కడి నుంచి తప్పించుకోవడానికి భారత జాతీయ పతాకాన్ని తగిలించుకు రావలసి వచ్చిందని, ఎప్పుడూ భారత్‌ని విమర్శించే ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాతో యుద్ధం ఆపించాలని భారత్‌ని బ్రతిమాలుకున్నారని, ఇక 500 ఏళ్లకు పైగా అశాంతిలో మగ్గిన అయోధ్య వివాదం అత్యంత శాంతియుతంగా ముగియడం, కాశ్మీరులో రాళ్లు పట్టి ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన యువతను ఉపాధి వైపు నడిపించడం, 370 ఆర్టికల్ రద్దు తదితర పరిణామాలను లింగం శ్రీధర్ ఈ సందర్భంగా ప్రస్తావించి తాజా పరిణామాలపై యువతలో అవగాహన కలిగించారు.

ఇంకా… దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల పెంపుతో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయని, ఇంత జరుగుతున్నా రిజర్వేషన్లపై ఫేక్ వీడియోలతో కాంగ్రెస్-ఇండీ కూటమి మద్దతుదారులు దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీధర్ ఫస్ట్ టైం ఓటర్ల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమ్మేళనం ఏర్పాటు చేసిన ABVP నేతలను శ్రీధర్ అభినందిస్తూ కొత్త ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. నిశ్శబ్దాన్ని ఛేదించి ఓటు విలువపై పరస్పరం చర్చించాలన్నారు. తన ప్రసంగం చివరిలో మే 13న తప్పక ఓటు వేస్తామని, భవిష్యత్తులోనూ ఓటు హక్కును తప్పక వినియోగించుకుంటామని విద్యార్థులు, కొత్త ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. పోలింగ్ బూత్‌లో ఆ రోజు మొదటి ఓటు మనదే అయి ఉండాలని పిలుపునిచ్చారు.

“ABVP యువ ఓటర్ల సమ్మేళనం”లో ABVP సీడబ్ల్యుసి సభ్యులు శ్రీహరి, ABVP రాష్ట్ర వర్శిటీల ఇంచార్జి జీవన్, ABVP విద్యానగర్ విభాగ్ కన్వీనర్ పృథ్వి, ABVP రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు బాలు పాల్గొన్నారు.