
తమిళనాడులోని కూనూర్‌లో భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధూలిక రావత్ మరో 11 మంది మరణించారు. ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. వెల్లింగ్టన్ (నీలగిరి హిల్స్)లోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్‌లో స్టాఫ్ కోర్స్ ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఆఫీసర్లను ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చేందుకు సీడీఎస్ బిపిన్ రావత్ బుధవారం మద్యాహ్నం సలూర్ ఎయిర్‌బేస్ నుంచి హెలికాఫ్టర్‌లో వెళుతుండగా కూనూర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి డిఫెన్స్ విమానంలో కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్‌బేస్‌కు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా 9 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. సూలూరు ఎయిర్‌బేస్ నుంచి కూనూరు కంటోన్మెంట్‌కు ఆర్మీ హెలికాప్టర్‌లో బిపిన్ రావత్ దంపతులతో పాటు 12 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. ఇక కూనూరు ఎయిర్‌బేస్‌లో మరో 5 నిమిషాల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే కంటే ముందే చాపర్ కుప్పకూలిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలిపింది. బుధవారం సాయంత్రం 6:03 గంటలకు బిపిన్ రావత్ మృతిని వాయుసేన అధికారికంగా ధృవీకరించి ట్వీట్ చేసింది. బిపిన్ రావత్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు సంతాపం ప్రకటించారు.