Home News అమెరికా వాచాలత్వానికి జైశంకర్ దీటైన సమాధానం

అమెరికా వాచాలత్వానికి జైశంకర్ దీటైన సమాధానం

0
SHARE

ఆరోపిత “మానవ హక్కుల ఉల్లంఘనలు” కు సంబంధించి భారత్‌పై అమెరికా చేసిన విమర్శలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ దీటైన సమాధానం ఇచ్చారు.

2+2 చర్చల అనంతరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ అమెరికా సహా ఇతర దేశాల్లో మానవ హక్కుల పరిస్థితిపై భారత్‌కు సైతం కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. “కనుక, ఈ దేశంలో (అమెరికా) మానవహక్కులకు సంబంధించిన ఉత్పన్నమయ్యే అంశాలను మరీ ముఖ్యంగా మా దేశానికి చెందిన వారివి సైతం మేం పరిగణనలోకి తీసుకుంటాము. వాస్తవానికి, అలాంటి ఒక ఘటన మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం అది మా పరిశీలనలో ఉంది” అని కేంద్ర మంత్రి తెలిపారు.

రెండు రోజుల క్రితం అమెరికాలోని న్యూయార్క్‌కు సమీప ప్రాంతంలో ఇద్దరు సిక్కు మతస్థులు విద్వేషపూరిత నేరాన్ని చవిచూశారు. ఆ ఇద్దరిపై కొందరు దుండగులు దాడి చేసి దోపిడీకి పాల్పడిన వైనాన్ని జైశంకర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

“చూడండి, మా పట్ల అభిప్రాయాలు కలిగి ఉండటానికి ప్రజలు అర్హులే. అదే సమయంలో అలాంటి ప్రజల అభిప్రాయాలు, ప్రయోజనాలు, లాలూచీలు, వారిని నడిపించే ఓటుబ్యాంకుల పట్ల అభిప్రాయాలను కలిగి ఉండటంలో మేం సైతం అంతే అర్హులం. కనుక, ఎప్పుడైనా ఏదైనా చర్చకు వచ్చినప్పుడు మేం బాహటంగా మాట్లాడుతామని మీకు చెబుతున్నాను” అని మంత్రి చెప్పారు.

గతంలో చర్చకు వచ్చిన మానవహక్కుల అంశాన్ని ప్రస్తుత సమావేశంలో చర్చించరాదని సైతం జైశంకర్ తేల్చి చెప్పారు.

“ఈ అంశం (మానవ హక్కులు) గతంలో చర్చకు వచ్చింది. సెక్రటరీ బ్లింకెన్ భారత్ పర్యటన సందర్భంగా అది చర్చకు వచ్చింది. అప్పట్లో విలేకరులతో జరిపిన సమావేశాలను మీరు గుర్తు చేసుకున్న పక్షంలో ఆ అంశంపై మనం చర్చించామని, నేను చెప్పాల్సింది కూడా అప్పట్లోనే చెప్పేశానని మీకు తేటతెల్లమవుతుంది” అని ఆయన తెలిపారు.

“భారత్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటుగా కొందరు ప్రభుత్వ, పోలీసు, కారాగారాల అధికారుల చేతుల్లో నానాటికి పెరిగిపోతున్న మానవహక్కుల ఉల్లంఘనలను” అమెరికా గమనిస్తోందని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ చేసిన ప్రకటనతో మానవహక్కుల వ్యవహారంపై జైశంకర్ స్పందించారు