Home Telugu Articles క్రాంతియోగి బసవణ్ణ

క్రాంతియోగి బసవణ్ణ

0
SHARE

వైశాఖ శుద్ధ తదియ బసవేశ్వర జయంతి… 

ప్రపంచ చరిత్రలో ఎందరో వైతాళికులు సమాజ నిష్క్రియాపరత్వాన్నీ. నిస్తేజాన్నీ. అనైతికతను ప్రశ్నిస్తూ సమాజస్థితిగతులలో ఆలోచనాత్మక. ఆచరణాత్మక మార్పులకు కారణమయ్యారు. అఖండభారతదేశంలో అటువంటి కారణజన్ములు కోకొల్లలు. విదేశీ దాడులకు అతలాకుతలమైన హిందూధర్మం సామాన్య ప్రజలకు అంతుచిక్కని అయోమయంలో ఉన్నసమయంలో `శ్రీ క్రాంతియోగి’, `విశ్వయోగి’ అని భక్తిగా పిలుచుకునే బసవణ్ణ అవతరించారు.

12 వ శతాబ్దంలో ప్రస్తుత కర్ణాటకరాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బాగేవాడి అనే గ్రామంలో గ్రామాధికారి అయిన మండెన మాదిరాజు,  మాడలాంబిక దంపతుల వరప్రసాదంగా వైశాఖ శుద్ధ తృతీయనాడు (1134 వ సంవత్సరం మార్చి 30 వతేదీన) జన్మించారు. పుట్టిన నాటి నుంచే అలౌకిక సమాధిస్థితిలో ఉండేవారు. పుట్టినప్పుడు ఆయన కళ్లు తెరవలేదు, ఏడవలేదు. తల్లితండ్రులు భయపడి తమ శివగురువును పిలవగా ఆయన కూడలసంగమేశ్వరుని విబూదిని నుదుటిపై రాయగా కళ్లుతెరిచి చూశారని తెలుస్తోంది. ఇది గమనించిన శివగురువు అప్పుడే ”ఇష్ట లింగ“ ధారణకావించారు. ఐదు సంవత్సరాల వయస్సులో అక్షరాభ్యాసం అవగానే ఆయనలోని తార్కికశక్తి  ప్రజ్వరిల్లింది. ఆయన వేసే ప్రశ్నలకు పెద్దలు సైతం అప్రతిభులై ఆనందించేవారట. తండ్రిగారు బసవేశ్వరుని ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనసంస్కారం జరుప తలపెట్టారు, కృతువు మద్యలో ఆపించి “ఇష్ట లింగ”ధారణ చిన్నప్పుడు జరిగింది కాబట్టి మరలా యీ కృతువు లు అవసరంలేదని తెలిపి తన ఇష్టదైవం అయిన కూడలసంగమేశ్వరుని సన్నిధికి చేరారు. దానితో ఆయన తండ్రి శివగురువైన జాతవేదమహమునిని ఆశ్రయిస్తే ఆయన బసవేశ్వరుడిని కూడలసంగఘక్షేత్రంలోని తన ఆశ్రమంలో విధ్యార్ధిగా స్వీకరించారు. అది మొదలు బసవేశుని జ్ఞాన యజ్ఞం  ఆయన  జీవితచరమాంకం వరకూ కొనసాగింది.

ధర్మశాస్త్రం,  నీతిశాస్త్రం, సమాజశాస్త్రం. రాజనీతిశాస్త్రంవంటి శాస్త్రాధ్యయనం, కన్నడ, సంస్క్రతభాషాధ్యయనం ద్వారా అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు.  ఆధ్యాత్మిక మార్గాన్వేషియై ఉపదేశ సత్సంగాలు జరుపుతున్న బసవేశ్వరుని కీర్తి యావద్రాజ్యమూ వ్యాపించింది. తల్లిదండ్రులు, మేనమామ బలదేవుడు ఆయనకు వివాహం చేయాలనుకున్నారు. విముఖుడైన బసవేశ్వరునికి జాతవేదముని కర్తవ్యబోధన చేశారు. క్షీణిస్తున్నవీరశైవమతాభివృధ్ధికి, సామాన్యప్రజలకు తత్వజ్ఞానబోధకు దేవుడిచ్చిన అవకాశం అని నిర్ణయించుకొని బలదేవుని కూతురు గంగాబికను వివాహమాడి బిజ్జలదేవమహరాజు రాజధాని అయిన  కళ్యాణకటకం చేరారు.

సహకోశాధికారిగా పనిచేస్తున్నసమయంలో ఒక పురాతన తామ్రశాసనంలోని సాంకేతికభాషను పరిష్కరించి రాజసింహాసనం క్రింద ఉన్న నిథినిక్షేపాలు వెలికితీసి కోశాధికారిగా, తన ధర్మభధ్ధమైన, నిష్పాక్షికమైన నిర్వహణతో తరువాత కాలంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఆయన ఏ పదవిలో ఉన్నా తన తత్వజ్ఞానబోధన, ఆధ్యాత్మికసాధన వదలని కర్మయోగిగా జీవితాన్నిగడిపారు. “అనుభవమండపం” అనే ఒక సమావేశమందిరంలో కులమత వివక్షలేని చర్చావేదిక నిర్వహించేవారు.”కూడలసంగమేశ్వర” అనే మకుటంతో బసవశరణాలు అనే పేరుగల ద్విపదల ద్వారా తన  సందేశాలని సామాన్యప్రజలకు అర్ధమయ్యే సరళపదాలలో కన్నడభాషలో ప్రవచించారు. కులాలకతీతంగా, మతాలకతీతంగా (హిందూ ధర్మానికి చెందిన మతాలు) అందరు ప్రజలు కలిసిమెలసి ఉండాలని, పేదాగొప్ప తారతమ్యం దేవుని దృష్టిలోలేదని ప్రవచించారు. ఆయన గొప్పదనం ప్రవచనాలను ఆచరించి చూపటం. ఆయన ఏది చెప్పొరో అది ఆచరణలోచూపారు. ఆయన శిష్యులను గమనిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.  ప్రభుదేవుడు, సిధ్ధిరాముడు, చెన్నబసవన్న, అక్కమహాదేవి, గంగపుత్రమాచయ్య, తాళ్ళచంద్రయ్య, పశువులకాపరి రామయ్య, చేనేత రామన్న, కొత్వాల్ రామిదేవ, నూనెమిల్లు కన్నయ్య, వడ్రంగి బసప్ప. ఒక్కోక్కరు ఒక్కొక్క సామాజికవర్గం నుంచి వచ్చినవారు. ఆకాలంలో ఇంతటి సమరసత సాధించిన ఒక సౌజన్యమూర్తి, శైవసాంప్రదాయానికి కొత్త ఊపిరులూదిన వారు బసవేశ్వరుడు. ఆయన ఆధ్యాత్మికరంగంలో సాధించిన విజయం ఒక ఎత్తైతే కన్నడ భాషాచరిత్రలో ఆయన బసవశరణాల పాత్ర మరొక ఎత్తు.

బసవేశ్వరుడు ఈ మార్పులు అంత సులభంగా సాధించలేదు. ఆయన మొదలుపెట్టిన “అనుభవమంటపం” తత్సంభంధమైన జంగమదేవరలకు చేసిన ప్రసాదవితరణ కొందరికి నచ్చలేదు.  మహారాజే  స్వయంగా తనిఖి చేసి మరీ ఆయన ధర్మనిష్ఠను కొనియాడారు. అన్నిసమాజాలలోలాగానే ఆ సమయంలోకూడా ఛాందసవాదులవల్ల ఆయన ఇబ్బందులుఎదుర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో జరిపిన కులాంతర వివాహం తదనంతర పరిణామాలవల్ల ఆయన తన ప్రధానమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారు తప్ప నమ్మిన సిధ్ధాంతాలను మాత్రం వదులుకోలేదు.

ఆయన ప్రతిపాదించిన కొన్నిశరణాలు –

“కాయకమేకైలాసం……… “ అంటూ శ్రమ విలువని
“దేవుడొకడునామములనేకము………. “అంటూ సత్యాన్ని
“దయలేనిధర్మమదేమయ్య………… “అంటూ మానవత్వాన్ని
“కాచి కమ్మరియయ్యే, ఉదికి చాకలియయ్యే. నేసి సాలెయయ్యే, వేదం చదివి విప్రుడయ్యో………. “ అంటూ వర్ణవిభజనా విధానాన్నివివరించారు.

సాత్వికతప్రధానంగా బసవేశ్వరుడు సమాజంలో జరిపిన గుణాత్మక క్రాంతి ప్రపంచచరిత్రలో బుధ్ధుని తర్వాత అంతటి ప్రభావం కలిగించిన ఘట్టంగా కీర్తించవచ్చు. అయితే బుధ్ధుని మార్గం పూర్తిగా భావవైరాగ్యప్రధానంగా సాగితే.  బసవేశ్వరుని మార్గం కర్మప్రధానంగా, శివతత్వ ప్రధానంగా సాగింది.  8 శతాబ్దాల తరువాత కూడా ఇప్పటికీ కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో బసవేశ్వరుని సిధ్ధాంతచర్చ జరుగుతోంది అంటే ఆయన ప్రభావం ఎంతో మనకు అర్ధం అవుతుంది.

–  చంద్రమౌళికళ్యాణచక్రవర్తి

ఆధారం: బసవవచనామృతం..