Home News పరంపర దృష్టితో సమకాలిన వాస్తవాలతో ప్రజలను ఏకం చేయాలి – జాగృతి పత్రిక అసోసియేట్ ఎడిటర్...

పరంపర దృష్టితో సమకాలిన వాస్తవాలతో ప్రజలను ఏకం చేయాలి – జాగృతి పత్రిక అసోసియేట్ ఎడిటర్ దుర్గారెడ్డి

0
SHARE

గత అనుభవాలను, దేశ సామాజిక పరంపరను దృష్టిలో ఉంచుకొని సమకాలిన వాస్తవాలతో పత్రికలు పాత్రికేయులు ప్రజలను ఏకం చేసే దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త, జాగృతి వారపత్రిక అసోసియేట్ ఎడిటర్ శ్రీ దుర్గా రెడ్డి అన్నారు.

సమాచార భారతి ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఫిలిం భవన్ ఆడిటోరియంలో దేవర్షి నారద జయంతిని పురస్కరించుకొని ప్రపంచ పాత్రికేయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన దుర్గారెడ్డి మాట్లాడుతూ కొన్ని అంతర్జాతీయ శక్తుల కుట్రలో భాగంగా నేడు దేశంలో కార్పొరేట్ రాజకీయ ఒత్తిళ్లతో పత్రికల యాజమాన్యాలు పాత్రికేయులు తమ విధులను క్షేత్రస్థాయిలో స్వేచ్ఛగా నిర్వహించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో దేశ జాతి వ్యతిరేక వార్తలకు ప్రాధాన్యం ఏర్పడిందని దాని ఫలితంగా దేశవ్యాప్తంగా పలు అపశృతులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ అపశృతుల కారణంగా దేశహితం వక్రభాష్యాల దిశగా పయనిస్తుందని తెలిపారు. దేశ ఆర్థిక సామాజిక ఉపాధి రంగాలు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న సందర్భంలో ప్రజలను వారి భావాలను చీల్చే కుట్ర జగమంతమవుతుందన్నారు. అందుకు వివిధ ప్రాంతాలలో కుల మత వర్గ విభేదాలతో ఆందోళనలు చెలరేగడం దురుద్దేశపూర్వకంగా వాటికి పతాక శీర్షికన ప్రసార ప్రచార పత్రిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో వాస్తవాలను వెల్లడించలేక పాత్రికేయులు, పత్రికలు మానసిక భయాందోళనలకు గురవుతున్నారని ఈ పరిస్థితులను అధిగమించి గత అనుభవాల తో వాస్తవ సమాజాన్ని నిర్మించేందుకు పాత్రికేయ లోకం వాస్తవిక దృష్టితో క్రియాశీలకంగా మారాలని కోరారు.

కేవలం అధికారం రాజకీయాల దృష్టితో పాత్రికేయ రంగం నిలవకుండా సామాజిక బాధ్యతతో వివిధ రంగాలను సమన్వయం చేసే బాధ్యతను గుర్తెరగాలని దానితోనే భవిష్యత్తులో సమస్యలకు వాస్తవ పరిష్కారాలు లభిస్తాయి అని ఉద్ఘాటించారు. సమాచారభారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పత్రికలు పాత్రికేయ రంగంతో నిత్య సంబంధాలు కొనసాగిస్తూ దేశహిత కర్తవ్యం వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

ప్రజ్ఞాభారతి సంయుక్త కార్యదర్శి పింగిళి  వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా ఆర్ ఎస్ ఎస్ కరీంనగర్ విభాగ్ సంపర్క ప్రముఖ్ ముక్కల సీతారాములు, సీనియర్ ఛార్టర్డ్ అకౌంటెంట్ నిరంజనాచారి, ఎలగందుల సత్యనారాయణ, గాజుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.