Home Telugu Articles కేరళలో మత పవనాలు!

కేరళలో మత పవనాలు!

0
SHARE

కేరళలో మతం పట్ల ప్రజలలో పెరుగుతోన్న అనురక్తి తమ రాజకీయ ప్రభావ ప్రాబల్యాలకు సవాల్‌గా పరిణమించగలదని మార్క్సిస్టులు భయపడుతున్నారు. మతానికి మళ్ళీ ప్రాధాన్యం పెరిగి రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా పరిణమిస్తే సంప్రదాయ మార్క్సిస్టు కుటుంబాలపై పార్టీ ప్రభావం, పట్టు సన్నగిల్లిపోతాయని మార్క్సిస్టు నాయకులు కలవరపడుతున్నారు.

మతాన్ని మధుర సాంత్వనగా కొంతమంది మార్క్సిస్టులు భావిస్తున్నారు! మార్క్సిస్టు పార్టీ అగ్రనాయకుల కుటుంబాల వారు ప్రప్రథమ మలయాళ మహాకవి తుంజాత్‌ ఎళుత్తుచ్చన్‌ మహాకావ్యం ‘ఆధ్యాత్మ రామాయణం’ను ఆచారబద్ధంగా పఠిస్తున్నట్టు కేరళ నుంచి వెలువడుతున్న వార్తలు తెలియజేస్తున్నాయి. వర్షాలు ముమ్మరంగా కురిసే కర్కాటకం (జూలై 15–ఆగస్టు 15) మాసంలో ఈ ఆచారాన్ని మార్క్సిస్టు నేతల కుటుంబ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారని ఆ వార్తలు పేర్కొన్నాయి. ఈ వార్తలు సహజంగానే మార్క్సిస్టు పార్టీ నాయకత్వానికి తీవ్ర ఇబ్బంది కల్గించాయి. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు అటువంటి మతాచారాలకు దూరంగా ఉండే విధంగా కేరళ పాలకపక్షం మీడియా ప్రచారాన్ని చేపట్టింది. తమ కార్యకర్తలు మతం ప్రభావంలో పడి, ‘మతం మత్తు మందు’ అన్న మార్క్స్‌ మాటను పూర్తిగా విస్మరిస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడ కూడదని మార్క్సిస్టు పార్టీ నాయకులు భావిస్తున్నారు.

పాలక మార్క్సిస్టు నాయకులను కలవరపరుస్తోన్న ఈ మతాచారానికి ఆసక్తికరమైన నేపథ్యం ఉన్నది. కేరళకు ఋతుపవనాలు జూన్‌లో వస్తాయి. తదాది సెప్టెంబర్‌ వరకు వర్షరుతువే. ఈ నాలుగు నెలల కాలంలో వర్షాలు ముమ్మరంగా కురుస్తాయి. కుండపోత వర్షాలకు పౌర జీవనం దాదాపుగా స్తంభించిపోతుంది. బయటి ప్రపంచపు కార్యకలాపాలకు అంతగా ఆస్కారముండదు. చాలామంది ఇళ్ళలోనే ఉండిపోవడం కద్దు. 16వ శతాబ్ది మహాకవి తుంజాత్ ఎళుతుచ్ఛన్‌ మలయాళ భాషలో రామాయణ కావ్యాన్ని రాసిన తొలి కవి. ఆ కావ్యరచనా క్రమంలో ఆయన జనుల వాడుకలో ఉన్న మలయాళ మాటలను, కావ్య భావాలను వ్యక్తీకరించడానికి స్థానికంగా సరైన పలుకుబడులు లభ్యం కానప్పుడు సంస్కృతం నుంచి స్వీకరించిన పదాలను కలగలిపి ఒక కొత్త భాషను సృష్టించారు. మణిప్రవాళంగా పేరు పొందిన ఈ కొత్త భాష ఆ తరువాత తన సొంత వ్యాకరణంతో మలయాళ భాషగా అభివృద్ధి చెందింది. తమకు తల్లిభాషలో రామాయాణ మహాకావ్యాన్ని ప్రసాదించిన మహాకవిగా ఎళుతుచ్ఛన్‌ను కేరళ ప్రజలు గౌరవిస్తున్నారు (ఈ మహాకవి తన రామాయణ అనువాదాన్ని ‘ఆధ్యాత్మ రామాయణం’అని పిలిచారు. తద్వారా తన కావ్యానికి సాహిత్య విలువే కాకుండా ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్నదని కూడా ఆయన నొక్కిచెప్పారు).

ఇరవయో శతాబ్దిలో హిందూమత వ్యతిరేక, సోషలిస్టు, కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావం ఫలితంగా ఎళుతుచ్ఛన్‌ రామాయణ మహాకావ్యం ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కోల్పోయింది. అయితే ఇటీవల ఎళుతుచ్ఛన్‌ రామాయణంలో ప్రజల ఆసక్తి పునరుజ్జీవం పొందింది. కుటుంబ పెద్ద ఆ మహాకావ్యాన్ని చదవడం, మిగతా వారు భక్తి శ్రద్ధలతో వినడం అనే ఆచారం పెంపొందుతోంది.

విదేశాలలోని తమ బిడ్డల నుంచి అందుతోన్న డబ్బు కేరళ ప్రజల మత, ధార్మిక జీవనంపై అమిత ప్రభావాన్ని నెరపుతోంది. ఈ ప్రభావం ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. అన్ని మతాల వారు ఆ ఆర్థిక వెసులుబాటుతో తమ ఆచారాలు, సంప్రదాయాల పట్ల అమితాసక్తిని చూపుతున్నారు. తమ మతాచారాల ఆచరణను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. సిరిసంపదలు పెరుగుతున్నకొద్దీ ముస్లింలలో కొంతమంది అంతకంతకూ ఇస్లామిక్‌ తీవ్రవాద ధోరణుల ప్రభావానికి లోనవుతున్నారు. అంతేగాక కేరళ జనాభాలో ముస్లింల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదే సమయంలో హిందువుల, క్రైస్తవుల సంఖ్య తగ్గిపోతోంది. కేరళ జనాభాలో హిందువుల సంఖ్య 1901లో 69 శాతం నుంచి 2011లో 54.73 శాతానికి తగ్గిపోయింది. 2001–11 సంవత్సరాల మధ్య కేరళలో ముస్లిం జనాభా 12.6 శాతం మేరకు పెరుగగా, హిందూ జనాభా 2.2 శాతం, క్రైస్తవ జనాభా 1.4 శాతం మాత్రమే పెరిగింది. అక్షరాస్యత, పట్టణీకరణ, సిరిసంపదలలో కేరళ ముస్లింలు మరే మతం వారికంటే వెనుకబడిలేరు. మత పరమైన భావోద్వేగాల ప్రభావం పెరుగుతున్న కారణంగానే రాష్ట్ర జనాభాలో వారి సంఖ్య కూడా పెరుగుతుందనేది స్పష్టం.

మత సంబంధ విషయాలలో వామపక్షాల వారిలో నిజాయితీ కొరవడింది. ‘హేతువాద వైఖరి, వైజ్ఞానిక దృక్పథం’ను పెంపొదించే పేరిట హిందూ మతాచారాలు, సంప్రదాయాలను వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా కేరళలో ముస్లింల వేర్పాటువాదం, ఇస్లామిక్‌ ఛాందసవాదం పెంపొందడానికి మార్క్సిస్టులు ఎంతైనా తోడ్పడ్డారు! 1969 జూన్‌లో ఆనాటి సిపి ఎమ్‌ ప్రభుత్వం ముస్లింలు అత్యధికంగా ఉన్న మలాప్పురం జిల్లాను సృష్టించింది. పలు తీవ్రవాద ఇస్లామిక్‌ సంస్థలు రాష్ట్రంలోని వివిధ కమ్యూనిస్టు పార్టీల ప్రత్యక్ష, పరోక్ష మద్దతును పొందుతున్నాయి. కేరళలోని వివిధ లౌకికవాద రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా ఇటువంటి వంచనకు పాల్పడుతున్నాయి. ఆ పార్టీల ధోరణిని హిందువులు తీవ్రంగా నిరసిస్తున్నారు.

ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో చాలామంది హిందువులు తమ తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి, మతాచారాలను పాటించడానికి ఇంకెంత మాత్రం భయపడడం లేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా మార్క్సిస్టులకు మంచి పట్టు ఉన్న రాష్ట్రం కేరళ. అటువంటి రాష్ట్రంలో మతాచారాలలో ప్రజలలో శ్రద్ధాసక్తుల పునరుద్ధరణ తమ రాజకీయ ప్రభావ ప్రాబల్యాలకు సవాల్‌గా పరిణమించగలదని మార్క్సిస్టులు భయపడుతున్నారు. మతానికి మళ్ళీ ప్రాధాన్యం పెరిగి రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా పరిణమిస్తే సంప్రదాయ మార్క్సిస్టు కుటుంబాలపై పార్టీ ప్రభావం, పట్టు సన్నగిల్లిపోతాయని కూడా మార్క్సిస్టు నాయకులు అమితంగా భయపడుతున్నారు.

కేరళలో చాలా పురాతన, అత్యంత గౌరవనీయ కుటుంబాల నుంచి ప్రముఖ మార్క్సిస్టులు ఎందరో ప్రభవించారు మాజీ ముఖ్యమంత్రులు, మార్క్సిస్టు సిద్ధాంతకర్తలు ఇఎమ్‌ఎస్‌ నంబూద్రిపాద్‌ (సిపిఎమ్‌), ఎమ్‌ ఎన్‌ గోవిందన్‌ నాయర్‌ (సిపిఐ) కుటుంబ నేపధ్యాలే ఇందుకు ఉదాహరణలు. నంబూద్రిపాద్‌ కమ్యూనిస్టు, నాస్తికుడు అయినప్పటికీ పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం ఆయన్ని‘కామ్రేడ్‌’ అని గాక మత పరమైన గౌరవ వాచకాలతో సంబోధించేవారు. కేరళ సమాజంలో మతం పట్ల హిందువులలో అనురక్తి పెరుగుతోంది. ఈ శ్రద్ధ క్రమంగా విదేశీ భావజాలమైన మార్క్సిజం పట్ల ఆదర భావాన్ని బలహీన పరచి, వారు దేశీయ భావ స్రవంతులవైపు మొగ్గేలా చేస్తోంది. ఎళుతుచ్ఛన్‌ రామాయణ పఠనానికి పెరుగుతోన్న ఆదరణే ఈ మార్పుకొక కచ్చితమైన నిదర్శనం. మార్క్సిస్టు పార్టీ నాయకులు ఈ వాస్తవాలను అర్థం చేసుకున్నారు. కనుకనే వారు తమ కార్యకర్తల సైద్ధాంతిక నిష్ఠ గురించి భయపడుతున్నారు. ఏడున్నర దశాబ్దాల పాటు కమ్యూనిస్టు సిద్ధాంత బోధన తరువాత కూడా రష్యన్లు సోవియిట్‌ వ్యవస్థను ఎలా కూల్చివేశారో మన మార్క్సిస్టులకు బాగా తెలుసు సమా!

-బల్బీర్‌ పుంజ్‌
(వ్యాసకర్త సీనియర్‌ బీజేపీ నాయకుడు)

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here