Home Telugu Articles ఎమర్జన్సీ కాలంలో రాజ్యాంగ సవరణ, ‘సోషలిస్టు, సెక్యులర్‌’ పదాలను చేర్చిన ఇందిరా గాంధీ

ఎమర్జన్సీ కాలంలో రాజ్యాంగ సవరణ, ‘సోషలిస్టు, సెక్యులర్‌’ పదాలను చేర్చిన ఇందిరా గాంధీ

0
SHARE

1948 నవంబర్‌ 15 సోమవారం.

భారత రాజ్యాంగ నిర్ణయ సభ న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ హాలులో ఉదయం 10 గంటలకు కొలువుతీరింది. ఉపాధ్యక్షుడు డాక్టర్‌ హెచ్‌.సి.ముఖర్జీ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. స్వతంత్ర భారతావని కోసం తయారవుతున్న నూతన రాజ్యాంగం ముసాయిదాపై క్లాజుల వారీగా చర్చ కొనసాగుతున్నది.

‘ఇప్పుడు సవరణలలోకి వెళదాం. సవరణ నెంబర్‌ 98. ప్రొఫెసర్‌ కె.టి.షాది’ అని అధ్యక్షులు పిలవగానే బిహార్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ కె.టి.షా లేచి-

‘మొట్టమొదటి అధికరణంలోని మొదటి క్లాజులో ‘సెక్యులర్‌, ఫెడరల్‌, సోషలిస్టు’ పదాలను చేర్చి ‘India shall be a secular, Federal, Socialist Union of States’ అని మార్చాలని నేను ప్రతిపాదిస్తున్నాను’ అన్నారు. అందుకు కారణాలను వివరిస్తూ చేసిన ప్రసంగంలో ఆయన ఇలా చెప్పారు.

‘మనది సెక్యులర్‌ రాజ్యమని ప్రతి వేదిక మీద పదేపదే వింటున్నాము. అది నిజమైతే ఆ మాట రాజ్యాంగంలోనే ఎందుకు జోడించకూడదు? అలా చేస్తే అపార్థానికీ, అనుమానికీ ఎలాంటి ఆస్కారం ఉండదు కదా ? మనం నమూనాలుగా తీసుకున్న విదేశీ రాజ్యాంగాలలో ‘సెక్యులర్‌’ అన్న పదం లేదన్న సంగతి నేను ఒప్పుకుంటాను. కాని మన అవసరాన్ని బట్టి, రాజ్య స్వభావాన్ని స్పష్టంగా, ధృఢంగా వర్ణించేందుకు మన రాజ్యాంగంలో ఆ పదాన్ని ఇప్పుడు ఎందుకు చేర్చకూడదు ?’

అప్పుడు రాజ్యాంగం డ్రాఫ్టింగ్‌ కమిటీ ఛైర్మన్‌ అయిన గౌరవ సభ్యుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ లేచి షా సవరణ ప్రతిపాదనను కరాఖండిగా వ్యతిరేకించారు ఇలా..

‘అధ్యక్షా! ప్రొఫెసర్‌ కె.టి.షా సవరణను నేను అంగీకరించలేను. ముసాయిదాపై చర్చ ప్రారంభంలోనే నేను చెప్పినట్టు – రాజ్యాంగం అనేది రాజ్యానికి సంబంధించిన వివిధ అంశాల పనిని క్రమబద్ధం చేసే మెకానిజం మాత్రమే. రాజ్య విధానం (పాలసి) ఏమిటి ? సాంఘిక, ఆర్థిక పార్శ్వాల్లో సమాజ వ్యవస్థ ఎలా ఉండాలి ? అనేవి కాలాన్ని, పరిస్థితులను బట్టి ప్రజలే నిర్ణయించవలసిన విషయాలు. దాన్ని రాజ్యాంగంలో నిర్దేశించకూడదు. అలా నిర్దేశించడమంటే ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా నాశనం చేయటమే. సాంఘిక వ్యవస్థ ఫలానా రూపంలోనే ఉండాలని మీరు రాజ్యాంగంలో పేర్కొన్నారనుకోండి. దానివల్ల, తాము ఏ విధమైన సాంఘిక వ్యవస్థలో ఉండాలనుకుంటున్నారన్నది నిర్ణయించే స్వేచ్ఛను మీరు ప్రజల నుంచి లాగేసినట్టే అవుతుంది’.

సభ్యులు గోవింద్‌ దాస్‌, హెచ్‌.వి.కామత్‌లు కూడా సవరణను వ్యతిరేకించారు. అప్పుడు సభాపతి సభ అభిప్రాయం కోరారు.

The Motion Was negatived

సవరణ ప్రతిపాదన తిరస్కరించడమైనది.

(https://indiankanoon.org/doc/163623/)

క్లాజుల వారీ చర్చ అంతా పూర్తయ్యాక చివరిరోజు 1949 అక్టోబర్‌ 17న చిట్టచివరగా రాజ్యాంగం పీఠికను రాజ్యాంగసభ పరిశీలించింది. మౌలానా హస్రత్‌ మొహాని, హెచ్‌.వి.కామత్‌, ఎం.తిరుమలరావు, తానుపిళ్లై, షిబన్‌ లాల్‌ సక్సేనాలు రకరకాల సవరణలు ప్రతిపాదించారు. సభ్యుల సవరణలన్నిటినీ తిరస్కరించి, డ్రాఫ్టింగు కమిటీ సమర్పించిన ఫీఠికను రాజ్యాంగసభ ఆమోదించింది.

రాజ్యాంగపు తొలి పీఠిక

ఆ విధంగా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, అల్లాడి కృష్ణస్వామి, కె.ఎం.మున్షి, సర్దార్‌పటేల్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి దిగ్దంతులు బాబూ రాజేంద్రప్రసాద్‌ అగ్రాసనాధిపత్యంలో కొలువైన స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్ణయ సభ ఖరారు చేసిన రాజ్యాంగ పీఠిక మనది. ‘Sovereign, Democratic Republic’ (సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర) అని మాత్రమే అభివర్ణించింది. ‘సెక్యులర్‌’ అనే విశేషణం లేకుండానే 1950 నుంచి 27 ఏళ్ల పాటు భారత రాజ్యాంగం నిరాఘాటంగా నడిచింది.

రాజ్యాంగపు తొలి పీఠిక

కాని ఇప్పుడు మీరు రాజ్యాంగ పీఠికను చూస్ ‘Sovereign Socialist Secular Democratic Republic’ అని (సర్వసత్తాక సోషలిస్టు సెక్యులర్‌ ప్రజాస్వామ్య రిపబ్లిక్‌) దర్శనమిస్తుంది. ‘సోషలిస్టు, సెక్యులర్‌’ అన్న విశేషణాలు అవసరమా అన్నది 1948లోనే మహామహులైన మన రాజ్యాంగ కర్తలు వివరంగా చర్చించి, అవేవీ అక్కర్లేదని తోసిపుచ్చారు కదా? మరి మొదట వద్దనుకున్న ఆ పదాలు రాజ్యాంగంలోకి ఎప్పుడు చేరాయి ? ఎలా చొరబడ్డాయి ?

ఈ నడమంత్రపు చొరబాటు ఇందిరమ్మ పుణ్యం!

రాజ్యాంగమనేది అక్షరం మార్చకూడని వేదవాక్కు ఏమీ కాదు. కాలాన్నిబట్టి, పరిస్థితులను బట్టి దాన్ని ఎన్నడైనా, ఎలాగైనా మార్చుకోవడానికి రాజ్యాంగ పితరులే అవకాశం కల్పించారు. మొదటి పాతికేళ్లలోనే రాజ్యాంగానికి డజన్లకొద్దీ సవరణలు జరిగిపోయినప్పుడు ఇందిరాగాంధి హయాంలో ఇంకో సవరణ కావడానికి సూత్రరీత్యా ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర్లేదు. సర్వోత్కృష్టమైన పార్లమెంటులో సక్రమంగా చర్చించి, అన్ని పక్షాలనూ సంప్రదించి ప్రజాస్వామ్య బద్ధంగా, వేరే దురుద్దేశాలు లేకుండా యధావిధిగా సవరణ కానిచ్చి ఉంటే దానిని ప్రజల నిర్ణయంగా శిరసావహించవలసిందే.

కాని జరిగిందేమిటి ? ఈ దిక్కుమాలిన సవరణ 1977లో దాపురించింది. అదీ రాజ్యాంగాన్ని చెరబట్టిన ఎమర్జన్సీ గాఢాంధకారంలో! తన ఎన్నిక చెల్లదన్న అలహాబాద్‌ హైకోర్టు తీర్పును వమ్ముచేసి, తన కుర్చీని కాపాడుకోవటం కోసం రాజ్యాంగ వ్యవస్థలకు, ప్రజాస్వామ్య విలువలకు వలువలు వొలిచిన ఇందిరమ్మ అఘాయిత్యాల కాలంలో!! ప్రజల పక్షాన నిలిచిన రాజకీయ పార్టీల, ప్రజా సంస్థల నాయకులందరినీ జైళ్లలో వేసి, పత్రికలకు సెన్సార్‌ సంకెళ్లు వేసి, రాక్షస ఆంక్షలతో పౌర స్వేచ్ఛలను, భావ స్వాతంత్య్రాన్ని కాలరాచిన పైశాచిక స్వైరవిహారంలో!! పౌర హక్కులలాగే సుప్రీంకోర్టు, హైకోర్టుల చేతులనూ కట్టివేసి రాజ్యాంగ సవరణలను, శాసనాల చెల్లుబాట్లను న్యాయస్థానాల్లో సవాలు చేసే వీలే లేకుండా ఇండియా రాజ్యాంగాన్ని ‘ఇందిర రాజ్యాంగం’గా మార్చుకునేందుకు మహాతల్లి బలవంతంగా తెచ్చిపెట్టిన ఇరవై పేజీల 42వ రాజ్యాంగ సవరణలో ఈ పీఠిక మార్పు ఒక భాగం!

సవరించిన రాజ్యాంగ పీఠిక

రాజ్యాంగం అమలయ్యాక ఇప్పటికి వందకు పైగా సవరణలు జరిగినా, అన్నిటిలోకి అత్యంత వివాదాస్పదమైనది, ఏకంగా రాజ్యాంగాన్నే ఎడాపెడా ఇష్టానుసారం మార్చివేసిన నికృష్టపుదీ ఎమర్జన్సీ నాటి ఈ 42వ సవరణ! ఇందులో రాజ్యాంగ పీఠికకు ‘సెక్యులర్‌’ దినుసును జోడించింది రాజ్యవ్యవహారాల్లో మత ప్రమేయం ఉండరాదన్న సద్భావంతో కాదు. అమ్మగారి సుపుత్రుడు సంజయ్‌గాంధి జనాభాను తగ్గించేందుకు వీరతాడు మెడలో వేసుకొని, గర్భనిరోధ ఆపరేషన్లను ఎవరికి పడితే వారికి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా, నిర్బంధంగా చేయించి ముఖ్యంగా ముస్లింలకు కంటగింపు అయ్యాడు. అలా దూరమైన మైనారిటీ ఓటు బ్యాంకును మభ్యపెట్టి మళ్లీ కాంగ్రెసు వైపు తిప్పుకోవడం కోసం ఇందిరమ్మ ‘సెక్యులర్‌’ పాచిక విసిరింది. తనకు పక్క వాయిద్యాలైన కమ్యూనిస్టులను సంతోషపెట్టి, పేదలకేదో ఊడ బొడుస్తున్నట్టు జనాలను భ్రమ కొలపడానికేమో ‘సోషలిస్టు’ సోయగం!

సవరించిన రాజ్యాంగ పీఠిక

అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం లోనే ‘సెక్యులర్‌’ ప్రస్తావన ఉన్నట్టూ, సెక్యులరిజమనేది అనుల్లంఘనీయమైన రాజ్యాంగ కట్టుబాటు అయినట్టూ, అది లేకుంటే మొత్తం రాజ్యాంగ వ్యవస్థ కింద మీద అవుతుందన్నట్టూ అపోహలు పెంచుకున్నవారు గుర్తించవలసిన చారిత్రక వాస్తవాలివి!

1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ అధికారాన్ని ప్రజలు పట్టుబట్టి ఊడగొట్టాక గద్దెనెక్కిన జనతా కలగూరగంప ఎమర్జన్సీ అఘాయిత్యా లను సరిదిద్ది రాజ్యాంగాన్ని యథాపూర్వస్థితికి తేవడం కోసం 43వ, 44వ రాజ్యాంగ సవరణలనైతే తెచ్చింది. ఆ పని పూర్తయ్యేలోపే జనతా బొంత చిందరవందర అయింది. మూడేళ్లు తిరక్కుండా ఇందిరాగాంధీ మళ్ళీ వచ్చి కూర్చుంది. రాజ్యాంగ సవరణలు కోర్టుల పరిధిలోకి రావని, ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలు గొప్పవని 42వ రాజ్యాంగ సవరణలో చొప్పించిన అంశాలు రాజ్యాంగ విరుద్ధమని అదృష్టవశాత్తూ సుప్రీంకోర్టు 1980 జూలైలో మినర్వా మిల్స్‌ కేసులో కొట్టి వేసింది. దాంతో ఎమర్జన్సీ అత్యాచారం బారినుంచి భారత రాజ్యాంగం చాలా వరకు బయట పడింది.

మరి రాజ్యాంగ పీఠికలో ‘సెక్యులర్‌, సోషలిస్టు’ పరబంధం మాత్రం ఇంకా ఎందుకు కొనసాగు తున్నది ? 42వ రాజ్యాంగ సవరణలోని మిగతా అంశాలను కొట్టివేసిన సుప్రీంకోర్టు దీనిని మాత్రం ఎందుకు రద్దుచేయలేదు?

రద్దు చేయమని ఇప్పటిదాకా ఎవరూ సీరియస్‌గా సుప్రీంకోర్టును అభ్యర్థించలేదు కాబట్టి! ఈ విషయంలో దాఖలైన ఒకటీ అరా వ్యాజ్యాలు ఆషామాషీ మనుషులు తీరికూర్చుని వేసిన పోచుకోలు కేసులు కనుక!

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఎవరూ దావా ఎందుకు వేయలేదు? ఎందుకంటే సెక్యులరిజమనేది మన కల్లబొల్లి రాజకీయ వ్యవస్థలో ‘పవిత్ర గోవు’ లాంటిది కనుక! పొద్దున లేచింది మొదలు ప్రతిదీ కులం దృష్టితో, మతాల దృష్టితో మాత్రమే చూసి, రాజకీయ లబ్దికోసం ఎంతటి నీచానికైనా వెనుదీయని వాడు కూడా తాను ‘సెక్యులర్‌’ అని చెప్పుకుంటాడు కాబట్టి!! నిజమైన సెక్యులర్‌ తత్వం ఏ కోశానా లేకపోయినా, సెక్యులరిస్టు పచ్చబొట్టును ముఖాన పొడిపించుకొంటే గాని రాజకీయ పబ్బం గడవదు కనుక! వాటమైన ఈ కపటాన్ని వదిలిపెట్టి, పనిగట్టుకొని, సూడో సెక్యులర్‌ వేషాలను సవాలు చేసి, అందరికీ కంటగింపు కావటానికి బతక నేర్చిన వారెవరూ సాధారణంగా ఇష్టపడనందువల్ల !!

–  ఎం.వి.ఆర్‌.శాస్త్రి

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here